గ్యోర్గి పోర్చులియాన్ | జీవిత కథ
“యెహోవా మీదున్న ప్రేమ నాకు తట్టుకునే శక్తినిచ్చింది”
సైబీరియాలోని మాగడాన్ ప్రాంతంలో, నన్ను లేబర్ క్యాంప్‌లో వేసినప్పుడు నాకు కేవలం 23 ఏళ్లే. నేను బాప్తిస్మం తీసుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయ్యింది. నాకు అనుభవం లేదు, అందులోనూ ముందూ-వెనకా ఆలోచించకుండా ప్రవర్తించేవాణ్ణి. అందుకే నా తోటి ఖైదీకి మొదటిసారి ప్రీచింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దాదాపు ఒకరినొకరం కొట్టుకునేంత పనైంది.
ఒకప్పుడు కమ్యూనిస్టుగా ఉన్న నేను, మా ప్రాంత ప్రజలు శత్రువులుగా భావించే యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఎలా మారానో తెలుసా? లేబర్ క్యాంప్‌లో వేసినప్పుడు, వేరే దేశానికి పంపించేసినప్పుడు యెహోవా ప్రేమ, ఆయన ఇచ్చిన శిక్షణ ఎన్నో మంచి లక్షణాల్ని పెంచుకోవడానికి నాకెలా సహాయం చేశాయో కూడా చెప్తాను.
న్యాయం కోసం, మనశ్శాంతి కోసం వెదికాను
1930 లో, మోల్డోవాలో ఉన్న టబాని అనే పేద గ్రామంలో పుట్టాను. మేం ఆరుగురు పిల్లలం. మమ్మల్ని పోషించడానికి మా అమ్మానాన్నలు కష్టపడి పశువుల్ని పెంచేవాళ్లు. మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అమ్మ రష్యన్ ఆర్థొడాక్స్ చర్చీకి వెళ్లేది, నాన్నేమో క్యాథలిక్. చర్చీల్లో ప్రీస్టులు చేసే పనుల గురించి మాట్లాడుకుంటూ అమ్మానాన్న టాపు లేచిపోయేలా వాదించుకునేవాళ్లు.
నాకు 18 ఏళ్లు వచ్చేసరికి స్కూలు చదువు పూర్తి చేసుకుని కామ్సోమోల్ అనే సంస్థలో చేరాను. ఆ సంస్థ యువకులకు కమ్యూనిజం గురించి నేర్పించేది. వాళ్లను కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా తీర్చిదిద్దడమే దాని లక్ష్యం. కొంతకాలానికి నేను మా ప్రాంతంలో సెక్రటరీగా ఎన్నికయ్యాను. ప్రజలందరూ అన్నాదమ్ముళ్లు-అక్కాచెల్లెళ్లని, అందరూ సమానమని, ఎవరికీ అన్యాయం చేయకూడదని ఆ సంస్థ నేర్పించే విషయాలు నాకు నచ్చాయి. కానీ సమాజంలో అన్యాయాన్ని, అవినీతిని చూసినప్పుడు ఏమీ చేయలేకపోతున్నందుకు బాధగా అనిపించింది.
కామ్సోమోల్ సంస్థలో నేను చురుగ్గా పనిచేసేవాడ్ని. అందుకే సోవియట్ యూనియన్ a ప్రభుత్వం చర్చీలను మూసేస్తున్నప్పుడు, ఇతర మతసంస్థల్ని లేకుండా చేస్తున్నప్పుడు దానికి మద్దతివ్వక తప్పలేదు. మా గ్రామంలో కొంతమంది యెహోవాసాక్షులు ఉండేవాళ్లు. వాళ్లు నిజాయితీగా, అందరితో శాంతిగా ఉండేవాళ్లు. కాకపోతే వాళ్లు మతపిచ్చోళ్లు అనుకునేవాడ్ని. జీవితంలో నాకు వచ్చిన చాలా ప్రశ్నలకు ఆ యెహోవాసాక్షుల్లో ఒకరే జవాబిస్తారని అప్పటికి నాకు తెలీదు.
మా పెద్దనాన్న పేరు డిమిత్రీ. ఆయన మా గ్రామంలోనే ఉంటాడు, పైగా ఆయనొక యెహోవాసాక్షి. 1952, మే నెలలో ఒకరోజు ఆయన నన్ను “గ్యోర్గి, జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు. ఆయన ఒక్కడే నన్ను పట్టించుకొని ఆ ప్రశ్న అడిగాడు. నిజం చెప్పాలంటే, అప్పటికే నా మనసులో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక ప్రశ్న ఏంటంటే, ‘నిజంగా దేవుడనేవాడు ఉంటే మనందరం ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం?’ ఆ తర్వాతి ఎనిమిది రోజులు మా పెద్దనాన్న నా ప్రశ్నలన్నిటికీ బైబిల్లో జవాబులు చూపించాడు. కొన్నిసార్లయితే, దేవుని గురించి తెల్లవారుజాము మూడింటి వరకు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం!
మా పెద్దనాన్న చెప్పినవన్నీ విన్న తర్వాత క్రమంగా బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను. దానివల్ల, నన్నెంతో ప్రేమించే పరలోక తండ్రి ఉన్నాడని నాకు అర్థమైంది. (కీర్తన 27:10) అప్పటికి నేను బైబిలు గురించి నేర్చుకున్నది చాలా తక్కువే అయినా, యెహోవా మీద ఉన్న బలమైన ప్రేమవల్ల సరైన నిర్ణయం తీసుకోగలిగాను. నేను పనిచేసే సంస్థలోని స్థానిక ఛైర్మన్ ఎంత బెదిరించినా, కమ్యూనిస్టు పార్టీ నుండి బయటికి వచ్చేశాను. స్టడీ మొదలుపెట్టిన నాలుగు నెలలకే, అంటే 1952, సెప్టెంబరులో యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాను.
యెహోవా మీద నాకున్న ప్రేమ పరీక్షించబడింది
అప్పట్లో యెహోవాసాక్షుల పనిపై నిషేధం ఉండేది. అయితే యెహోవా మీద ఎంత ప్రేముందో, నా పనుల ద్వారా చూపించాలనుకున్నాను. అందుకే గ్రామాల్లో ఉన్న సహోదరసహోదరీలకు మన ప్రచురణలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా వెళ్లేవాణ్ణి. అది రిస్క్‌తో కూడినది, ఎందుకంటే నేను కొత్తవ్యక్తిలా ఉన్నానని గ్రామస్థులకు అనుమానం వస్తే వాళ్లు పోలీసులకు చెప్పే అవకాశముంది. మరోవైపు, యెహోవాసాక్షుల్లో కొంతమంది కూడా నన్ను చూసి భయపడ్డారు. ఒకవేళ నేను సంఘంలోకి చొరబడిన సీక్రెట్ పోలీసుల్లో ఒకడ్నేమోనని వాళ్లు అనుకున్నారు. కానీ తర్వాత నిజంగా నేను యెహోవాసాక్షేనని తెలుసుకున్నారు. ఇదిలా ఉంచితే, బాప్తిస్మం తీసుకున్న రెండు నెలలకే నన్ను అరెస్ట్ చేశారు. నిషేధించిన ప్రచురణల్ని తీసుకెళ్లి ఇస్తున్నందుకు నన్ను దోషిగా తీర్పు తీర్చారు.
దాదాపు సంవత్సరంపాటు నన్ను జైల్లోనే ఉంచారు. పోలీసులు చాలాసార్లు ఇంటరాగేట్ చేసి, నా మత నమ్మకాల్ని విడిచిపెట్టమని బలవంతం చేశారు. నేను మాత్రం లొంగలేదు, ఎందుకంటే అప్పటికే యెహోవా మీద చెక్కుచెదరని ప్రేమ పెంచుకున్నాను. చివరికి, యుక్రెయిన్‌లోని ఒడెస్సా నగరం కోర్టులో విచారణ చేయడానికి నన్ను తీసుకెళ్లారు. మా అమ్మానాన్నలు, తోబుట్టువులు యెహోవాసాక్షులు కాకపోయినా వాళ్లను కూడా కోర్టుకు పిలిపించారు.
మోసపోయి ఒక ప్రమాదకరమైన గుంపులో చేరిన వ్యక్తిని విచారణ చేసినట్టు నన్ను విచారణ చేశారు. నాకు పిచ్చిపట్టిందని మా అమ్మానాన్నల్ని, తోబుట్టువుల్ని నమ్మించడానికి అధికారులు ప్రయత్నించారు. అమ్మానాన్నలు భయపడిపోయి, యెహోవాసాక్షుల మతం వదిలేయమని ఏడుస్తూ అడిగారు. కానీ నేను ప్రశాంతంగా మా అమ్మతో ఇలా చెప్పాను: “అమ్మా, భయపడకు. నేను ఎవ్వరి చేతుల్లోనూ మోసపోలేదు. ఎంతోకాలంగా వెదుకుతున్నది నాకు దొరికింది. దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను.” (సామెతలు 23:23) నాకు బైబిలు గురించి ఎక్కువ తెలీదు. కానీ యెహోవాను అంటిపెట్టుకుని ఉండడానికి కావాల్సినంత జ్ఞానం మాత్రం సంపాదించుకున్నాను. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మా అమ్మానాన్నలు నా నమ్మకాల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు. ఇదే సత్యమని అర్థంచేసుకుని యెహోవాసాక్షులయ్యారు.
నాకు 15 సంవత్సరాల శిక్ష విధించి, సైబీరియాలోని కలీమా ప్రాంతానికి ట్రైన్‌లో పంపించారు. కలీమా ప్రాంతం లేబర్ క్యాంప్‌లకు పెట్టింది పేరు. గార్డులు, ఆఫీసర్‌లు ఖైదీల్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి బాగా కొట్టేవాళ్లు, ఆకలితో మాడ్చేవాళ్లు. వాటిని నేనెలా తట్టుకుంటానా అని మొదట్లో అనుకున్నాను.
దేవుడు నా మీద ప్రేమతో శిక్షణ ఇచ్చాడు
నన్ను ఉంచిన క్యాంప్‌లో అప్పటికే 34 మంది యెహోవాసాక్షులు ఉన్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే వాళ్లలో కొంతమంది నాతో మెల్లగా, “మీ గుంపులో ఎవరైనా యెహోనాదాబులు ఉన్నారా?” అని అడిగారు. వాళ్లు యెహోవాసాక్షులని వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్లే అలాంటి బైబిలు పదాల్ని ఉపయోగిస్తారు. అనుభవం ఉన్న ఆ సహోదరులు, కష్టాల్లో బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో నాకు నేర్పించారు. దాంతోపాటు, వివేచన లాంటి క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవడానికి సహాయం చేశారు.
నేను క్యాంప్‌లో మెషీన్‌లను ఆపరేట్ చేసేవాడ్ని. ఒకరోజు, నాతోపాటు పనిచేసే మట్‌ఫియె అనే ఒకతను తనకు 50 మంది సెయింట్ల పేర్లు కంఠస్తం వచ్చని గొప్పలు చెప్పుకున్నాడు. నేను ఆ సెయింట్ల గురించి కించపర్చేలా మాట్లాడినప్పుడు నన్ను కొట్టబోయాడు; నేను పారిపోయాను. ఇదంతా చూసి సహోదరులు నవ్వడం గమనించాను, చాలా బాధనిపించింది. వాళ్ల దగ్గరికెళ్లి, “మీరెందుకు నవ్వుతున్నారు? నేను ప్రీచింగ్ చేయాలనుకున్నాను” అన్నాను. మన లక్ష్యం మంచివార్త ప్రకటించడమే గానీ ప్రజల్ని బాధపెట్టడం కాదని వాళ్లు నాకు దయగా గుర్తుచేశారు. (1 పేతురు 3:15) మట్‌ఫియె ప్రభుత్వాన్ని గౌరవించే వ్యక్తికాదు. యెహోవాసాక్షులు గార్డులను, అధికారులను గౌరవించడం మాత్రం అతనికి నచ్చింది. చివరికి స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి చల్లటి నీళ్లతో నిండివున్న డ్రమ్ములో రహస్యంగా బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను!
క్యాంప్‌కు వచ్చిన కొంతకాలానికే నన్నూ, ఇంకో ఇద్దరు యౌవన సహోదరుల్నీ రాజకీయ విషయాలు చెప్పే క్లాసులకు రమ్మని పిలిచారు. మొదట్లో మేము వాటికి రామని చెప్పాం. అలాంటి క్లాసులకు వెళ్తే మా నమ్మకాల విషయంలో రాజీపడినట్లు అవుతుందని అనుకున్నాం. (యోహాను 17:16) అందుకు శిక్షగా, కటికచీకటిగా ఉండే సెల్‌లో మమ్మల్ని రెండు వారాలపాటు ఉంచారు. నిజానికి, ఆ క్లాసులకు వెళ్లినంత మాత్రాన నమ్మకాల విషయంలో రాజీపడినట్లు అవ్వదని, శ్రద్ధగల సహోదరులు మేం విడుదలయ్యాక వివరించారు. బదులుగా దాన్ని ప్రకటించడానికి ఒక అవకాశంగా చూడమని చెప్పారు. మేం ఇంకా తెలివిగా తయారవ్వడానికి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు బైబిలు సూత్రాల్ని పాటించడానికి ఆ ప్రేమగల సహోదరులు చాలా సహాయం చేశారు.
వాళ్లు నాకు ఓపిగ్గా నేర్పించడం చూసినప్పుడు, యెహోవాకు నా మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమైంది. ఉదాహరణకు, నా తోటి ఖైదీ ఒకతన్ని చీఫ్ అకౌంటెంట్‌గా నియమించారు. అతను ఒకప్పుడు ప్రీస్టుగా పనిచేసేవాడు. భోజన సమయంలో నేను ఎదురుపడిన ప్రతీసారి, “హాయ్ సాతాను కుమారుడా!” అని పలకరించేవాడు. దానికి వెటకారంగా, “హాయ్ నాన్న!” అని జవాబివ్వమని ఇంకో ఖైదీ సలహా ఇచ్చాడు. అతని మాట విని అలా అన్నందుకు బాగా తన్నులు తిన్నాను. జరిగిందంతా తెలిసినప్పుడు, నేను తప్పుగా ప్రవర్తించానని సహోదరులు నాకు అర్థమయ్యేలా చెప్పారు. (సామెతలు 29:11) దాంతో వెళ్లి ఆ ప్రీస్టుకు క్షమాపణ చెప్పాను.
లేబర్ క్యాంప్‌కు పంపించకముందు, రాత్రిపూటగానీ తెల్లవారుజామునగానీ రహస్యంగా మీటింగ్స్ జరుపుకునేవాళ్లం. కానీ క్యాంప్‌లో అలా కుదిరేది కాదు. దాంతో, గార్డులు ఉండగానే మేమందరం రౌండుగా నిల్చొని లేఖనాల్ని చర్చించుకునేవాళ్లం. వాటిని ముందే చిన్న పేపర్ మీద రాసుకుని వచ్చేవాళ్లం. సాధ్యమైనన్ని ఎక్కువ లేఖనాల్ని నేర్చుకుని, ఎప్పుడూ వాటిని గుర్తుతెచ్చుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో అలా చేసేవాళ్లం. ఒకవేళ గార్డులు మా దగ్గరకు వస్తున్నట్లు కనిపిస్తే, మా చేతుల్లో ఉన్న పేపర్లను వెంటనే మింగేసేవాళ్లం.
దూర ప్రాంతానికి పంపించేసినా, దేవుని ప్రేమకు దూరం కాలేదు
1959 లో నన్ను లేబర్ క్యాంప్ నుండి విడుదలచేసి, కజక్‌స్థాన్‌లోని కారగాండా ప్రాంతానికి పంపించారు. నేనింకా అధికారుల పర్యవేక్షణలోనే ఉన్నప్పటికీ, వేరే ఊరెళ్లి పెళ్లిచేసుకుని రావడానికి 20 రోజులు అనుమతి అడిగాను. రష్యాలోని టాంస్క్ ప్రాంతంలో ఉంటున్న మారియ అనే సహోదరితో నాకు పరిచయం ఉంది. ఆమె యెహోవాకు చాలా నమ్మకంగా ఉంటుంది. నేను సాధారణంగా ముక్కుసూటిగా మాట్లాడుతుంటాను కదా; ఆమె దగ్గరికి వెళ్లినప్పుడు కూడా అలానే మాట్లాడాను. “మారియ, నాకు డేటింగ్ చేసేంత టైం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని సూటిగా అడిగాను. ఆమె ఒప్పుకోవడంతో కొంతమందిని పిలిచి పెళ్లిచేసుకున్నాం. నేను ఎన్ని కష్టాల్ని తట్టుకున్నానో ఆమెకు తెలుసు. ఇకమీదట కూడా యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికి తను నాకు సహాయం చేయాలనుకుంది.—సామెతలు 19:14.
1960లలో, ఇంటింటికి వెళ్లి ప్రకటించే అనుమతిలేదు. మన నమ్మకాల గురించి చెప్పడానికి అవకాశం దొరికితే మాత్రం దాన్ని ఉపయోగించుకునేవాళ్లం. ఎవరైనా మమ్మల్ని ఇంటికి పిలిచినప్పుడు లేదా సెలవులకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ గురించి చెప్పేవాళ్లం. ఇంకొన్నిసార్లు ఇతరులతో మాట్లాడడానికి మేమే అవకాశం కల్పించుకునేవాళ్లం. ఉదాహరణకు, అమ్మకానికి పెట్టిన ఇళ్లకు వెళ్లి ఓనర్స్‌తో మాట్లాడడం మొదలుపెట్టి మెల్లగా మంచివార్త గురించి చెప్పేవాళ్లం. ఈ పద్ధతిని ఉపయోగించే నేనూ, మారియ ఆరుగురికి స్టడీ ఇచ్చాం. వాళ్లందరూ యెహోవాసాక్షులయ్యారు.
కొన్నిసార్లు, ఎన్నికల సమయంలో సాక్ష్యమిచ్చే అవకాశం దొరికేది. ఒకరోజు నేనూ, ఇంకొంతమంది సహోదరులు పనిచేసే ఫ్యాక్టరీకి సీక్రెట్ పోలీసులు వచ్చారు. అక్కడ దాదాపు 1,000 మంది వర్కర్లు ఉన్నారు. వాళ్లందరి ముందు పోలీసులు మమ్మల్ని, ‘యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు పాల్గొనరు?’ అని అడిగారు. చీఫ్ ఇంజనీర్ అలాగే ఇంకొంతమంది వర్కర్లు మా తరఫున మాట్లాడుతూ మేము బాధ్యతగా ఉంటామని, కష్టపడి పనిచేస్తామని చెప్పారు. వాళ్ల మాటలు విన్నాక మాకు ధైర్యం వచ్చింది. గుర్తున్న లేఖనాలు ఉపయోగించి మేం రాజకీయాల్లో ఎందుకు పాల్గొనమో పోలీసులకు వివరించాం. భయపడకుండా మేము చెప్పిన విషయాలు విని, నలుగురు వర్కర్లు బైబిలు గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. సంవత్సరం తిరిగేలోపే బాప్తిస్మం కూడా తీసుకున్నారు.
కజక్‌స్థాన్‌లో, 1970లలో వినే హృదయం ఉన్న చాలామంది యెహోవాసాక్షులయ్యారు. కాబట్టి మొట్టమొదటిసారి అక్కడ సమావేశం పెట్టాలనుకున్నాం. కానీ అధికారులకు తెలీకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎలా? బాగా ఆలోచించి ఆల్మాటి నగరం దగ్గరున్న పల్లెటూర్లో ఒక పెళ్లి జరుగుతుంటే అదే టైంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ రోజు పెళ్లితోపాటు సమావేశం కూడా జరిగింది. దానికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు కాకుండా 300 కన్నా ఎక్కువమంది అతిథులు వచ్చారు. నా భార్య, అలాగే ఇంకొంతమంది సహోదరీలు కలిసి హాల్‌ని అందంగా డెకరేట్ చేశారు, ఘుమఘుమలాడే వంటలు వండారు. వచ్చిన అతిథులు భోజనంకన్నా ఎక్కువగా, సుమారు 12 మంది సహోదరులు ఇచ్చిన ప్రసంగాల్ని ఆనందించారు. ఆరోజు నేను కూడా ప్రసంగం ఇచ్చాను. అంతమంది ముందు ప్రసంగం ఇవ్వడం నా జీవితంలో అదే మొదటిసారి.
కష్టాల్ని తట్టుకోవడానికి దేవుని ప్రేమే సహాయం చేసింది
నా భార్య మారియ జీవించినంతకాలం నమ్మకంగా ఉంటూ నాకు చాలా సహాయం చేసింది. తను సౌమ్యంగా ఉండేది, మాట వినేది. అన్నిటికన్నా ఎక్కువగా దేవుని రాజ్యానికే మొదటిస్థానం ఇచ్చేది. ఎప్పుడూ బలంగానే ఉండేది గానీ, హఠాత్తుగా ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి (ఎముకలకు సంబంధించినది) వచ్చి దాదాపు 16 సంవత్సరాలు మంచానికే పరిమితమైంది. 2014 లో తను చనిపోయేంతవరకు, నేనూ మా కూతురు లూద్మిలా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాం.
కళ్లముందే నా భార్య బాధపడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. కానీ తను చనిపోయే రోజు వరకు మేమిద్దరం కలిసి బైబిల్నీ, ప్రోత్సాహాన్నిచ్చే ఆర్టికల్స్‌నీ చదివాం. తరచూ కొత్తలోకం గురించి మాట్లాడుకునేవాళ్లం. కొన్నిసార్లు తన పక్కనే కూర్చుని తనకు వినబడకుండా ఏడ్చేవాడ్ని. యెహోవా మాటిచ్చిన వాటిగురించి మేము చదివిన ప్రతీసారి ప్రశాంతంగా అనిపించేది, తట్టుకోవడానికి బలమొచ్చేది.—కీర్తన 37:18; 41:3.
యెహోవా ప్రేమను అర్థం చేసుకున్న మొదటిరోజు నుండి ఇప్పటివరకు ఆయన సహాయాన్ని, శ్రద్ధను చూస్తూనే ఉన్నాను. (కీర్తన 34:19) యౌవనంలో నాకు అనుభవంలేనప్పుడు, మంచి లక్షణాల్ని పెంచుకోవడానికి ఓపిగ్గా సహాయం చేసే సహోదరుల్ని ఇచ్చి యెహోవా నా మీద ప్రేమ చూపించాడు. లేబర్ క్యాంప్‌లో కష్టాలు పడుతున్నప్పుడు, దూర ప్రాంతానికి పంపించేసినప్పుడు ఆయన తన వాక్యం ద్వారా నాకు అండగా ఉన్నాడు. నా భార్య మంచం పట్టినప్పుడు, తన చివరిశ్వాస వరకు ఆమె బాగోగుల్ని చూసుకోవడానికి నాకు అవసరమైన బలాన్నిచ్చాడు. వీటన్నిటినిబట్టి, ఒక్కమాట చెప్పగలను. యెహోవా మీదున్న ప్రేమవల్లే జీవితంలో ఎదురైన కష్టాలన్నిటినీ తట్టుకోగలిగాను!
a 1991 వరకు కజక్‌స్థాన్, మోల్డోవా, యుక్రెయిన్ ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేవి.