మొదటి పేతురు 2:1-25

  • వాక్యం మీద ఆకలి పెంచుకోండి (1-3)

  • సజీవమైన రాళ్లుగా ఉన్నవాళ్లు పవిత్రశక్తి ద్వారా ఒక ఇల్లుగా కట్టబడడం (4-10)

  • ఈ లోకంలో పరదేశులుగా జీవించడం (11, 12)

  • సరైన విధంగా లోబడివుండడం (13-25)

    • క్రీస్తు మనకు ఆదర్శం (21)

2  కాబట్టి అన్నిరకాల చెడుతనాన్ని,+ మోసాన్ని, కపటాన్ని, ఈర్ష్యను, వెనక మాట్లాడుకోవడాన్ని వదిలేయండి. 2  అయితే, రక్షణ పొందే దిశగా ఎదగడం కోసం, అప్పుడే పుట్టిన పిల్లల్లా,+ వాక్యం అనే స్వచ్ఛమైన పాల మీద ఆకలిని పెంచుకోండి.+ 3  ఎందుకంటే, ప్రభువు దయగలవాడని మీరు రుచిచూసి* తెలుసుకున్నారు. 4  మీరు సజీవమైన రాయిగా ఉన్న ఆయన దగ్గరికి వచ్చారు. మనుషులు ఆయన్ని తిరస్కరించారు;+ కానీ దేవుడు ఆయన్ని ఎంపిక చేసుకున్నాడు, దేవునికి ఆయన అమూల్యమైన వ్యక్తి.+ 5  మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఉన్నారు. దేవుని పవిత్రశక్తి ద్వారా మీరు ఒక ఇల్లుగా కట్టబడుతున్నారు.+ యేసుక్రీస్తు ద్వారా, దేవుని పవిత్రశక్తికి అనుగుణంగా దేవునికి ఇష్టమైన బలులు+ అర్పించే+ పవిత్రమైన యాజక బృందంగా ఉండడానికి మీరు అలా కట్టబడుతున్నారు. 6  ఎందుకంటే లేఖనంలో ఇలా ఉంది: “ఇదిగో! నేను ఎంపిక చేసుకున్న రాయిని, అమూల్యమైన పునాది మూలరాయిని సీయోనులో ఉంచుతున్నాను. దానిమీద విశ్వాసం చూపించే వాళ్లెవ్వరూ ఎప్పుడూ నిరాశపడరు.”*+ 7  మీరు విశ్వాసులు కాబట్టి మీకు ఆయన అమూల్యమైన వ్యక్తి; కానీ విశ్వసించనివాళ్ల విషయానికొస్తే, “కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి+ ముఖ్యమైన మూలరాయి* అయింది,”+ 8  అలాగే “అడ్డురాయి, అడ్డుబండ” అయింది.+ వాళ్లు వాక్యానికి లోబడరు కాబట్టి దానికి తగిలి పడిపోతున్నారు. అలాంటివాళ్లకు చివరికి పట్టే గతి అదే. 9  కానీ మీరు, చీకటిలో నుండి అద్భుతమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన దేవుని+ “గొప్ప లక్షణాల* గురించి దేశదేశాల్లో ప్రకటించడానికి ఎంచుకోబడిన ప్రజలు,+ రాజులైన యాజక బృందం, పవిత్ర జనం,+ దేవుని సొత్తైన ప్రజలు.”+ 10  ఎందుకంటే ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు, కానీ ఇప్పుడు మీరు ఆయన ప్రజలు;+ ఒకప్పుడు మీరు కరుణ పొందలేదు, కానీ ఇప్పుడు మీరు కరుణ పొందారు.+ 11  ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మీరు పరదేశులుగా, తాత్కాలిక నివాసులుగా ఉన్నారు. కాబట్టి మీకు వ్యతిరేకంగా పోరాడే శరీర కోరికలకు+ దూరంగా ఉండమని+ మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12  లోక ప్రజల మధ్య మీ మంచి ప్రవర్తనను కాపాడుకోండి.+ అప్పుడు, తప్పు చేశారని మిమ్మల్ని నిందించినవాళ్లు మీ మంచిపనుల్ని కళ్లారా చూడగలుగుతారు,+ దేవుడు తనిఖీ చేసే రోజున ఆయన్ని మహిమపర్చగలుగుతారు. 13  మనుషులు స్థాపించిన ప్రతీ అధికారానికి ప్రభువును బట్టి లోబడివుండండి.+ మీ మీద అధికారిగా ఉన్నందుకు రాజుకు లోబడివుండండి. 14  అలాగే అధిపతులకు కూడా లోబడివుండండి. ఎందుకంటే వాళ్లు తప్పు చేసినవాళ్లను శిక్షించడానికి, మంచి చేసినవాళ్లను మెచ్చుకోవడానికి రాజు నియమించిన వ్యక్తులు.+ 15  ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా, మూర్ఖంగా మాట్లాడే తెలివితక్కువ మనుషుల నోళ్లు మూయించాలనేది+ దేవుని ఇష్టం. 16  మీరు స్వతంత్రులుగా ఉండండి. అయితే మీ స్వేచ్ఛను తప్పు చేయడానికి సాకుగా* ఉపయోగించుకోకుండా, దేవునికి దాసులుగా ఉండండి.+ 17  అన్నిరకాల ప్రజల్ని ఘనపర్చండి;+ ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని ప్రేమించండి;+ దేవునికి భయపడుతూ ఉండండి;+ రాజును ఘనపర్చండి. 18  సేవకులు తమ యజమానులకు పూర్తి గౌరవంతో లోబడివుండాలి.+ మంచి యజమానులకు, అర్థంచేసుకునే యజమానులకే కాదు, కఠినులైన యజమానులకు కూడా అలా లోబడివుండాలి. 19  ఎందుకంటే, దేవుని ముందు మంచి మనస్సాక్షి కలిగివుండడానికి కష్టాల్ని* సహించేవాళ్లను, అన్యాయంగా బాధలుపడేవాళ్లను దేవుడు ఇష్టపడతాడు. 20  పాపం చేసినందుకు దెబ్బలు తిని సహిస్తే అందులో గొప్పతనం ఏముంది?+ అయితే, మంచి చేసినందుకు బాధలుపడి సహిస్తే దేవుడు దాన్ని ఇష్టపడతాడు.+ 21  నిజానికి, ఇందుకోసమే మీరు పిలవబడ్డారు. క్రీస్తు కూడా మీ కోసం బాధలు అనుభవించి, మీరు నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచాడు.+ 22  ఆయన ఏ పాపం చేయలేదు,+ ఆయన నోట ఏ మోసం కనిపించలేదు.+ 23  ఇతరులు ఆయన్ని అవమానించినప్పుడు*+ ఆయన తిరిగి వాళ్లను అవమానించలేదు.*+ ఆయన బాధ అనుభవించినప్పుడు+ తనను బాధపెట్టినవాళ్లను బెదిరించలేదు. బదులుగా నీతిగా తీర్పుతీర్చే దేవునికే+ తనను తాను అప్పగించుకున్నాడు. 24  ఆయన కొయ్యకు* దిగగొట్టబడినప్పుడు, తన సొంత శరీరంతో మన పాపాల్ని మోశాడు.+ మనం పాపం విషయంలో చనిపోయి, నీతి విషయంలో బ్రతకాలని అలా చేశాడు. “ఆయన గాయాల వల్ల మీరు బాగయ్యారు.”+ 25  ఎందుకంటే ఒకప్పుడు మీరు దారితప్పిన గొర్రెల్లా ఉండేవాళ్లు;+ కానీ ఇప్పుడు, మీ ప్రాణాల్ని సంరక్షించే కాపరి+ దగ్గరికి* తిరిగొచ్చారు.

అధస్సూచీలు

లేదా “అనుభవపూర్వకంగా.”
అక్ష., “సిగ్గుపర్చబడరు.”
అక్ష., “మూలకు తల.”
అంటే, స్తుతిపాత్రమైన ఆయన లక్షణాలు, పనులు.
లేదా “తప్పును దాచిపెట్టడానికి.”
లేదా “దుఃఖాన్ని; నొప్పిని.”
లేదా “దూషించినప్పుడు.”
లేదా “దూషించలేదు.”
లేదా “చెట్టుకు.”
లేదా “మీ ప్రాణాల కాపరి, పర్యవేక్షకుడు అయిన వ్యక్తి దగ్గరికి.”