రాజులు మొదటి గ్రంథం 8:1-66
8 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలు పెద్దల్ని, గోత్ర పెద్దలందర్నీ, ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల ప్రధానుల్ని సమావేశపర్చాడు.+ వాళ్లు దావీదు నగరం నుండి, అంటే సీయోను+ నుండి యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకురావడానికి+ యెరూషలేములో ఉన్న సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు.
2 ఏతనీము* నెలలో, అంటే ఏడో నెలలో జరిగే పండుగ* సమయంలో+ ఇశ్రాయేలీయులందరూ సొలొమోను రాజు ముందు సమావేశమయ్యారు.
3 అలా ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చినప్పుడు యాజకులు మందసాన్ని ఎత్తారు.+
4 వాళ్లు యెహోవా మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని,+ గుడారంలోని పవిత్ర పాత్రలన్నిటినీ తీసుకొచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని తీసుకొచ్చారు.
5 అప్పుడు సొలొమోను రాజు, అలాగే అతని దగ్గరికి పిలిపించబడిన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ముందు ఉన్నారు. అప్పుడు లెక్కపెట్టలేనన్ని గొర్రెల్ని, పశువుల్ని బలి అర్పించారు.+
6 అప్పుడు యాజకులు యెహోవా ఒప్పంద మందసాన్ని దాని స్థానంలోకి,+ అంటే మందిరంలోని అత్యంత లోపలి గది అయిన అతి పవిత్ర స్థలంలోకి తీసుకొచ్చి, కెరూబుల రెక్కల కింద ఉంచారు.+
7 కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపబడి ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని కర్రల్ని కప్పేశాయి.+
8 ఆ కర్రలు+ ఎంత పొడవుగా ఉన్నాయంటే వాటి కొనలు అత్యంత లోపలి గదికి ఎదురుగా ఉన్న పవిత్ర స్థలం నుండి కనబడేవి, కానీ బయటి నుండి కనబడేవి కావు. అవి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాయి.
9 మందసంలో రెండు రాతి పలకలు+ తప్ప ఇంకేమీ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు,+ యెహోవా వాళ్లతో ఒప్పందం చేసిన సమయంలో,+ హోరేబు దగ్గర మోషే ఆ రెండు రాతి పలకల్ని మందసంలో ఉంచాడు.+
10 యాజకులు పవిత్ర స్థలం నుండి బయటికి వచ్చినప్పుడు, యెహోవా మందిరం మేఘంతో+ నిండిపోయింది.
11 ఆ మేఘం వల్ల యాజకులు అక్కడ నిలబడి సేవ చేయలేకపోయారు, ఎందుకంటే యెహోవా మందిరం యెహోవా మహిమతో నిండిపోయింది.+
12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు దట్టమైన చీకట్లో+ నివసిస్తావని చెప్పావు.
13 నేను నీ కోసం ఒక ఉన్నతమైన మందిరాన్ని, నువ్వు శాశ్వతంగా నివసించడానికి ఒక నివాస స్థలాన్ని నిర్మించాను.”+
14 తర్వాత రాజు ప్రజలవైపు తిరిగి, ఇశ్రాయేలు సమాజమంతా నిలబడి ఉండగా వాళ్లందర్నీ దీవించడం మొదలుపెట్టాడు.+
15 సొలొమోను ఇలా అన్నాడు: “తన నోటితో నా తండ్రైన దావీదుకు వాగ్దానం చేసి, తన చేతితో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఆయన ఇలా వాగ్దానం చేశాడు:
16 ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పటి నుండి, నా పేరు అక్కడ ఉండేలా+ ఒక మందిరం కట్టడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో ఏ నగరాన్నీ ఎంచుకోలేదు; అయితే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా దావీదును ఎంచుకున్నాను.’
17 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరు కోసం ఒక మందిరం కట్టాలని నా తండ్రైన దావీదు తన హృదయంలో కోరుకున్నాడు.+
18 కానీ యెహోవా నా తండ్రైన దావీదుతో ఇలా అన్నాడు, ‘నా పేరు కోసం ఒక మందిరం కట్టాలని నీ హృదయంలో కోరుకున్నావు, అది మంచిదే.
19 అయితే, ఆ మందిరాన్ని నువ్వు కట్టవు, నీకు పుట్టబోయే* నీ కుమారుడు నా పేరు కోసం మందిరాన్ని కడతాడు.’+
20 యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యెహోవా వాగ్దానం చేసినట్టే, నా తండ్రైన దావీదు స్థానంలో నేను రాజునై, ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరు కోసం మందిరాన్ని కూడా కట్టాను,+
21 యెహోవా మన పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆయన వాళ్లతో చేసిన ఒప్పందపు రాతి పలకలు ఉన్న మందసం+ కోసం అందులో ఒక స్థలాన్ని కూడా ఏర్పాటు చేశాను.”
22 తర్వాత సొలొమోను ఇశ్రాయేలు సమాజమంతా చూస్తుండగా, యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి,+
23 ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవా, యెహోవా, పైన ఆకాశంలో గానీ కింద భూమ్మీద గానీ నీలాంటి దేవుడు లేడు.+ నిండు హృదయంతో నీ ముందు నడుచుకునే నీ సేవకుల విషయంలో నువ్వు నీ ఒప్పందానికి కట్టుబడివుంటావు, వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.+
24 నీ సేవకుడైన నా తండ్రి దావీదుకు నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు. నీ నోటితో నువ్వే ఆ వాగ్దానం చేశావు, ఈ రోజు నువ్వే నీ చేతితో దాన్ని నెరవేర్చావు.+
25 ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు నీ సేవకుడైన నా తండ్రి దావీదుకు చేసిన ఈ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకో: ‘నువ్వు నా ఎదుట నడుచుకున్నట్టు, నీ కుమారులు కూడా తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఇశ్రాయేలు సింహాసనం మీద నా ఎదుట కూర్చునే ఒక వ్యక్తి నీ వంశంలో ఎప్పుడూ ఉంటాడు’ అని నువ్వు అన్నావు.+
26 ఇశ్రాయేలు దేవా, నీ సేవకుడైన నా తండ్రి దావీదుకు నువ్వు చేసిన ఆ వాగ్దానాన్ని దయచేసి నెరవేర్చు.
27 “అయితే, దేవుడు నిజంగా భూమ్మీద నివసిస్తాడా?+ ఇదిగో! ఆకాశ మహాకాశాలే నీకు సరిపోవు;+ అలాంటిది, నేను కట్టించిన ఈ మందిరం ఎలా సరిపోతుంది?+
28 నా దేవా, యెహోవా, ఇప్పుడు నీ సేవకుని ప్రార్థనను, అనుగ్రహం కోసం చేసే విన్నపాన్ని ఆలకించు; ఈ రోజు, సహాయం కోసం నీ సేవకుడు పెట్టే మొరను, నీ ఎదుట చేస్తున్న ప్రార్థనను విను.
29 ‘నా పేరు ఇక్కడ ఉంటుంది’+ అని నువ్వు ఏ మందిరం గురించైతే చెప్పావో, దానివైపుకు తిరిగి నీ సేవకుడు చేసే ప్రార్థనను వినేలా నీ కళ్లు రాత్రింబగళ్లు ఈ మందిరాన్ని కనిపెట్టుకొని ఉండాలి.+
30 అనుగ్రహం కోసం నీ సేవకుడు చేసే విన్నపాన్ని, ఈ స్థలం వైపు తిరిగి నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే విన్నపాన్ని విను, నువ్వు పరలోకంలోని నీ నివాస స్థలం+ నుండి వినాలి; అవును, నువ్వు విని క్షమించాలి.+
31 “ఒక వ్యక్తి తన తోటివాడి విషయంలో తప్పు చేశాడని నిందించబడితే, ఆ తోటివాడు అతనితో ఒట్టు* వేయించవచ్చు. అతను తాను ఒట్టు వేసిన కారణంగా ఈ మందిరంలోని నీ బలిపీఠం ముందుకు వచ్చినప్పుడు,
32 నువ్వు పరలోకం నుండి విని నీ సేవకులకు న్యాయం తీర్చాలి. దుష్టుణ్ణి అపరాధిగా* తీర్పుతీర్చి, అతను చేసిన తప్పును అతని తలమీదికే రప్పించాలి; నీతిమంతుణ్ణి నిర్దోషిగా* తీర్పుతీర్చి, అతని నీతిని బట్టి అతనికి ప్రతిఫలం ఇవ్వాలి.+
33 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉండడం వల్ల శత్రువు చేతిలో ఓడిపోయినప్పుడు,+ వాళ్లు నీ దగ్గరికి తిరిగొచ్చి నీ పేరును మహిమపర్చి,+ అనుగ్రహం కోసం ఈ మందిరంలో ప్రార్థించి మొరపెట్టుకుంటే,+
34 నువ్వు పరలోకం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాన్ని క్షమించి, వాళ్ల పూర్వీకులకు నువ్వు ఇచ్చిన దేశానికి వాళ్లను వెనక్కి తీసుకురావాలి.
35 “వాళ్లు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉండడం వల్ల+ ఆకాశం మూయబడి వర్షాలు కురవనప్పుడు,+ నువ్వు వాళ్లను బాధించిన కారణంగా వాళ్లు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థించి, నీ పేరును మహిమపర్చి, తమ పాపాల నుండి వెనక్కి తిరిగితే,+
36 నువ్వు పరలోకం నుండి విని, నీ సేవకులూ నీ ప్రజలూ అయిన ఇశ్రాయేలీయుల పాపాన్ని క్షమించాలి, వాళ్లు నడవాల్సిన మంచి మార్గం గురించి వాళ్లకు ఉపదేశించాలి;+ నీ ప్రజలకు నువ్వు వారసత్వంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించాలి.+
37 “దేశంలో కరువు గానీ,+ తెగులు గానీ, వడగాలి గానీ, మొక్కల తెగులు* గానీ,+ మిడతల దండు గానీ తిండిబోతు మిడతలు* గానీ వస్తే; లేదా శత్రువు వాళ్ల దేశంలోని ఏ నగరాన్నైనా ముట్టడిస్తే, లేదా వేరే ఏదైనా తెగులు గానీ రోగం గానీ వస్తే;
38 ఏ మనిషి గానీ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ గానీ (ఎందుకంటే, ప్రతీ ఒక్కరికి వాళ్ల హృదయంలో ఉన్న వేదన తెలుసు)+ ఈ మందిరం వైపు చేతులు చాపి ఎలాంటి ప్రార్థన చేసినా, అనుగ్రహం కోసం ఎలాంటి విన్నపం చేసినా,+
39 నువ్వు నీ నివాస స్థలమైన పరలోకం+ నుండి విని, క్షమించి, చర్య తీసుకోవాలి; ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల ప్రవర్తన అంతటినిబట్టి ప్రతిఫలం ఇవ్వాలి.+ ఎందుకంటే వాళ్ల హృదయం నీకు తెలుసు (ప్రతీ మనిషి హృదయం నిజంగా నీకు మాత్రమే తెలుసు).+
40 అప్పుడు నువ్వు మా పూర్వీకులకు ఇచ్చిన దేశంలో తాము బ్రతికినంత కాలం నీకు భయపడతారు.
41 “అంతేకాదు, నీ ప్రజలుకాని వాళ్లు, అంటే ఇశ్రాయేలీయులుకాని విదేశీయులు ఎవరైనా నీ పేరు* గురించి విని దూరదేశం నుండి వస్తే+
42 (వాళ్లు నీ గొప్ప పేరు గురించి, నీ బలమైన చెయ్యి గురించి, చాచిన బాహువు గురించి విని), వాళ్లు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే,
43 నువ్వు నీ నివాస స్థలమైన పరలోకం నుండి విని, ఆ విదేశీయులు నిన్ను కోరేవన్నీ నువ్వు చేయాలి. అప్పుడు భూమ్మీది దేశాలవాళ్లందరూ నీ పేరును తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగే నీకు భయపడతారు.+ అలాగే నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టబడిందని తెలుసుకుంటారు.
44 “నువ్వు పంపించే దారిలో, నీ ప్రజలు తమ శత్రువు మీద యుద్ధానికి వెళ్లినప్పుడు,+ వాళ్లు నువ్వు ఎంచుకున్న నగరం+ వైపు, నీ పేరు కోసం నేను కట్టించిన మందిరం వైపు తిరిగి యెహోవాకు ప్రార్థిస్తే,+
45 వాళ్ల ప్రార్థనను, అనుగ్రహం కోసం వాళ్లు చేసే విన్నపాన్ని నువ్వు పరలోకం నుండి విని వాళ్లకు న్యాయం చేయి.
46 “వాళ్లు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు (ఎందుకంటే, పాపం చేయని వ్యక్తి ఎవ్వరూ లేరు),+ నీకు వాళ్లమీద ఎంతో కోపమొచ్చి నువ్వు వాళ్లను శత్రువు చేతికి అప్పగిస్తే, ఆ శత్రువు వాళ్లను దూరదేశానికి గానీ దగ్గరి దేశానికి గానీ బందీలుగా తీసుకెళ్తే;+
47 వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడిన దేశంలో తమ తప్పు తెలుసుకొని,+ నీ దగ్గరికి తిరిగొచ్చి,+ తాము బందీలుగా ఉన్న దేశంలో, ‘మేము పాపం చేశాం, తప్పు చేశాం; చెడ్డగా ప్రవర్తించాం’+ అంటూ అనుగ్రహం కోసం నిన్ను వేడుకొని,+
48 తమను బందీలుగా తీసుకెళ్లిన శత్రువుల దేశంలో వాళ్లు నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* నీ దగ్గరికి తిరిగొచ్చి, నువ్వు వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన దేశం వైపు, నువ్వు ఎంచుకున్న నగరం వైపు, నీ పేరు కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపు తిరిగి నీకు ప్రార్థిస్తే,+
49 నువ్వు నీ నివాస స్థలమైన పరలోకం నుండి వాళ్ల ప్రార్థనను, అనుగ్రహం కోసం వాళ్లు చేసే విన్నపాన్ని విని వాళ్లకు న్యాయం చేసి,
50 నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజల్ని క్షమించు. వాళ్లు నీకు వ్యతిరేకంగా చేసిన అపరాధాలన్నిటినీ క్షమించు. వాళ్ల శత్రువులు వాళ్ల మీద జాలి చూపించేలా చేయి, అప్పుడు వాళ్లు నీ ప్రజల మీద జాలి చూపిస్తారు+
51 (ఎందుకంటే, వాళ్లు నీ ప్రజలు, నీ ఆస్తి;+ నువ్వు వాళ్లను ఐగుప్తులో నుండి, అంటే ఇనుప కొలిమిలో నుండి బయటికి తీసుకొచ్చావు).+
52 అనుగ్రహం కోసం నీ సేవకుడు చేసే విన్నపం మీద, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే విన్నపం మీద నీ దృష్టి నిలుపు; వాళ్లు నీకు ఎప్పుడు ప్రార్థించినా* చెవులారా ఆలకించు.+
53 సర్వోన్నత ప్రభువా, యెహోవా, నువ్వు మా పూర్వీకుల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా తెలియజేసినట్టు, నువ్వు భూమ్మీదున్న దేశాలన్నిటిలో నుండి వాళ్లను నీ ఆస్తిగా ప్రత్యేకపర్చావు.”+
54 సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనంతటినీ, అనుగ్రహం కోసం విన్నపాన్ని చేయడం ముగించిన తర్వాత, అతను యెహోవా బలిపీఠం ఎదుట నుండి లేచాడు. అతను అప్పటివరకు అక్కడ మోకాళ్లూని ఆకాశంవైపు చేతులు చాపి ప్రార్థిస్తూ ఉన్నాడు.
55 తర్వాత అతను నిలబడి ఇశ్రాయేలు సమాజమంతటినీ బిగ్గరగా ఇలా దీవించాడు:
56 “తాను వాగ్దానం చేసినట్టు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి స్థలాన్ని ఇచ్చిన యెహోవా స్తుతించబడాలి;+ ఆయన తన సేవకుడైన మోషే ద్వారా చేసిన మంచి వాగ్దానమంతటిలో ఒక్కమాట కూడా తప్పిపోలేదు.+
57 మన దేవుడైన యెహోవా మన పూర్వీకులతో ఉన్నట్టే మనతో కూడా ఉండాలి.+ ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, వదిలేయకుండా ఉండాలి.+
58 మనం ఆయన మార్గాల్లో నడిచేలా, పాటించమని ఆయన మన పూర్వీకులకు చెప్పిన తన ఆజ్ఞలకు, నియమాలకు, తీర్పులకు మనం లోబడేలా ఆయన మన హృదయాల్ని తనవైపుకు తిప్పుకోవాలి.+
59 అనుగ్రహం కోసం నేను యెహోవాను వేడుకున్న ఈ మాటల్ని మన దేవుడైన యెహోవా రాత్రింబగళ్లు గుర్తుంచుకుని, ప్రతీరోజు అవసరాన్ని బట్టి ఆయన తన సేవకునికి, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు న్యాయం చేయాలి.
60 అప్పుడు భూమ్మీది ప్రజలందరూ యెహోవాయే సత్యదేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని+ తెలుసుకుంటారు!+
61 కాబట్టి మీరు ఈ రోజు చేస్తున్నట్టే మన దేవుడైన యెహోవా నియమాల ప్రకారం నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ సంపూర్ణ* హృదయంతో+ ఆయన్ని సేవించండి.”
62 అప్పుడు రాజు, అతనితోపాటు ఉన్న ఇశ్రాయేలీయులందరూ యెహోవా ఎదుట పెద్ద ఎత్తున బలులు అర్పించారు.
63 సొలొమోను 22,000 ఎద్దుల్ని, 1,20,000 గొర్రెల్ని యెహోవాకు సమాధాన బలులుగా+ అర్పించాడు. అలా రాజు, ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.+
64 రాజు ఆ రోజున దహనబలుల్ని, ధాన్యార్పణల్ని, సమాధాన బలుల కొవ్విన భాగాల్ని అర్పించాల్సి ఉంది కాబట్టి అతను యెహోవా మందిరం ఎదుట ఉన్న ప్రాంగణం మధ్యభాగాన్ని పవిత్రపర్చాడు. ఎందుకంటే యెహోవా ఎదుట ఉన్న రాగి బలిపీఠం+ దహనబలులకు, ధాన్యార్పణలకు, సమాధాన బలుల కొవ్విన+ భాగాలకు సరిపోలేదు.
65 ఆ సమయంలో సొలొమోను ఇశ్రాయేలీయులందరితో, అంటే లెబో-హమాతు* నుండి కింద ఐగుప్తు వాగు*+ వరకు ఉన్న గొప్ప సమాజంతో కలిసి మన దేవుడైన యెహోవా ఎదుట 7 రోజులు, తర్వాత మరో 7 రోజులు, మొత్తం 14 రోజులు పండుగ జరిపాడు.+
66 తర్వాతి* రోజు అతను ప్రజల్ని పంపించేశాడు. వాళ్లు రాజును దీవించి, యెహోవా తన సేవకుడైన దావీదు మీద, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చూపించిన మంచితనం+ అంతటిని బట్టి ఉల్లాసంతో, హృదయానందంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
అధస్సూచీలు
^ అనుబంధం B15 చూడండి.
^ అంటే, పర్ణశాలల పండుగ.
^ అక్ష., “నీ గర్భవాసం నుండి వచ్చే.”
^ ఇక్కడ ఒట్టు అని అనువదించిన హీబ్రూ పదంలో, తప్పుగా ఒట్టువేయడం వల్ల వచ్చే శిక్ష కూడా ఉంది.
^ అక్ష., “దుష్టునిగా.”
^ అక్ష., “నీతిమంతునిగా.”
^ అక్ష., “బూజు.”
^ లేదా “గొల్లభామలు.”
^ లేదా “ప్రఖ్యాతి.”
^ లేదా “నిన్ను ఏమి అడిగినా.”
^ లేదా “పూర్తిగా అంకితమైన.”
^ లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
^ అక్ష., “ఎనిమిదో,” అంటే, రెండో ఏడురోజుల సమయం తర్వాతి రోజు.