జూన్ 29, 2022
రష్యా
యూరోపియన్ కోర్టు నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న రష్యా
2022, జూన్ 11న రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ రెండు బిల్లుల్ని ఆమోదిస్తూ సంతకం చేశాడు. అలా తయారైన రెండు కొత్త చట్టాల ఆధారంగా, రష్యా మార్చి 15, 2022 నుండి యూరోపియన్ మానవ హక్కుల కోర్టులో (ECHR) తనకున్న సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలియజేసింది. ECHR సమ్మతి లేకుండానే రష్యా ఈ పని చేసింది. ఆ రెండు కొత్త చట్టాల వల్ల 2022, మార్చి 15 నుండే రష్యా, ECHR ఇచ్చిన తీర్పులను అమలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే వాటిల్లో యెహోవాసాక్షుల విషయంలో ECHR జూన్ 7న ఇచ్చిన తీర్పు కూడా ఉంది. ఆ తీర్పు ప్రకారం, రష్యా యెహోవాసాక్షుల పనిని నిషేధించడం అన్యాయమని, అక్కడున్న సాక్షుల మీద నేరారోపణ చేయడం ఆపేయాలని, ప్రస్తుతం జైల్లో ఉన్న సాక్షులందర్నీ విడుదల చేయాలని, జప్తు చేసిన ఆస్తులన్నిటినీ తిరిగి ఇచ్చేయాలని లేదా పిటిషన్ పెట్టుకున్న వాళ్లకు నష్టపరిహారంగా దాదాపు 5,90,00,000 యూరోలను (దాదాపు 475 కోట్ల రూపాయలు) ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో భాగంగా ఉన్న రాష్ట్రాల్లో ECHR ఇచ్చే తీర్పులు అమలయ్యేలా చూసుకునేది ఆ కౌన్సిల్ కిందున్న కమిటీ ఆఫ్ మినిస్టర్స్. అయితే రష్యాకి 1996 నుండి కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో సభ్యత్వం ఉంది.
2022, మార్చి 15న రష్యా దాని సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్టు కౌన్సిల్ ఆఫ్ యూరప్‌కి చెప్పింది. ఆ తర్వాతి రోజే అధికారికంగా రష్యాను కౌన్సిల్ నుండి తీసేశారు. అయితే రష్యా, కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో చేరుతున్నప్పుడు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం అది 2022, సెప్టెంబరు 16 వరకు ECHR తీర్పులకు లోబడాల్సి ఉంటుంది.
2022, జూన్ 7న రష్యా, పైన ప్రస్తావించిన రెండు కొత్త చట్టాలను తయారు చేయడానికి అడుగు ముందుకేసింది. అలా, ECHR ఇచ్చిన తీర్పులకు లోబడాల్సిన పని లేకుండా, దాని నుండి బయటికి రావడానికి అది ప్రయత్నించింది. అయితే ఇదంతా జరిగింది ECHR రష్యాలోని మన సహోదరులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన రోజే.
కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో భాగంగా ఉన్న 46 రాష్ట్రాలు, యెహోవాసాక్షులకు సంబంధించిన కేసులను స్థానిక కోర్టుల్లో విచారిస్తున్నప్పుడు ECHR ఇచ్చిన ఈ తీర్పు బాగా ఉపయోగపడుతుంది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తీర్పు వల్ల యెహోవాసాక్షుల మీద రష్యా వేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేలింది. అంతేకాదు ఈ తీర్పు భూవ్యాప్తంగా గొప్ప సాక్ష్యంగా నిలిచింది. అది యెహోవాను, ఆయన పేరును సమర్థించింది. ఈ ఘనతంతా యెహోవాకే!—కీర్తన 83:18.