సమూయేలు మొదటి గ్రంథం 7:1-17
7 అప్పుడు కిర్యత్యారీమువాళ్లు వచ్చి, యెహోవా మందసాన్ని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంట్లోకి+ తీసుకెళ్లారు; యెహోవా మందసాన్ని కాపాడడానికి వాళ్లు అతని కుమారుడు ఎలియాజరును ప్రతిష్ఠించారు.
2 మందసం కిర్యత్యారీముకు వచ్చి చాలాకాలం, అంటే మొత్తం 20 సంవత్సరాలు గడిచింది. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను వెదకడం* మొదలుపెట్టారు.+
3 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నాడు: “మీరు నిండు హృదయంతో యెహోవా దగ్గరికి తిరిగి వస్తున్నట్లయితే, మీ మధ్య ఉన్న అన్యదేవుళ్లను,+ అష్తారోతు విగ్రహాల్ని+ తీసేసి, మీ హృదయాన్ని స్థిరంగా యెహోవా వైపు తిప్పి ఆయన్ని మాత్రమే సేవించండి;+ అప్పుడు ఆయన మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతి నుండి కాపాడతాడు.”
4 దాంతో ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్లను, అష్తారోతు విగ్రహాల్ని తీసేసి యెహోవాను మాత్రమే సేవించారు.
5 తర్వాత సమూయేలు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులందర్నీ మిస్పా దగ్గర సమావేశపర్చండి.+ నేను మీ తరఫున యెహోవాకు ప్రార్థిస్తాను.”+
6 కాబట్టి వాళ్లు మిస్పాలో సమావేశమయ్యారు, వాళ్లు నీళ్లు తోడి యెహోవా ముందు పోసి ఆ రోజు ఉపవాసం ఉన్నారు.+ వాళ్లు అక్కడ ఇలా అన్నారు: “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం.”+ సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయుల మీద న్యాయమూర్తిగా+ సేవ చేయడం మొదలుపెట్టాడు.
7 ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశమయ్యారని ఫిలిష్తీయులు విన్నప్పుడు, ఫిలిష్తీయుల పాలకులు+ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు దాని గురించి విన్నప్పుడు వాళ్లు ఫిలిష్తీయుల్ని బట్టి భయపడ్డారు.
8 కాబట్టి ఇశ్రాయేలీయులు సమూయేలుతో, “మనకు సహాయం చేయమని, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని కాపాడమని మన దేవుడైన యెహోవాకు ప్రార్థిస్తూ ఉండు”+ అన్నారు.
9 అప్పుడు సమూయేలు, పాలు విడవని ఒక గొర్రెపిల్లను తీసుకొని యెహోవాకు సంపూర్ణ దహనబలిగా+ అర్పించాడు; తర్వాత సమూయేలు, సహాయం చేయమని ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించాడు, యెహోవా అతనికి జవాబిచ్చాడు.+
10 సమూయేలు దహనబలిని అర్పిస్తుండగా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ రోజున యెహోవా ఫిలిష్తీయుల మీదికి పెద్దపెద్ద ఉరుములు రప్పించి,+ వాళ్లను గందరగోళానికి గురిచేశాడు.+ దాంతో వాళ్లు ఇశ్రాయేలీయుల ముందు ఓడిపోయారు.+
11 అప్పుడు ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయల్దేరి ఫిలిష్తీయుల్ని తరుముతూ బేత్కారు దక్షిణం వరకు వాళ్లను చంపుకుంటూ వెళ్లారు.
12 తర్వాత సమూయేలు ఒక రాయి తీసుకొని+ మిస్పాకు, యెషానాకు మధ్య నిలబెట్టి, “ఇప్పటిదాకా యెహోవా మనకు సహాయం చేశాడు”+ అంటూ దానికి ఎబెనెజరు* అని పేరు పెట్టాడు.
13 అలా ఫిలిష్తీయులు ఓడిపోయారు. వాళ్లు మళ్లీ ఇశ్రాయేలు ప్రాంతంలోకి రాలేదు;+ సమూయేలు బ్రతికున్నంత కాలం యెహోవా చెయ్యి ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ఉంది.+
14 అంతేకాదు, ఫిలిష్తీయులు ఎక్రోను నుండి గాతు వరకు తీసుకున్న ఇశ్రాయేలు నగరాల్ని ఇశ్రాయేలీయులు మళ్లీ చేజిక్కించుకున్నారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులు తమ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య కూడా శాంతి నెలకొంది.+
15 సమూయేలు తాను బ్రతికున్నంత కాలం ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు.+
16 ప్రతీ సంవత్సరం అతను బేతేలు,+ గిల్గాలు,+ మిస్పా+ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చేవాడు.
17 అయితే అతని ఇల్లు రామాలో+ ఉండేది కాబట్టి అతను అక్కడికి తిరిగొచ్చేవాడు. అక్కడ కూడా అతను ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చేవాడు. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.+