రాజులు రెండో గ్రంథం 2:1-25

  • ఏలీయాను సుడిగాలిలో పైకి తీసుకెళ్లడం (1-18)

    • ఏలీయా అధికారిక వస్త్రాన్ని ఎలీషా తీసుకోవడం (13, 14)

  • ఎలీషా యెరికో నీళ్లను బాగుచేయడం (19-22)

  • ఎలుగుబంట్లు బేతేలు పిల్లల్ని చంపడం (23-25)

2  యెహోవా ఏలీయాను+ సుడిగాలిలో ఆకాశానికి తీసుకెళ్లే సమయం వచ్చినప్పుడు+ ఏలీయా, ఎలీషా+ గిల్గాలు+ నుండి బయల్దేరారు. 2  అప్పుడు ఏలీయా ఎలీషాతో, “దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ ఎలీషా, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. వాళ్లు బేతేలుకు+ వెళ్లారు. 3  తర్వాత బేతేలులోని ప్రవక్తల కుమారులు* ఎలీషా దగ్గరికి వచ్చి, “యెహోవా నీ యజమానిని తీసుకెళ్తున్నాడని, నీ నాయకుడు నిన్ను విడిచివెళ్తున్నాడని నీకు తెలుసా?”+ అన్నారు. దానికి అతను, “నాకు తెలుసు, దాని గురించి మాట్లాడకండి” అన్నాడు. 4  తర్వాత ఏలీయా, “ఎలీషా, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యెరికోకు+ వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ ఎలీషా, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. వాళ్లు యెరికోకు వచ్చారు. 5  అప్పుడు యెరికోలోని ప్రవక్తల కుమారులు ఎలీషా దగ్గరికి వచ్చి, “యెహోవా నీ యజమానిని తీసుకెళ్తున్నాడని, నీ నాయకుడు నిన్ను విడిచివెళ్తున్నాడని నీకు తెలుసా?” అన్నారు. దానికి అతను, “నాకు తెలుసు, దాని గురించి మాట్లాడకండి” అన్నాడు. 6  తర్వాత ఏలీయా ఎలీషాతో, “దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ అతను, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. దాంతో వాళ్లిద్దరూ ప్రయాణాన్ని కొనసాగించారు. 7  ప్రవక్తల కుమారుల్లో 50 మంది వాళ్ల వెనకే వచ్చి, వాళ్లిద్దరూ యొర్దాను నది దగ్గర నిలబడివున్నప్పుడు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు. 8  అప్పుడు, ఏలీయా తన అధికారిక వస్త్రాన్ని+ తీసి, చుట్టి, దానితో నీళ్లమీద కొట్టాడు. దాంతో ఆ నది రెండుగా విడిపోయింది, వాళ్లిద్దరూ పొడినేల మీద నడిచి ఆ నది దాటారు.+ 9  వాళ్లు నది దాటగానే ఏలీయా ఎలీషాతో, “దేవుడు నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లకముందే నీ కోసం నన్నేమి చేయమంటావో అడుగు” అన్నాడు. దానికి ఎలీషా, “దయచేసి నీలో ఉన్న దేవుని పవిత్రశక్తిలో రెండు పాళ్లు+ నాకు ఇవ్వు”+ అని అడిగాడు. 10  అప్పుడు ఏలీయా, “నువ్వు కష్టమైనదాన్ని అడిగావు. దేవుడు నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే, నువ్వు అడిగినట్టు జరుగుతుంది; నువ్వు చూడకపోతే, అలా జరగదు” అన్నాడు. 11  వాళ్లు అలా మాట్లాడుతూ నడుస్తుండగా, ఉన్నట్టుండి ఒక అగ్ని రథం, అగ్ని గుర్రాలు+ వాళ్లిద్దర్నీ వేరు చేశాయి, ఏలీయా సుడిగాలిలో ఆకాశానికి వెళ్లాడు.+ 12  ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ, నా తండ్రీ! ఇదిగో, ఇశ్రాయేలు రథం, దాని గుర్రపురౌతులు!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఏలీయా అతనికి ఇక కనిపించలేదు, అప్పుడు ఎలీషా తన వస్త్రాల్ని పట్టుకొని రెండు ముక్కలుగా చించాడు.+ 13  తర్వాత అతను ఏలీయా మీద నుండి పడిపోయిన అధికారిక వస్త్రాన్ని+ తీసుకొని, యొర్దాను నది దగ్గరికి తిరిగొచ్చి ఒడ్డున నిలబడ్డాడు. 14  అతను ఏలీయా అధికారిక వస్త్రాన్ని తీసుకొని దానితో నీళ్లమీద కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. అప్పుడు ఆ నది రెండుగా విడిపోయింది, ఎలీషా నది దాటాడు.+ 15  యెరికోలోని ప్రవక్తల కుమారులు దూరం నుండి అతన్ని చూసి, “ఏలీయాలోని పవిత్రశక్తి ఎలీషా మీద నిలిచింది”+ అన్నారు. వాళ్లు అతన్ని కలుసుకోవడానికి వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. 16  వాళ్లు అతనితో, “ఇదిగో నీ సేవకుల దగ్గర సమర్థులైన 50 మంది మనుషులు ఉన్నారు. నీ యజమానిని వెదకడానికి దయచేసి వాళ్లను వెళ్లనివ్వు. బహుశా యెహోవా పవిత్రశక్తి* అతన్ని ఎత్తి, ఏదైనా ఒక పర్వతం మీద గానీ, లోయలో గానీ పడేసివుంటుంది”+ అన్నారు. అయితే అతను, “వాళ్లను పంపించొద్దు” అన్నాడు. 17  కానీ వాళ్లు పదేపదే అడుగుతూ అతన్ని ఇబ్బంది పెట్టడంతో అతను, “సరే, వాళ్లను పంపించండి” అన్నాడు. వాళ్లు ఆ 50 మందిని పంపించారు. వాళ్లు మూడు రోజులపాటు ఏలీయా కోసం వెదికారు కానీ అతను దొరకలేదు. 18  వాళ్లు తిరిగొచ్చినప్పుడు ఎలీషా యెరికోలో+ ఉన్నాడు. అతను, “వెళ్లొద్దని నేను మీకు చెప్పాను కదా?” అన్నాడు. 19  కొంతకాలం తర్వాత ఆ నగరంవాళ్లు ఎలీషాతో, “మా యజమాని అయిన నువ్వు చూస్తున్నట్టు ఈ నగరం సరైన స్థలంలో ఉంది;+ కానీ ఇక్కడి నీళ్లు మంచివి కావు, అందుకే భూమి ఫలించట్లేదు”* అన్నారు. 20  అప్పుడు అతను, “ఒక కొత్త చిన్న గిన్నెలో ఉప్పువేసి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. వాళ్లు దాన్ని తీసుకొచ్చారు. 21  తర్వాత అతను నీళ్ల ఊట దగ్గరికి వెళ్లి అందులో ఉప్పువేసి+ ఇలా అన్నాడు: “యెహోవా ఏమి చెప్తున్నాడంటే, ‘నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక నుండి ఈ నీళ్ల కారణంగా మరణించడం గానీ ఫలించకపోవడం* గానీ జరగదు.’ ” 22  ఎలీషా చెప్పినట్టే, ఆ నీళ్లు ఈ రోజు వరకు మంచిగా ఉన్నాయి. 23  ఎలీషా అక్కడి నుండి బేతేలుకు బయల్దేరాడు. దారిలో కొంతమంది చిన్న పిల్లలు నగరంలో నుండి బయటికి వచ్చి, “బట్టతలవాడా, ఇక్కడి నుండి వెళ్లిపో! బట్టతలవాడా, వెళ్లిపో!” అంటూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు.+ 24  చివరికి, అతను వెనక్కి తిరిగి వాళ్లను చూసి యెహోవా పేరున వాళ్లను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగుబంట్లు+ వచ్చి ఆ పిల్లల్లో 42 మందిని ముక్కలుముక్కలుగా చీల్చేశాయి.+ 25  అతను అక్కడి నుండి కర్మెలు పర్వతానికి+ వెళ్లి, తర్వాత సమరయకు తిరిగొచ్చాడు.

అధస్సూచీలు

“ప్రవక్తల కుమారులు” అనే మాట బహుశా ప్రవక్తలకు ఉపదేశించే పాఠశాలను లేదా ప్రవక్తల సంఘాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “గాలి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “గర్భస్రావాలు అవుతున్నాయి” అయ్యుంటుంది.
లేదా “గర్భస్రావాలు అవడం” అయ్యుంటుంది.