దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14:1-17

  • దావీదు రాజుగా స్థిరపర్చబడ్డాడు (1, 2)

  • దావీదు కుటుంబం (3-7)

  • ఫిలిష్తీయుల్ని ఓడించడం (8-17)

14  తూరు రాజైన హీరాము+ దావీదు దగ్గరికి సందేశకుల్ని పంపించాడు; దావీదు కోసం ఒక రాజభవనాన్ని కట్టడానికి అతను దేవదారు మ్రానుల్ని, తాపీ పనివాళ్లను,* వడ్రంగుల్ని పంపించాడు.+ 2  యెహోవా తనను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపర్చాడని,+ తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజరికాన్ని గొప్ప చేశాడని దావీదుకు అర్థమైంది.+ 3  దావీదు యెరూషలేములో ఇంకొంతమందిని పెళ్లిచేసుకున్నాడు,+ అతనికి ఇంకొంతమంది కుమారులు, కూతుళ్లు పుట్టారు.+ 4  యెరూషలేములో దావీదుకు పుట్టినవాళ్ల పేర్లు+ ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను,+ సొలొమోను,+ 5  ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు, 6  నోగహు, నెపెగు, యాఫీయ, 7  ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు. 8  దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకించబడ్డాడని విన్నప్పుడు,+ ఫిలిష్తీయులందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు.+ దావీదు దాని గురించి విని, వాళ్ల మీదికి వెళ్లాడు. 9  ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో+ నివసిస్తున్నవాళ్ల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. 10  అప్పుడు దావీదు, “నేను ఫిలిష్తీయుల మీదికి వెళ్లనా? వాళ్లను నా చేతికి అప్పగిస్తావా?” అని దేవుని దగ్గర విచారణ చేశాడు. దానికి యెహోవా అతనితో, “వెళ్లు, నేను వాళ్లను తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అన్నాడు.+ 11  దాంతో దావీదు బయల్పెరాజీముకు+ వెళ్లి, అక్కడ ఫిలిష్తీయుల్ని హతం చేశాడు. అప్పుడు దావీదు, “నీళ్లు గోడను కూల్చినట్టు, సత్యదేవుడు నా శత్రువుల్ని నా చేత ఓడించాడు” అన్నాడు. అందుకే ఆ స్థలానికి బయల్పెరాజీము* అనే పేరు వచ్చింది. 12  ఫిలిష్తీయులు తమ దేవుళ్ల విగ్రహాల్ని అక్కడ వదిలేసి పారిపోయారు; దావీదు ఆజ్ఞాపించడంతో వాటిని మంటల్లో కాల్చేశారు.+ 13  తర్వాత ఫిలిష్తీయులు మళ్లీ లోయలో దాడి చేశారు.+ 14  దావీదు మళ్లీ దేవుని దగ్గర విచారణ చేశాడు; అయితే సత్యదేవుడు ఇలా చెప్పాడు: “నువ్వు నేరుగా వాళ్ల మీదికి వెళ్లొద్దు. బదులుగా, వాళ్ల వెనకాల నుండి చుట్టూ తిరిగి, కంబళి చెట్ల ఎదురుగా వాళ్ల మీదికి వెళ్లు.+ 15  కంబళి చెట్ల కొనల్లో ప్రజలు వస్తున్న శబ్దం వినబడగానే దాడిచేయి. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని హతం చేయడానికి సత్యదేవుడు అప్పటికే నీకు ముందుగా వెళ్లివుంటాడు.”+ 16  దావీదు సత్యదేవుడు ఆజ్ఞాపించినట్టే చేశాడు.+ దావీదు, అతని మనుషులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను నుండి గెజెరు+ వరకు తరుముతూ హతం చేశారు. 17  దావీదు ఖ్యాతి అన్నిదేశాల్లో వ్యాపించింది, దేశాలన్నీ దావీదుకు భయపడేలా యెహోవా చేశాడు.+

అధస్సూచీలు

లేదా “గోడలు నిర్మించేవాళ్లను.”
“కూల్చడంలో నిపుణుడు” అని అర్థం.