దినవృత్తాంతాలు రెండో గ్రంథం 25:1-28

  • అమజ్యా, యూదా రాజు (1-4)

  • ఎదోముతో యుద్ధం (5-13)

  • అమజ్యా విగ్రహపూజ (14-16)

  • ఇశ్రాయేలు రాజైన యెహోయాషుతో యుద్ధం (17-24)

  • అమజ్యా మరణం (25-28)

25  అమజ్యా రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు; అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెహోయద్దాను.+ 2  అమజ్యా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు, కానీ సంపూర్ణ హృదయంతో చేయలేదు. 3  రాజ్యం పూర్తిగా తన అధీనంలోకి రాగానే అతను, రాజైన తన తండ్రిని హత్య చేసిన తన సేవకుల్ని చంపాడు.+ 4  అయితే, “కుమారుల పాపాల్ని బట్టి తండ్రులు చనిపోకూడదు, తండ్రుల పాపాల్ని బట్టి కుమారులు చనిపోకూడదు; ప్రతీ ఒక్కరు వాళ్లవాళ్ల పాపాల్ని బట్టే చనిపోవాలి” అని మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం+ అతను వాళ్ల కుమారుల్ని చంపలేదు. 5  తర్వాత అమజ్యా యూదావాళ్లందర్నీ సమకూర్చాడు, అతను యూదా, బెన్యామీను వాళ్లందర్నీ పూర్వీకుల కుటుంబాలవారీగా నిలబెట్టించి వాళ్లమీద సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని* నియమించాడు.+ అతను 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్లను నమోదు చేయించాడు.+ ఈటె, పెద్ద డాలు పట్టుకొని సైన్యంలో సేవచేయగల 3,00,000 మంది శిక్షణ పొందిన* యోధులు ఉన్నట్టు తేలింది. 6  అంతేకాదు, అతను 100 వెండి తలాంతులు* ఇచ్చి ఇశ్రాయేలు నుండి 1,00,000 మంది బలమైన యోధుల్ని తెచ్చుకున్నాడు. 7  అయితే, సత్యదేవుని సేవకుడు ఒకతను అమజ్యా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతోపాటు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో లేడు,+ ఎఫ్రాయిమీయుల్లో ఏ ఒక్కరితో లేడు. 8  అందుకే నువ్వు ఒక్కడివే యుద్ధానికి వెళ్లి ధైర్యంగా పోరాడు. లేకపోతే, సత్యదేవుడు నిన్ను శత్రువు ఎదుట పడేయగలడు, ఎందుకంటే దేవునికి సహాయం చేసే శక్తి ఉంది,+ పడేసే శక్తి ఉంది.” 9  అప్పుడు అమజ్యా, “మరి ఇశ్రాయేలు సైన్యాలకు నేను ఇచ్చిన 100 తలాంతుల మాటేమిటి?” అని సత్యదేవుని సేవకుణ్ణి అడిగాడు. దానికి అతను, “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”+ అన్నాడు. 10  కాబట్టి అమజ్యా ఎఫ్రాయిము నుండి తన దగ్గరికి వచ్చిన సైన్యాల్ని వాళ్ల ప్రాంతానికి పంపించేశాడు. దాంతో వాళ్లకు యూదావాళ్ల మీద చాలా కోపం వచ్చింది, వాళ్లు చాలా కోపంగా తమ ప్రాంతానికి తిరిగెళ్లారు. 11  అప్పుడు అమజ్యా ధైర్యం తెచ్చుకొని తన సొంత సైన్యాల్ని ఉప్పులోయలోకి+ నడిపించాడు. అక్కడ అతను 10,000 మంది శేయీరు మనుషుల్ని చంపాడు.+ 12  యూదా సైనికులు 10,000 మందిని ప్రాణాలతో పట్టుకున్నారు. వాళ్లు శేయీరు మనుషుల్ని కొండ శిఖరం పైకి తీసుకెళ్లి, అక్కడి నుండి కిందికి పడేశారు, వాళ్లందరూ ముక్కలుముక్కలు అయ్యారు. 13  అయితే తనతోపాటు యుద్ధానికి రావద్దని అమజ్యా వెనక్కి పంపించేసిన సైనికులు+ యూదా నగరాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. వాళ్లు సమరయ+ నుండి బేత్‌-హోరోను+ వరకు అలా చేస్తూ వచ్చారు; వాళ్లు 3,000 మందిని చంపి చాలా దోపుడుసొమ్మును తీసుకెళ్లారు. 14  అయితే, అమజ్యా ఎదోమీయుల్ని హతం చేసి వెనక్కి వచ్చిన తర్వాత, అతను శేయీరువాళ్ల దేవుళ్లను తెచ్చుకొని, వాటిని తనకు దేవుళ్లుగా నిలబెట్టించాడు.+ అతను వాటికి వంగి నమస్కరించడం, బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయడం మొదలుపెట్టాడు. 15  దాంతో యెహోవాకు అమజ్యా మీద చాలా కోపం వచ్చింది, ఆయన ఒక ప్రవక్తను అతని దగ్గరికి పంపించాడు. అతను అమజ్యాతో ఇలా అన్నాడు: “నీ చేతిలో నుండి తమ సొంత ప్రజల్ని కాపాడని ఈ దేవుళ్లను నువ్వు ఎందుకు పూజిస్తున్నావు?”+ 16  ఆ ప్రవక్త మాట్లాడుతూ ఉండగా రాజు, “మేము ఏమైనా నిన్ను సలహా అడిగామా?+ ఇక ఆపు!+ లేకపోతే నేను నిన్ను చంపించాల్సి ఉంటుంది” అన్నాడు. దాంతో ప్రవక్త మాట్లాడడం ఆపేశాడు, కానీ అతను ఇలా అన్నాడు: “నువ్వు ఇలా చేసి, నా సలహా వినలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు.”+ 17  యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించిన తర్వాత, ఇశ్రాయేలు రాజైన యెహూ మనవడూ యెహోయాహాజు కుమారుడూ అయిన యెహోయాషుకు ఈ సందేశం పంపించాడు: “రా, మనం యుద్ధంలో తలపడదాం.”*+ 18  దానికి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు, యూదా రాజైన అమజ్యాకు ఈ సందేశం పంపించాడు: “లెబానోనులోని ముళ్లపొద లెబానోనులోని దేవదారు చెట్టు దగ్గరికి, ‘నా కుమారునికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయి’ అని సందేశం పంపించింది. అయితే లెబానోనుకు చెందిన ఒక అడవి మృగం ఆ దారిలో వెళ్తూ ఆ ముళ్లపొదను తొక్కేసింది. 19  ‘ఇదిగో! నేను ఎదోమును ఓడించాను’*+ అని నువ్వు అనుకున్నావు. దాన్నిబట్టి నీ హృదయం గర్వపడుతోంది, ఘనతను కోరుకుంటోంది. అయితే ఇప్పుడు నువ్వు నీ రాజభవనంలోనే ఉండిపో. నువ్వు విపత్తును కొనితెచ్చుకోవడం, నువ్వూ నీతోపాటు యూదా నాశనం అవడం ఎందుకు?” 20  కానీ అమజ్యా వినలేదు.+ వాళ్లు ఎదోము దేవుళ్లను పూజించారు+ కాబట్టి వాళ్లను శత్రువుల చేతికి అప్పగించాలని సత్యదేవుడే అలా చేశాడు.+ 21  దాంతో ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయల్దేరాడు; యూదాకు చెందిన బేత్షెమెషు+ దగ్గర అతనూ, యూదా రాజైన అమజ్యా తలపడ్డారు. 22  యూదా ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయింది, దాంతో వాళ్లలో ప్రతీ ఒక్కరు వాళ్లవాళ్ల ఇళ్లకు* పారిపోయారు. 23  ఇశ్రాయేలు రాజైన యెహోయాషు, బేత్షెమెషు దగ్గర యెహోయాహాజు* మనవడూ యెహోయాషు కుమారుడూ యూదా రాజూ అయిన అమజ్యాను పట్టుకొని యెరూషలేముకు తీసుకొచ్చాడు; అతను ఎఫ్రాయిము ద్వారం+ నుండి మూల ద్వారం+ వరకు యెరూషలేము ప్రాకారాన్ని 400 మూరలు* పడగొట్టాడు. 24  అతను సత్యదేవుని మందిరంలో ఓబేదెదోము పర్యవేక్షణలో, రాజభవన ఖజానాల్లో ఉన్న మొత్తం వెండిబంగారాల్ని, వస్తువులన్నిటినీ, అలాగే బందీలను తీసుకొని+ సమరయకు తిరిగొచ్చాడు. 25  ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కుమారుడూ అయిన యెహోయాషు+ చనిపోయిన తర్వాత, యూదా రాజూ యెహోయాషు కుమారుడూ అయిన అమజ్యా+ 15 సంవత్సరాలు జీవించాడు.+ 26  అమజ్యా మిగతా చరిత్ర మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడివుంది. 27  అమజ్యా యెహోవాను అనుసరించడం మానేసినప్పటి నుండి యెరూషలేములో కొంతమంది అతనిమీద కుట్ర పన్నుతూ ఉన్నారు;+ దాంతో అతను లాకీషుకు పారిపోయాడు, కానీ వాళ్లు అతని వెనక లాకీషుకు మనుషుల్ని పంపించి అక్కడ అతన్ని చంపించారు. 28  అతని శవాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకొచ్చి, యూదా నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు.

అధస్సూచీలు

అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
అక్ష., “ఎంపిక చేయబడిన.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ముఖాముఖిగా కలుద్దాం.”
అక్ష., “నువ్వు ఎదోమును ఓడించావు.”
అక్ష., “డేరాలకు.”
అహజ్యా అని కూడా పిలవబడ్డాడు.
దాదాపు 178 మీటర్లు (584 అడుగులు). అనుబంధం B14 చూడండి.