అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా కాల్పుల కలకలం—బైబిలు ఏం చెప్తుంది?
2022, జూలైలో, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కాల్పుల కలకలం రేగింది:
“జపాన్ ప్రముఖ రాజకీయవేత్త [మాజీ ప్రధాన మంత్రి షింజో అబె] హత్యతో, దేశమంతా అలాగే ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హింస తక్కువగా ఉండే, తుపాకీ చట్టాలు కఠినంగా ఉండే జపాన్లో ఇలా జరగడం షాక్కు గురిచేస్తోంది.”—జూలై 10, 2022, ద జపాన్ టైమ్స్.
“కోపెన్హాగన్ షాపింగ్ మాల్లో, ఒక దుండగుడు ముగ్గుర్ని కాల్చి చంపడంతో డెన్మార్క్ మొత్తం ఉలిక్కిపడింది.”—జూలై 4, 2022, ర్యూటర్స్.
“దక్షిణాఫ్రికా: సోవెటో టౌన్షిప్లోని ఒక బార్లో దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో 15 మంది చనిపోయారు.”—జూలై 10, 2022, ద గార్డియన్.
“యునైటెడ్ స్టేట్స్లో, జూలై 1-4 మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో 220 కన్నా ఎక్కువమంది మరణించారు.”—జూలై 5, 2022, CBS న్యూస్.
అలాంటి హింస ఎప్పటికైనా ఆగుతుందా? బైబిలు ఏం చెప్తుంది?
హింసకు ఒక ముగింపు
మనం జీవిస్తున్న కాలాన్ని బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తుంది. ఈ సమయంలో క్రూరంగా, కిరాతకంగా, అమానుషంగా ప్రవర్తించేవాళ్లు ఉంటారు. (2 తిమోతి 3:1, 3) దానివల్ల ప్రజలు అనుక్షణం భయపడుతూ బ్రతుకుతారు. (లూకా 21:11) అయితే, హింసకు ఒక ముగింపు ఉందని, అప్పుడు “ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో, సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు” అని బైబిలు మాటిస్తుంది. (యెషయా 32:18) ఇంతకీ, హింస ఎలా పోతుంది?
దేవుడు చెడ్డవాళ్లను తీసేస్తాడు, ఆయుధాలన్నిటినీ ముక్కలుముక్కలు చేస్తాడు.
“దుష్టులు భూమ్మీద ఉండకుండా నాశనం చేయబడతారు.”—సామెతలు 2:22.
“[దేవుడు] భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు. విల్లును విరగ్గొడతాడు, ఈటెను ముక్కలుముక్కలు చేస్తాడు, యుద్ధ రథాల్ని అగ్నిలో కాల్చేస్తాడు.”—కీర్తన 46:9.
శాంతిగా ఎలా జీవించాలో ప్రజలకు నేర్పించడం ద్వారా, దేవుడు హింసను కూకటివేళ్లతో సహా తీసేస్తాడు.
“నా పవిత్ర పర్వతమంతటి మీద అవి హాని గానీ నాశనం గానీ చేయవు, ఎందుకంటే సముద్రం నీళ్లతో నిండివున్నట్టు భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.”—యెషయా 11:9.
ఇప్పుడు కూడా, దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హింసను-ఆయుధాల్ని విడిచిపెట్టడం, “తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా” మార్చుకోవడం నేర్పిస్తున్నాడు.—మీకా 4:3.
భయమే ఉండని లోకం గురించి బైబిలు ఏం మాటిస్తుందో తెలుసుకోవడానికి, “భయమే ఉండని లోకం—అది సాధ్యమేనా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చదవండి.
హింస పూర్తిగా ఎప్పుడు పోతుందో తెలుసుకోవడానికి, “చివరకు భూమ్మీద శాంతి!” అనే ఆర్టికల్ చదవండి.