మన క్రైస్తవ జీవితం
‘పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు’
పౌలు వస్తున్నాడని రోమా సంఘానికి తెలిసినప్పుడు, కొంతమంది సహోదరులు ఆయన్ని కలుసుకోవడానికి దాదాపు 64 కిలోమీటర్లు ప్రయాణించారు. వాళ్లు చూపించిన నిస్వార్థమైన ప్రేమ పౌలు పై ఎలాంటి ప్రభావం చూపించింది? “పౌలు వాళ్లను చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.” (అపొ 28:15) తను వెళ్లిన సంఘాలను ప్రోత్సహించే వ్యక్తిగా పౌలుకు మంచి పేరుంది, అయితే ఈ సందర్భంలో బందీగా ఉన్న పౌలు తానే ప్రోత్సాహాన్ని పొందాడు.—2 కొరిం 13:10.
నేడు ప్రాంతీయ పర్యవేక్షకులు సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడానికి వేర్వేరు సంఘాలకు ప్రయాణిస్తారు. దేవుని ప్రజలందరిలాగే వాళ్లు కూడా కొన్నిసార్లు అలసిపోతారు, ఆందోళన పడతారు, నిరుత్సాహ పడతారు. ప్రాంతీయ పర్యవేక్షకుడు, ఆయన భార్య ఈసారి మీ సంఘానికి వచ్చినప్పుడు, ‘ఒకరి వల్ల ఒకరు ప్రోత్సాహం పొందేలా’ మీరు వాళ్లను ఎలా ధైర్యపర్చవచ్చు?—రోమా 1:11, 12.
-
క్షేత్ర సేవా కూటాలకు మద్దతివ్వండి. ఆ ప్రత్యేకమైన వారం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా ప్రచారకులు అవసరమైన సర్దుబాట్లు చేసుకున్నప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రోత్సాహం పొందుతాడు. (1 థెస్స 1:2, 3; 2:20) ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రయత్నించండి. మీరు పరిచర్యలో ఆయనతో, ఆయన భార్యతో కలిసి పనిచేయగలరా? వాళ్లను మీ బైబిలు అధ్యయనాలకు తీసుకెళ్లగలరా? వాళ్లు కొత్త ప్రచారకులతో, అంతగా నైపుణ్యంలేని ప్రచారకులతో సహా అందరితో పనిచేయడాన్ని ఇష్టపడతారు.
-
ఆతిథ్యం ఇవ్వండి. వాళ్లను మీ ఇంట్లో ఉంచుకోగలరా లేదా వాళ్లను భోజనానికి పిలవగలరా? అలా మీకు వాళ్ల మీద ప్రేమ ఉందని చూపించవచ్చు. వాళ్లు మీ నుండి మరీ ఎక్కువ ఆశించరు.—లూకా 10:38-42.
-
ఆయన ఇచ్చే నిర్దేశాన్ని, సలహాను విని పాటించండి. యెహోవా సేవలో మనం మరింత ప్రగతిని ఎలా సాధించవచ్చో ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రేమపూర్వకంగా మనకు తెలియజేస్తాడు. కొన్నిసార్లు, ఆయన మనల్ని గట్టిగా హెచ్చరించాల్సి రావచ్చు. (1 కొరిం 5:1-5) మనం మాట విని, లోబడినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు.—హెబ్రీ 13:17.
-
కృతజ్ఞతలు చెప్పండి. వాళ్ల కృషి వల్ల మీరెలాంటి ప్రయోజనాలు పొందారో ప్రాంతీయ పర్యవేక్షకునికి, ఆయన భార్యకు చెప్పండి. మీరు వ్యక్తిగతంగా కలిసి ఆ మాటలు చెప్పవచ్చు లేదా ఏదైనా కార్డు మీద రాసి ఇవ్వవచ్చు.—కొలొ 3:15.