దినవృత్తాంతాలు రెండో గ్రంథం 36:1-23
36 తర్వాత దేశ ప్రజలు, యోషీయా స్థానంలో అతని కుమారుడు యెహోయాహాజును+ యెరూషలేములో రాజును చేశారు.+
2 రాజైనప్పుడు యెహోయాహాజుకు 23 ఏళ్లు, అతను యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు.
3 అయితే, ఐగుప్తు రాజు యెరూషలేములో అతన్ని రాజుగా తొలగించి, దేశం మీద 100 తలాంతుల* వెండిని, ఒక తలాంతు బంగారాన్ని జరిమానా విధించాడు.+
4 అంతేకాదు, ఐగుప్తు రాజైన నెకో+ యెహోయాహాజు సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీద, యెరూషలేము మీద రాజుగా నియమించి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు; కానీ, అతని సహోదరుడైన యెహోయాహాజును ఐగుప్తుకు తీసుకెళ్లాడు.+
5 రాజైనప్పుడు యెహోయాకీముకు+ 25 ఏళ్లు, అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు, అతను తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు.
6 బబులోను రాజైన నెబుకద్నెజరు+ అతని మీదికి వచ్చి, అతన్ని రెండు రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాలనుకున్నాడు.+
7 నెబుకద్నెజరు యెహోవా మందిర పాత్రల్లో కొన్నిటిని బబులోనుకు తీసుకెళ్లి, తన రాజభవనంలో ఉంచాడు.+
8 యెహోయాకీము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన అసహ్యమైన పనులు, అతని గురించిన చెడ్డ విషయాలు ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో రాయబడివున్నాయి; అతని స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యాడు.
9 రాజైనప్పుడు యెహోయాకీను+ వయసు 18 ఏళ్లు. అతను యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు; అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు.
10 సంవత్సరం ప్రారంభంలో,* నెబుకద్నెజరు రాజు యెహోయాకీనును, యెహోవా మందిరంలోని విలువైన వస్తువుల్ని+ బబులోనుకు తీసుకురావడానికి మనుషుల్ని పంపించాడు.+ తర్వాత నెబుకద్నెజరు యెహోయాకీను తండ్రి సహోదరుడైన సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజును చేశాడు.+
11 రాజైనప్పుడు సిద్కియా వయసు 21 ఏళ్లు, అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు.+
12 అతను తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ వచ్చాడు. అతను యెహోవా ఆదేశం ప్రకారం మాట్లాడిన యిర్మీయా ప్రవక్త ముందు తనను తాను తగ్గించుకోలేదు.+
13 అతను, దేవుని మీద తనతో ఒట్టు వేయించిన నెబుకద్నెజరు రాజు మీద కూడా తిరుగుబాటు చేశాడు;+ అతను మొండిగా, కఠిన హృదయంతో ప్రవర్తించాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగడానికి ఇష్టపడలేదు.
14 యాజకుల్లో ప్రధానులందరూ, అలాగే ప్రజలు ఘోరంగా నమ్మకద్రోహం చేస్తూ, ఇతర దేశాల అసహ్యమైన వాటన్నిటినీ ఆచరిస్తూ ఉన్నారు, యెరూషలేములో యెహోవా పవిత్రపర్చిన ఆయన ఆలయాన్ని వాళ్లు అపవిత్రం చేశారు.+
15 వాళ్ల పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాస స్థలం మీద కనికరపడ్డాడు కాబట్టి ఆయన తన సందేశకుల ద్వారా వాళ్లను హెచ్చరిస్తూ వచ్చాడు; ఆయన పదేపదే వాళ్లను హెచ్చరించాడు.
16 కానీ వాళ్లు సత్యదేవుని సందేశకుల్ని హేళన చేస్తూ, ఆయన మాటల్ని తిరస్కరిస్తూ,+ ఆయన ప్రవక్తల్ని ఎగతాళి చేస్తూ వచ్చారు.+ వాళ్లు ఇక బాగుపడని స్థితికి చేరుకునేవరకు అలా చేస్తూ ఉన్నారు. అప్పుడు యెహోవా ఆగ్రహం తన ప్రజల మీదికి వచ్చింది.+
17 ఆయన వాళ్ల మీదికి కల్దీయుల రాజును రప్పించాడు; అతను వాళ్ల పవిత్రమైన స్థలంలో వాళ్ల యౌవనుల్ని కత్తితో చంపాడు;+ అతను యువకుల మీద గానీ, యువతుల మీద గానీ, ముసలివాళ్ల మీద గానీ, అనారోగ్యంగా ఉన్నవాళ్ల మీద గానీ కనికరం చూపించలేదు.+ దేవుడు ప్రతీది అతని చేతికి అప్పగించాడు.+
18 అతను సత్యదేవుని మందిరంలోని చిన్నా పెద్దా పాత్రలన్నిటిని; యెహోవా మందిరంలోని ఖజానాల్ని; రాజు, అతని అధిపతుల ఖజానాల్ని, అలాగే ప్రతీదాన్ని బబులోనుకు తీసుకొచ్చాడు.+
19 అతను సత్యదేవుని మందిరాన్ని తగలబెట్టాడు,+ యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టాడు, దాని పటిష్ఠమైన బురుజులన్నిటినీ అగ్నితో కాల్చేసి, విలువైన ప్రతీదాన్ని నాశనం చేశాడు.+
20 కత్తితో చంపబడనివాళ్లను అతను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు;+ పారసీక* రాజ్య పరిపాలన మొదలయ్యేంతవరకు వాళ్లు అతనికి, అతని కుమారులకు సేవకులుగా ఉన్నారు;+
21 యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరడానికి అలా జరిగింది.+ దేశం అప్పటివరకు ఆచరించని విశ్రాంతి సంవత్సరాల్ని ఆచరించేంతవరకు అది నిర్జనంగా ఉంది.+ అది నిర్జనంగా ఉన్న రోజులన్నీ, అంటే 70 సంవత్సరాలు పూర్తయ్యేవరకు+ విశ్రాంతిని అనుభవించింది.*
22 పారసీక రాజైన కోరెషు+ పరిపాలన మొదటి సంవత్సరంలో, అతను తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించేలా యెహోవా అతని మనసును ప్రేరేపించాడు; యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరడానికి అలా జరిగింది.+ పారసీక రాజైన కోరెషు ఆ ప్రకటనను ఇలా రాయించాడు:
23 “పారసీక రాజైన కోరెషు చెప్పేదేమిటంటే, ‘పరలోక దేవుడైన యెహోవా భూమ్మీదున్న రాజ్యాలన్నిటినీ నాకు అప్పగించాడు. ఆయన యూదాలోని యెరూషలేములో తన కోసం ఒక మందిరం కట్టించమని నన్ను ఆదేశించాడు.+ మీ మధ్య ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లు అక్కడికి వెళ్లవచ్చు,+ వాళ్ల దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉండాలి.’ ”
అధస్సూచీలు
^ అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ బహుశా వసంతకాలంలో కావచ్చు.
^ లేదా “పర్షియా.”
^ లేదా “సబ్బాతును ఆచరించింది.”