మొదటి పేతురు 1:1-25

  • శుభాకాంక్షలు (1, 2)

  • సజీవమైన నిరీక్షణ కలిగివుండేలా కొత్తగా జన్మించడం (3-12)

  • లోబడే పిల్లలుగా పవిత్రంగా ఉండండి (13-25)

1  యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు+ పొంతు, గలతీయ, కప్పదొకియ,+ ఆసియా, బితూనియ ప్రాంతాల్లో చెదిరివున్న తాత్కాలిక నివాసులకు రాస్తున్న ఉత్తరం. మీరు దేవుడు ఎంచుకున్న ప్రజలు. 2  తండ్రైన దేవుడు తనకున్న భవిష్యత్‌ జ్ఞానం+ ప్రకారం* మిమ్మల్ని ఎంచుకున్నాడు, పవిత్రశక్తితో మిమ్మల్ని పవిత్రపర్చాడు.+ మీరు విధేయులుగా ఉండాలని, యేసుక్రీస్తు రక్తంతో+ మిమ్మల్ని శుద్ధీకరించాలని దేవుడు అలా చేశాడు. దేవుడు మీకు ఇంకా ఎక్కువగా అపారదయను, శాంతిని అనుగ్రహించాలి. 3  మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. దేవుడు తన గొప్ప కరుణను బట్టి మనం సజీవమైన నిరీక్షణ+ కలిగివుండేలా మనల్ని కొత్తగా జన్మింపజేశాడు.+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు*+ కాబట్టి మనకు ఆ నిరీక్షణ ఉంది. 4  కుళ్లిపోయే అవకాశం లేని,* కళంకం లేని, వాడిపోని జీవాన్ని*+ మనం పొందాలని దేవుడు అలా చేశాడు. ఆ జీవం పరలోకంలో మీ కోసం భద్రపర్చబడి ఉంది.+ 5  మీకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన శక్తితో మిమ్మల్ని కాపాడుతున్నాడు. చివరికాలంలో బయల్పర్చబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణను మీరు పొందాలని దేవుడు అలా కాపాడుతున్నాడు. 6  ఇందుకే మీరు చాలా సంతోషిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కొంతకాలంపాటు మీరు రకరకాల కష్టాల* వల్ల దుఃఖపడాల్సి ఉంటుంది.+ 7  ఎందుకంటే, ఆ కష్టాల వల్ల పరీక్షించబడిన మీ విశ్వాసం+ బంగారం కన్నా చాలా విలువైనది. బంగారం అగ్నిలో పరీక్షించబడినా* నశించిపోతుంది; కానీ పరీక్షించబడిన మీ విశ్వాసం యేసుక్రీస్తు బయల్పర్చబడినప్పుడు+ మీకు పొగడ్తల్ని, మహిమను, ఘనతను తెస్తుంది. 8  మీరు ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, అయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆయన్ని చూడట్లేదు, అయినా ఆయన మీద విశ్వాసం చూపిస్తున్నారు; వర్ణించలేని గొప్ప ఆనందంతో ఎంతో సంతోషిస్తున్నారు. 9  ఎందుకంటే మీ విశ్వాసం వల్ల మీరు రక్షణ పొందుతారనే+ నమ్మకం మీకుంది. 10  మీకు అనుగ్రహించబడిన అపారదయ గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి శ్రద్ధగా వెదికారు, జాగ్రత్తగా పరిశోధించారు.+ 11  తమలో ఉన్న పవిత్రశక్తి ప్రవచించిన విషయాలు ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల మధ్య క్రీస్తులో నెరవేరతాయనే దాని గురించి వాళ్లు బాగా పరిశోధిస్తూ వచ్చారు;+ ఎందుకంటే క్రీస్తు ఎలా బాధలు అనుభవిస్తాడో, ఆ తర్వాత ఎలా మహిమపర్చబడతాడో ఆ పవిత్రశక్తి ముందుగానే ప్రవచించింది.+ 12  సేవకులుగా ఆ ప్రవక్తలు ప్రకటించిన విషయాలు వాళ్ల కోసం కాదని, మీ కోసమేనని దేవుడు వాళ్లకు బయల్పర్చాడు. పరలోకం నుండి వచ్చే పవిత్రశక్తి సహాయంతో మీకు మంచివార్త ప్రకటించినవాళ్లు+ ఆ విషయాల్నే మీకు ప్రకటించారు. ఈ విషయాల్నే దేవదూతలు కూడా తొంగిచూడాలని కోరుకుంటున్నారు. 13  కాబట్టి, కష్టపడి పనిచేయడానికి మీ మనసుల్ని సిద్ధం చేసుకోండి;+ అన్ని విషయాల్లో మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి;+ యేసుక్రీస్తు బయల్పర్చబడినప్పుడు మీరు పొందబోయే అపారదయ మీద నిరీక్షణ ఉంచండి. 14  మీరు విధేయులైన పిల్లల్లా ఉండండి, దేవుని గురించి తెలియని రోజుల్లో మీకున్న చెడ్డ కోరికల ప్రకారం నడుచుకోకండి.* 15  మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, ఆయనలాగే మీరు కూడా మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి.+ 16  ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.”+ 17  ఎవరి పనికి తగ్గట్టు వాళ్లకు నిష్పక్షపాతంగా తీర్పుతీర్చే తండ్రికి+ మీరు ప్రార్థిస్తుంటే గనుక, ఈ లోకంలో తాత్కాలిక నివాసులుగా ఉన్నంతకాలం దైవభయంతో నడుచుకోండి. 18  ఎందుకంటే, మీ పూర్వీకుల నుండి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీరు విడుదల చేయబడింది* వెండి, బంగారం లాంటి నశించిపోయే* వాటితో కాదని+ మీకు తెలుసు. 19  బదులుగా అమూల్యమైన రక్తంతో,+ అంటే ఏ కళంకం గానీ మచ్చ గానీ లేని గొర్రెపిల్ల రక్తంలాంటి+ క్రీస్తు రక్తంతో+ మీరు విడుదల చేయబడ్డారు. 20  ప్రపంచం పుట్టకముందే* దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు,+ కానీ ఈ చివరి రోజుల్లో ఆయన మీకోసం వెల్లడిచేయబడ్డాడు.+ 21  ఆయన ద్వారానే మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారు.+ దేవుడే ఆయన్ని మృతుల్లో నుండి బ్రతికించి ఆయనకు మహిమను ఇచ్చాడు.+ దానివల్ల మీరు దేవుని మీద విశ్వాసం, నిరీక్షణ ఉంచగలుగుతారు. 22  సత్యానికి లోబడడం వల్ల మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకున్నారు. అందుకే వేషధారణలేని సహోదర అనురాగం+ మీలో ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి.+ 23  ఎందుకంటే, మీరు కుళ్లిపోయే* విత్తనం నుండి కాదుగానీ కుళ్లిపోయే అవకాశం లేని* విత్తనం*+ నుండి మళ్లీ పుట్టారు;+ ఎల్లకాలం నిలిచేవాడూ సజీవుడూ అయిన దేవుని వాక్యం+ ద్వారా అలా పుట్టారు. 24  లేఖనం చెప్తున్నట్టుగా, “మనుషులంతా గడ్డి లాంటివాళ్లు, వాళ్ల వైభవం గడ్డిపువ్వు లాంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, 25  కానీ యెహోవా* మాట* ఎప్పటికీ నిలుస్తుంది.”+ మీకు ప్రకటించబడిన మంచివార్తే ఆ “మాట.”*

అధస్సూచీలు

లేదా “భవిష్యత్తు తెలుసుకునే సామర్థ్యాన్ని ఉపయోగించి.”
లేదా “పునరుత్థానం చేయబడ్డాడు.”
లేదా “అక్షయమైన.”
అక్ష., “స్వాస్థ్యాన్ని.”
లేదా “పరీక్షల.”
లేదా “శుద్ధి చేయబడినా.”
లేదా “మలచబడడం ఆపేయండి.”
అక్ష., “విమోచించబడింది; విడిపించబడింది.”
లేదా “క్షయమైన.”
అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.
లేదా “క్షయమైన.”
లేదా “అక్షయమైన.”
అంటే, పునరుత్పత్తి చేసే లేదా ఫలించే సామర్థ్యం ఉన్న విత్తనం.
అనుబంధం A5 చూడండి.
లేదా “వాక్యం.”
లేదా “వాక్యం.”