రెండో తిమోతి 1:1-18
1 క్రీస్తుయేసు ద్వారా పొందబోయే జీవం+ గురించిన వాగ్దానానికి అనుగుణంగా, దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను
2 నా ప్రియమైన కుమారుడు తిమోతికి+ రాస్తున్న ఉత్తరం.
తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.
3 నా పూర్వీకుల్లా నేను ఎవరికైతే పవిత్రసేవ చేస్తున్నానో ఆ దేవునికి నేను కృతజ్ఞుణ్ణి. నేను స్వచ్ఛమైన మనస్సాక్షితో అలా సేవ చేస్తున్నాను; నేను రాత్రింబగళ్లు పట్టుదలతో చేసే ప్రార్థనల్లో మానకుండా నిన్ను గుర్తుచేసుకుంటున్నాను.
4 నీ కన్నీళ్లను తలచుకున్నప్పుడు, నిన్ను చూడాలని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను చూస్తే నా హృదయం సంతోషంతో నిండిపోతుంది.
5 వేషధారణలేని నీ విశ్వాసం+ నాకు గుర్తొస్తుంది. అలాంటి విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలో, మీ అమ్మ యునీకేలో ఉంది. అదే విశ్వాసం నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.
6 అందుకే, నీలో ఉన్న వరాన్ని, అంటే నేను నీ మీద చేతులు ఉంచినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేయమని నీకు గుర్తుచేస్తున్నాను.+
7 దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని కాదుగానీ+ శక్తిని,+ ప్రేమను, మంచి వివేచనను పుట్టిస్తుంది.
8 కాబట్టి మన ప్రభువు గురించిన సాక్ష్యం విషయంలో గానీ, ఆయన కోసం ఖైదీగా ఉన్న నా విషయంలో గానీ సిగ్గుపడకు.+ బదులుగా దేవుని శక్తి మీద ఆధారపడుతూ+ మంచివార్త కోసం కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు.+
9 దేవుడు మన పనుల్ని బట్టి కాదుగానీ తన సంకల్పాన్ని, అపారదయను బట్టి మనల్ని కాపాడాడు,+ పవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు.+ ఆ అపారదయ, క్రీస్తుయేసు ద్వారా ఎంతోకాలం క్రితమే మనకు ఇవ్వబడింది.
10 మన రక్షకుడైన క్రీస్తుయేసు వెల్లడవ్వడం+ ద్వారా ఇప్పుడు అది స్పష్టంగా చూపించబడింది. ఆయన, మరణాన్ని రద్దు చేసి,+ జీవాన్ని,+ అక్షయతను*+ పొందడం ఎలాగో మంచివార్త+ ద్వారా వెల్లడిచేశాడు.
11 ఆ మంచివార్తకే నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా, బోధకుడిగా నియమించబడ్డాను.+
12 నేను ఈ బాధలు అనుభవిస్తున్నది కూడా అందుకే,+ కానీ నేను సిగ్గుపడను.+ ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు; నేను ఆయనకు అప్పగించినదాన్ని ఆ రోజు వచ్చేంతవరకు ఆయన కాపాడగలడనే నమ్మకం నాకు ఉంది.+
13 నువ్వు నా దగ్గర విన్న మంచి* మాటల ప్రమాణాన్ని* పాటిస్తూ ఉండు;+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల కలిగే విశ్వాసంతో, ప్రేమతో అలా పాటించు.
14 నీకు అప్పగించబడిన ఈ అమూల్యమైన సంపదను మనలో నివసిస్తున్న పవిత్రశక్తి+ సహాయంతో కాపాడు.
15 ఆసియా ప్రాంతం వాళ్లందరూ,+ ఫుగెల్లు, హెర్మొగెనేతో సహా అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారని నీకు తెలుసు.
16 ఒనేసిఫోరు ఇంటివాళ్ల+ మీద ప్రభువు కరుణ చూపించాలి. ఎందుకంటే అతను చాలాసార్లు నాకు సేదదీర్పు ఇచ్చాడు, నా సంకెళ్ల విషయంలో అతను సిగ్గుపడలేదు.
17 బదులుగా అతను రోములో ఉన్నప్పుడు నాకోసం పట్టుదలగా వెదికి, నన్ను కలిశాడు.
18 తీర్పు రోజున ప్రభువైన యెహోవా* అతని మీద కరుణ చూపించాలి. ఎఫెసులో అతను నాకు ఎంత సేవ చేశాడో నీకు బాగా తెలుసు.
అధస్సూచీలు
^ లేదా “కుళ్లిపోయే అవకాశం లేని శరీరాన్ని.”
^ లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
^ లేదా “నమూనాను.”
^ అనుబంధం A5 చూడండి.