సమూయేలు రెండో గ్రంథం 7:1-29

  • దావీదు ఆలయాన్ని కట్టడు (1-7)

  • రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (8-17)

  • దావీదు కృతజ్ఞతా ప్రార్థన (18-29)

7  రాజు తన రాజభవనంలో స్థిరపడి,+ చుట్టుపక్కల శత్రువులందరి నుండి యెహోవా అతనికి విశ్రాంతి ఇచ్చాక, 2  రాజు నాతాను+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నేను ఇక్కడ దేవదారు మ్రానులతో+ చేసిన ఇంట్లో నివసిస్తుంటే సత్యదేవుని మందసమేమో డేరాలో ఉంది.”+ 3  దానికి నాతాను, “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్లి నీ మనసులో ఏముంటే అది చేయి” అని దావీదు రాజుతో అన్నాడు.+ 4  ఆ రాత్రే యెహోవా వాక్యం నాతాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 5  “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నివసించడానికి నా కోసం ఒక మందిరం కడతావా?+ 6  ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు* నుండి బయటికి తీసుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఒక మందిరంలో నివసించలేదు;+ నేను ఒక డేరాలో, ఒక గుడారంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను.+ 7  నేను ఇశ్రాయేలీయులందరితో* ప్రయాణించిన కాలమంతటిలో, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాయడానికి నేను నియమించిన ఇశ్రాయేలు గోత్ర పెద్దల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, ‘మీరు నా కోసం దేవదారు మ్రానులతో మందిరం ఎందుకు కట్టలేదు?’ అని ఒక్కమాటైనా అన్నానా?” ’ 8  ఇప్పుడు నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెల్ని కాసే నిన్ను+ పచ్చికబయళ్లలో నుండి తీసుకొచ్చి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకుణ్ణి చేశాను.+ 9  నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీకు తోడు ఉంటాను,+ నీ ఎదుట నుండి నీ శత్రువులందర్నీ నాశనం చేస్తాను;+ నేను నీ పేరును గొప్ప చేస్తాను,+ నువ్వు భూమ్మీదున్న గొప్పవాళ్లలో ఒకడివి అవుతావు. 10  నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలం నియమించి వాళ్లు అందులో స్థిరపడేలా చేస్తాను, వాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా అక్కడ నివసిస్తారు; గతంలో జరిగినట్టుగా దుష్టులు ఇక వాళ్లను అణచివేయరు.+ 11  నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతుల్ని నియమించిన+ రోజు నుండి దుష్టులు వాళ్లను అణచివేస్తూ వచ్చారు. నేను నీ శత్రువులందరి నుండి నీకు విశ్రాంతినిస్తాను.+ “ ‘ “అంతేకాదు, యెహోవా నీ కోసం ఒక రాజవంశాన్ని కడతాడని యెహోవా నీకు చెప్పాడు.+ 12  నీ రోజులు ముగిసిపోయి నువ్వు చనిపోయాక,* నీ సంతానాన్ని,* అంటే నీ సొంత కుమారుణ్ణి రాజును చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.+ 13  అతనే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు,+ నేను అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.+ 14  నేను అతనికి తండ్రిని అవుతాను, అతను నాకు కుమారుడు అవుతాడు.+ అతను తప్పు చేస్తే నేను అతన్ని సరిదిద్దుతాను,* మనుషులు చేసినట్టు నేను అతన్ని దెబ్బలతో శిక్షిస్తాను.+ 15  నీ ఎదుట నుండి నేను తొలగించిన సౌలు నుండి దూరం చేసినట్టు, అతని నుండి నా విశ్వసనీయ ప్రేమను దూరం చేయను.+ 16  నీ రాజవంశం, నీ రాజ్యం నీ ఎదుట ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి; నీ సింహాసనం ఎల్లప్పుడూ స్థిరపర్చబడుతుంది.” ’ ”+ 17  నాతాను ఆ మాటలన్నిటినీ, ఆ దర్శనమంతటినీ దావీదుకు చెప్పాడు. 18  అప్పుడు దావీదు రాజు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలా అన్నాడు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నా కోసం ఇంత చేయడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఎంతటిది? 19  సర్వోన్నత ప్రభువైన యెహోవా, అది చాలదన్నట్టు, నీ సేవకుని రాజవంశం సుదూర భవిష్యత్తు వరకు నిలుస్తుందని కూడా చెప్పావు; సర్వోన్నత ప్రభువైన యెహోవా, మనుషులందరికీ ఇది ఒక ఉపదేశం.* 20  సర్వోన్నత ప్రభువైన యెహోవా, నీ సేవకుడైన దావీదు నీతో ఇంకేమి అనగలడు? నేను నీకు బాగా తెలుసు.+ 21  నీ మాటను బట్టి, నీ ఇష్టప్రకారం* నువ్వు ఈ గొప్ప పనులన్నిటినీ చేసి వాటిని నీ సేవకునికి తెలియజేశావు.+ 22  అందుకే, సర్వోన్నత ప్రభువైన యెహోవా నువ్వు నిజంగా గొప్పవాడివి.+ నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+ నువ్వు తప్ప వేరే దేవుడు లేడు; మా చెవులతో విన్నవన్నీ ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. 23  నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా భూమ్మీద ఇంకే ప్రజలు ఉన్నారు? దేవా, నువ్వు వెళ్లి వాళ్లను విడిపించి, నీ ప్రజలుగా చేసుకున్నావు.+ నువ్వు వాళ్ల కోసం ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప పనులు చేసి, నీ కోసం ఒక పేరు సంపాదించుకున్నావు.+ ఐగుప్తు నుండి నీ దగ్గరికి విడిపించుకున్న నీ ప్రజల కోసం నువ్వు దేశాల్ని, వాళ్ల దేవుళ్లను వెళ్లగొట్టావు. 24  నువ్వు ఇశ్రాయేలీయుల్ని శాశ్వతంగా నీ ప్రజలుగా చేసుకున్నావు;+ యెహోవా, నువ్వు వాళ్లకు దేవుడివి అయ్యావు. 25  “ఇప్పుడు యెహోవా దేవా, నీ సేవకుని విషయంలో, అతని రాజవంశం విషయంలో నువ్వు చేసిన వాగ్దానాన్ని శాశ్వతకాలం నెరవేర్చు, నువ్వు మాటిచ్చినట్టే చేయి.+ 26  ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలు అనేలా నీ పేరు ఎప్పటికీ హెచ్చించబడాలి.+ నీ సేవకుడైన దావీదు రాజవంశం నీ ఎదుట స్థిరపర్చబడాలి.+ 27  సైన్యాలకు అధిపతైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నీ కోసం నేను ఒక రాజవంశాన్ని కడతాను’ అని నువ్వే నీ సేవకునికి తెలియజేశావు. అందుకే నీ సేవకుడు నీకు ఇలా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. 28  సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వే సత్యదేవుడివి. నీ మాటలు సత్యం,+ నువ్వు ఈ మంచి విషయాల్ని నీ సేవకునికి వాగ్దానం చేశావు. 29  కాబట్టి నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ నీ ఎదుట ఉండేలా నువ్వు దాన్ని దీవిస్తూ ఉండాలి;+ ఎందుకంటే, సర్వోన్నత ప్రభువైన యెహోవా, వాగ్దానం చేసింది నువ్వే. నీ దీవెనతో నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ దీవించబడాలి.”+

అధస్సూచీలు

లేదా “ఈజిప్టు.”
అక్ష., “ఇశ్రాయేలు కుమారులందరితో.”
అక్ష., “విత్తనాన్ని.”
అక్ష., “నీ పూర్వీకులతో నిద్రించాక.”
అక్ష., “మనుషుల కర్రతో నేను అతన్ని గద్దిస్తాను.”
లేదా “నియమం.”
లేదా “నీ హృదయానికి అంగీకారమైన విధంగా.”