అప్రమత్తంగా ఉండండి!
2022: గుండెల్లో గుబులు పుట్టించిన సంవత్సరం—బైబిలు ఏం చెప్తోంది?
యుద్ధం, ఆర్థిక సమస్యలు, ప్రకృతి విపత్తులు—2022 సంవత్సరమంతా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జవాబు బైబిలు మాత్రమే ఇవ్వగలదు.
2022లో జరిగిన సంఘటనలు—వాటి అసలైన అర్థం
బైబిలు ’చివరి రోజులు’ అని పిలుస్తున్న కాలంలో మనం జీవిస్తున్నామని, పోయిన సంవత్సరంలో జరిగిన సంఘటనలు మరింత స్పష్టంగా నిరూపిస్తున్నాయి. (2 తిమోతి 3:1) ఆ ’చివరి రోజులు’ 1914లో మొదలయ్యాయి. మనకాలం గురించి బైబిలు ముందే చెప్పిన విషయాలు, ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఎలా సరిపోతున్నాయో ఒకసారి గమనించండి:
“యుద్ధాలు.”—మత్తయి 24:6.
“యూరప్‌కు మళ్లీ యుద్ధ భయాన్ని రుచి చూపించిన 2022.” a
“యుక్రెయిన్‌పై రష్యా దాడి” ఆర్టికల్ చూడండి.
“ఆహారకొరతలు.”—మత్తయి 24:7.
“2022: ఆకలి కేకలు వినిపించిన సంవత్సరం.” b
“యుక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్త ఆహారకొరతల్ని మరింత పెంచుతోంది” ఆర్టికల్ చూడండి.
“పెద్దపెద్ద అంటువ్యాధులు.”—లూకా 21:11.
“మళ్లీ నమోదైన పోలియో కేసులు, పెరుగుతూ పోయిన మంకీ పాక్స్ కేసులు, అడ్డూ-అదుపూ లేకుండా విస్తరిస్తోన్న కోవిడ్—అంటువ్యాధులు ఎంత ప్రమాదకరమైనవో, మనుషులు ఎంత తేలిగ్గా వాటి బారినపడగలరో కళ్లకు కట్టినట్లు చూపించాయి.” c
“కోవిడ్ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది” ఆర్టికల్ చూడండి.
“భయంకరమైన దృశ్యాలు.”—లూకా 21:11.
“వడగాల్పులు, కరువులు, అడవులు కాలిపోవడం, వరదలు. 2022 వేసవికాలంలో చోటుచేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పుల్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. వాటివల్ల తీరని నష్టం జరగడంతో పాటు, వేలమంది ప్రాణాలు పోయాయి, ఎన్నో లక్షల మంది సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు.” d
“ప్రపంచమంతటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు” ఆర్టికల్ చూడండి.
“అల్లకల్లోల పరిస్థితులు [లేదా, “తిరుగుబాట్లు,” అధస్సూచి].”—లూకా 21:9.
“ఆర్థిక సమస్యలు పెరగడం చూసి ప్రజల ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ముఖ్యంగా రేట్లు ఆకాశాన్ని అంటడంతో, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో చేసినన్ని ధర్నాలు ముందెప్పుడూ జరగలేదు.” e
“ప్రపంచవ్యాప్తంగా మండుతున్న ధరలు” ఆర్టికల్ చూడండి.
తర్వాత సంవత్సరం ఎలా ఉంటుంది?
2023లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, అతి త్వరలో దేవుని రాజ్యం లేదా పరలోక ప్రభుత్వం, ఈ భూమ్మీద చాలా పెద్దపెద్ద మార్పులు తీసుకొస్తుంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వం మనుషుల కష్టాలకు కారణమయ్యే ప్రతీదాన్ని తీసేస్తుంది, దేవుని ఇష్టం ఈ భూమ్మీద జరిగేలా చేస్తుంది.—మత్తయి 6:9, 10.
యేసుక్రీస్తు ఇచ్చిన సలహాను పాటిస్తూ ’అప్రమత్తంగా ఉండమని,’ బైబిలు ముందే చెప్పిన విషయాలు మనకాలంలో ఏ విధంగా నెరవేరుతున్నాయో గమనిస్తూ ఉండమని కోరుతున్నాం. (మార్కు 13:37) బైబిల్లో ఉన్న విషయాలు మీకు ఇప్పుడు సహాయం చేస్తాయి; అలాగే మీరూ-మీ కుటుంబం మంచి భవిష్యత్తును పొందుతారనే ఆశను మీలో నింపుతాయి. అదెలాగో తెలుసుకోవాలంటే దయచేసి మమ్మల్ని అడగండి.
a AP న్యూస్, “యూరప్‌కు మళ్లీ యుద్ధ భయాన్ని రుచి చూపించిన 2022,” రాసింది జిల్ లాలెస్, డిసెంబరు 8, 2022.
b ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం, “ప్రపంచమంతటా పెరుగుతున్న ఆకలి కేకలు.”
c JAMA హెల్త్ ఫోరమ్, “మహమ్మారుల కాలంలో జీవితం—కోవిడ్-19 మొదలుకొని మంకీ పాక్స్, పోలియో, డిసీజ్ ఎక్స్ వరకు,” రాసింది లారెన్స్ ఓ. గోస్టిన్, జెడి, సెప్టెంబరు 22, 2022.
d Earth.Org, “2022 వేసవికాలంలో రికార్డు స్థాయిలో చోటుచేసుకున్న వాతావరణ మార్పులు—వాటి వెనకున్న కారణం ఏంటి?” రాసింది మార్టినా ఇగినీ, అక్టోబరు 24, 2022.
e కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, “2022లో ఆర్థిక సమస్యల వల్ల ప్రపంచమంతటా పెరిగిన నిరసనలు,” రాసింది థామస్ కారోతర్స్ & బెంజమిన్ ఫెల్డ్మ్యాన్, డిసెంబరు 8, 2022.