రాజులు మొదటి గ్రంథం 10:1-29

  • షేబ దేశపు రాణి సొలొమోనును సందర్శించడం (1-13)

  • సొలొమోను గొప్ప సంపదలు (14-29)

10  షేబ దేశపు రాణి, యెహోవా పేరు వల్ల సొలొమోనుకు కలిగిన పేరుప్రఖ్యాతుల గురించి విన్నది.+ కాబట్టి ఆమె చిక్కు ప్రశ్నలతో* సొలొమోనును పరీక్షించడానికి వచ్చింది.+ 2  ఆమె గొప్ప పరివారంతో యెరూషలేముకు వచ్చింది;+ ఒంటెల మీద సాంబ్రాణి తైలం,+ పెద్ద మొత్తంలో బంగారం, రత్నాలు తీసుకొచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న వాటన్నిటి గురించి అతనితో మాట్లాడింది. 3  సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. వాటిలో రాజు వివరించలేనిదంటూ ఏదీ లేదు. 4  షేబ దేశపు రాణి సొలొమోను తెలివి అంతటినీ+ అతను కట్టించిన రాజభవనాన్ని, 5  అతని బల్ల మీది ఆహారాన్ని,+ అతని అధికారులు బల్ల దగ్గర కూర్చోవడానికి చేసిన ఏర్పాట్లను, అతని సేవకులు ఆహారం వడ్డించే తీరును, వాళ్ల బట్టల్ని, గిన్నెలు అందించేవాళ్లను, యెహోవా మందిరంలో అతను క్రమంగా అర్పించే దహనబలుల్ని చూసినప్పుడు ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది.* 6  ఆమె రాజుతో ఇలా అంది: “నువ్వు సాధించినవాటి* గురించి, నీ తెలివి గురించి నేను నా దేశంలో విన్న విషయాలు నిజం. 7  అయితే నేను ఇక్కడికి వచ్చి కళ్లారా చూసేవరకు వాటిని నమ్మలేదు. నిజానికి, వాటిలో సగం కూడా నాకు చెప్పబడలేదు. నీ తెలివి, సిరిసంపదలు నేను విన్నదాని కన్నా చాలా ఎక్కువ. 8  నీ మనుషులు ధన్యులు,* నీతో ఎప్పుడూ ఉంటూ తెలివిగల నీ మాటలు వినే నీ సేవకులు ధన్యులు!+ 9  నీ విషయంలో సంతోషించి నిన్ను ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన నీ దేవుడైన యెహోవా స్తుతించబడాలి.+ ఇశ్రాయేలు మీద యెహోవాకు శాశ్వత ప్రేమ ఉంది కాబట్టి, నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను రాజుగా నియమించాడు.” 10  ఆమె రాజుకు 120 తలాంతుల* బంగారం, పెద్ద మొత్తంలో సాంబ్రాణి తైలం,+ రత్నాలు ఇచ్చింది.+ షేబ దేశపు రాణి సొలొమోనుకు ఇచ్చినంత పెద్ద మొత్తంలో సాంబ్రాణి తైలం దేశంలోకి మళ్లీ ఎప్పుడూ రాలేదు. 11  ఓఫీరు నుండి బంగారం తీసుకొచ్చిన హీరాము నౌకాదళం+ అక్కడి నుండి పెద్ద ఎత్తున చందనపు మ్రానుల్ని,+ అమూల్యమైన రాళ్లను కూడా తీసుకొచ్చింది.+ 12  రాజు ఆ చందనపు మ్రానులతో యెహోవా మందిరం కోసం, రాజభవనం కోసం ఆధారాల్ని, గాయకుల కోసం వీణల్ని,* తంతివాద్యాల్ని చేయించాడు.+ నేటివరకు అలాంటి చందనపు మ్రానులు దేశంలోకి మళ్లీ ఎప్పుడూ రాలేదు, దేశంలో ఎప్పుడూ కనబడలేదు. 13  సొలొమోను రాజు కూడా తన ఔదార్యాన్ని బట్టి షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. వాటితోపాటు, ఆమె కోరుకున్న, అడిగిన ప్రతీది ఇచ్చాడు. తర్వాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగెళ్లిపోయింది.+ 14  ప్రతీ సంవత్సరం, సొలొమోను దగ్గరికి 666 తలాంతుల బంగారం వచ్చేది.+ 15  అదీకాక అతనికి వ్యాపారస్థుల నుండి, వర్తకుల నుండి, అరబీయుల రాజులందరి నుండి, దేశ అధిపతులందరి నుండి ఆదాయం వచ్చేది. 16  సొలొమోను రాజు మిశ్రిత బంగారంతో 200 పెద్ద డాళ్లను చేయించాడు+ (ఒక్కో పెద్ద డాలుకు 600 షెకెల్‌ల* బంగారం పట్టింది)+ 17  అలాగే మిశ్రిత బంగారంతో 300 చిన్న డాళ్లను* చేయించాడు (ఒక్కో చిన్న డాలుకు మూడు మినాల* బంగారం పట్టింది). రాజు వాటిని లెబానోను అడవి గృహంలో+ పెట్టించాడు. 18  రాజు ఒక గొప్ప దంతపు సింహాసనాన్ని+ కూడా చేయించి, దాన్ని మేలిమి బంగారు రేకుతో కప్పించాడు. 19  ఆ సింహాసనానికి ఆరు మెట్లు ఉన్నాయి, దానికి ఒక చిన్న గుండ్రటి పైకప్పులాంటిది ఉంది. సింహాసనానికి రెండువైపులా చేతులు పెట్టుకోవడానికి ఊతలున్నాయి. ఆ ఊతల పక్కన రెండు సింహాలు+ నిలబడి ఉన్నాయి. 20  ఆరు మెట్ల మీద ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి చొప్పున మొత్తం 12 సింహాలు ఉన్నాయి. వేరే ఏ రాజ్యంలో అలాంటిది తయారు చేయబడలేదు. 21  సొలొమోను రాజు తాగే పాత్రలన్నీ బంగారువి, లెబానోను అడవి గృహంలో+ ఉన్న పాత్రలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవి. వెండితో చేసినవేవీ లేవు. సొలొమోను రోజుల్లో వెండికి అసలు విలువే లేదు. 22  రాజుకు తర్షీషు ఓడలతో+ ఒక నౌకాదళం ఉండేది. అది హీరాము నౌకాదళంతోపాటు సముద్రంలో ప్రయాణించేది. మూడు సంవత్సరాలకు ఒకసారి తర్షీషు నౌకాదళం బంగారాన్ని, వెండిని, దంతాల్ని,+ కోతుల్ని, నెమళ్లను తీసుకొచ్చేది. 23  ఆ విధంగా, సొలొమోను రాజు సిరిసంపదల్లో,+ తెలివిలో భూరాజులందర్నీ మించిపోయాడు.+ 24  దేవుడు సొలొమోనుకు తెలివి అనుగ్రహించాడు,+ అతని తెలివిగల మాటల్ని వినాలనే ఉద్దేశంతో భూమంతటా ఉన్న ప్రజలు అతన్ని చూడడానికి వచ్చేవాళ్లు. 25  వాళ్లలో ప్రతీ ఒక్కరు వెండి వస్తువులు, బంగారు వస్తువులు, బట్టలు, ఆయుధాలు, సాంబ్రాణి తైలం, గుర్రాలు, కంచర గాడిదలు కానుకగా తీసుకొచ్చేవాళ్లు; ఇలా ప్రతీ సంవత్సరం జరిగేది. 26  సొలొమోను రథాల్ని, గుర్రాల్ని* సమకూర్చుకుంటూ వచ్చాడు; అతని దగ్గర 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉండేవి,*+ అతను వాటిని రథాల నగరాల్లో, అలాగే యెరూషలేములో తన దగ్గర ఉంచుకున్నాడు.+ 27  రాజు, రాళ్లంత విస్తారంగా వెండిని, షెఫేలాలోని అత్తి చెట్లంత విస్తారంగా దేవదారు మ్రానుల్ని యెరూషలేములో ఉంచాడు.+ 28  సొలొమోను దగ్గరున్న గుర్రాలు ఐగుప్తు నుండి దిగుమతి చేసుకున్నవి; రాజు వర్తకుల గుంపు గుర్రాల మందల్ని* ఒకే* ధరకు కొనేవాళ్లు.+ 29  ఐగుప్తు నుండి దిగుమతి చేసుకున్న ఒక్కో రథం ధర 600 వెండి రూకలు, ఒక్కో గుర్రం ధర 150 వెండి రూకలు; అలా దిగుమతి చేసుకున్నవాటిని హిత్తీయుల+ రాజులందరికీ, సిరియా రాజులకు ఎగుమతి చేసేవాళ్లు.

అధస్సూచీలు

లేదా “పొడుపు కథలతో.”
లేదా “ఆమెకు ఊపిరి ఆగినంత పనైంది.”
లేదా “నీ మాటల.”
లేదా “సంతోషంగా ఉంటారు.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “కేడెములను.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
హీబ్రూ లేఖనాల్లో ఒక మినా 570 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “గుర్రపురౌతుల్ని.”
లేదా “గుర్రపురౌతులు ఉండేవాళ్లు.”
లేదా “ఐగుప్తు నుండి, కవే నుండి దిగుమతి చేసుకున్నవి; రాజు వర్తకులు కవే నుండి వాటిని” అయ్యుంటుంది. కవే అనేది బహుశా కిలికియను సూచిస్తుండవచ్చు.
లేదా “నిర్ణీత.”