రెండో కొరింథీయులు 13:1-14
13 నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధపడడం ఇది మూడోసారి. “ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ప్రతీ విషయం నిర్ధారించబడాలి.”+
2 నేను ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా, నేను రెండోసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నానని అనుకోండి. గతంలో తప్పుచేసినవాళ్లకు, అలాగే మిగతావాళ్లందరికీ నేను ముందే ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నేను మళ్లీ అక్కడికి రావడం అంటూ జరిగితే వాళ్లను వదిలిపెట్టను.
3 ఎందుకంటే, క్రీస్తు నిజంగా నా ద్వారా మాట్లాడుతున్నాడని అనడానికి మీరు రుజువు అడుగుతున్నారు. ఆయన మీ విషయంలో బలహీనంగా లేడు కానీ, మీ మధ్య శక్తివంతంగా పనిచేస్తున్నాడు.
4 నిజానికి, ఆయన బలహీనమైన స్థితిలో కొయ్య మీద మరణశిక్ష పొందాడు, కానీ దేవుని శక్తి వల్ల ఇప్పుడు జీవిస్తున్నాడు.+ నిజమే, అప్పుడు ఆయన ఉన్నట్టే మేము కూడా బలహీనమైన స్థితిలో ఉన్నాం, కానీ మీ మీద పనిచేస్తున్న దేవుని శక్తి వల్ల+ ఆయనతో కలిసి జీవిస్తాం.+
5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి; మీరేమిటో రుజువు చేసుకుంటూ ఉండండి.+ యేసుక్రీస్తు మీతో ఐక్యంగా ఉన్నాడనే విషయం మీరు గ్రహించట్లేదా? మీరు దేవుని ఆమోదం కోల్పోతే మాత్రం యేసుక్రీస్తు మీతో ఐక్యంగా ఉండడు.
6 మాకు దేవుని ఆమోదం ఉందనే విషయం మీరు తెలుసుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.
7 మీరు ఏ తప్పూ చేయకూడదని మేము దేవునికి ప్రార్థిస్తున్నాం. మేము దేవుడు ఆమోదించిన వ్యక్తులుగా కనిపించాలని కాదుగానీ, మాకు దేవుని ఆమోదం లేనట్టు కనిపించినా, మీరు మాత్రం సరైనది చేయాలన్నదే మా ఉద్దేశం.
8 ఎందుకంటే మేము సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేం, సత్యం కోసమే అన్నీ చేయగలం.
9 మేము బలహీనంగా ఉండి మీరు శక్తిమంతులుగా ఉన్నప్పుడు మేము సంతోషిస్తాం. మీరు అవసరమైన మార్పులు చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం.
10 నేను మీ దగ్గర ఉన్నప్పుడు, ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని కఠినంగా ఉపయోగించే పరిస్థితి రాకూడదని+ నేను మీ దగ్గర లేని ఈ సమయంలో ఈ విషయాలు రాస్తున్నాను. ప్రభువు నాకు ఆ అధికారం ఇచ్చింది బలపర్చడానికే కానీ కృంగదీయడానికి కాదు.
11 చివరిగా సహోదరులారా, సంతోషిస్తూ ఉండండి; అవసరమైన మార్పులు చేసుకుంటూ, ఓదార్పు పొందుతూ,+ ఒకేలా ఆలోచిస్తూ,+ శాంతిగా జీవిస్తూ ఉండండి;+ అప్పుడు ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు+ మీకు తోడుంటాడు.
12 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు పలకరించుకోండి.
13 పవిత్రులందరూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
14 ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ, దేవుని ప్రేమ, అలాగే సంఘంగా మీరు దేని నుండైతే ప్రయోజనం పొందుతున్నారో ఆ పవిత్రశక్తి మీ అందరికీ తోడుండాలి.
అధస్సూచీలు
^ అక్ష., “నోట.”