మొదటి కొరింథీయులు 5:1-13

  • లైంగిక పాపం గురించిన వార్త (1-5)

  • కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ ​పులిసేలా చేస్తుంది (6-8)

  • తొలగించాల్సిన ఒక దుష్టుడు (9-13)

5  మీ మధ్య జరుగుతున్న ఒక లైంగిక పాపం*+ గురించి నాకు వార్త అందింది. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట.+ అలాంటి లైంగిక పాపం* అన్యజనుల్లో కూడా జరగదు. 2  దాని గురించి మీరు గర్వపడుతున్నారా? నిజానికి మీరు దాని గురించి ఏడ్వాలి,+ ఆ పాపం చేసిన వ్యక్తిని మీ మధ్య నుండి తొలగించాలి.+ 3  నేను మీ దగ్గర లేకపోయినా, నా మనసు అక్కడే ఉంది. నేను నిజంగా మీ మధ్య ఉన్నట్టే, పాపం చేసిన ఆ వ్యక్తికి తీర్పుతీర్చేశాను. 4  కాబట్టి మీరు మన ప్రభువైన యేసు పేరున సమావేశమైనప్పుడు, మన ప్రభువైన యేసు శక్తి ద్వారా నా మనసు మీతోనే ఉందని గుర్తుంచుకొని, 5  ప్రభువు రోజున సంఘ స్ఫూర్తి కాపాడబడేలా,+ అతని పాపపు ప్రభావాన్ని నాశనం చేయడానికి అతన్ని సాతానుకు అప్పగించండి.+ 6  మీరు గర్వపడడం మంచిదికాదు. కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ పులిసేలా చేస్తుందని+ మీకు తెలీదా? 7  మీరు కొత్త పిండి అయ్యేలా, పులిసిన పాత పిండిని తీసిపారేయండి. నిజానికి మీరు పులిసిన పిండి లేని కొత్త పిండిలా ఉన్నారు. ఎందుకంటే, క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల బలిగా అర్పించబడ్డాడు.+ 8  కాబట్టి, మనం పులిసిన పాత పిండితోనో చెడుతనం, దుష్టత్వం అనే పులిసిన పిండితోనో కాకుండా నిజాయితీ, సత్యం అనే పులవని రొట్టెతో పండుగ ఆచరిద్దాం.+ 9  లైంగిక పాపులతో* సహవాసం మానేయమని నా ఉత్తరంలో మీకు రాశాను. 10  ఈ లోకానికి చెందిన+ లైంగిక పాపులతో,* అత్యాశపరులతో, దోచుకునేవాళ్లతో, విగ్రహాల్ని పూజించేవాళ్లతో పూర్తిగా సహవాసం మానేయమని నా ఉద్దేశం కాదు. అలాగైతే, మీరు ఈ లోకం నుండే బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది.+ 11  కానీ ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, ఒక సహోదరుడు లైంగిక పాపి* గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు* గానీ, తాగుబోతు+ గానీ, దోచుకునేవాడు+ గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి,+ కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు. 12  బయటివాళ్లకు తీర్పుతీర్చడం గురించి నాకెందుకు? మీరు సంఘంలో ఉన్నవాళ్లకు తీర్పుతీర్చండి, 13  దేవుడు బయటివాళ్లకు తీర్పు తీరుస్తాడు.+ “ఆ దుష్టుణ్ణి మీ మధ్య నుండి తొలగించండి.”+

అధస్సూచీలు

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.
పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.
పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.
లేదా “దూషించేవాడు.”