హోషేయ 11:1-12

  • ఇశ్రాయేలు బాలుడిగా ఉన్నప్పటి నుండి దేవుడు చూపించిన ప్రేమ (1-12)

    • “నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను” (1)

11  “ఇశ్రాయేలు బాలుడిగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను,+నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను.+  2  వాళ్లను పిలిచినకొద్దీ,*వాళ్లు ఇంకా దూరంగా వెళ్లారు.+ బయలు విగ్రహాలకు,+ చెక్కిన విగ్రహాలకుబలులు అర్పిస్తూ వచ్చారు.+  3  ఎఫ్రాయిముకు నడక నేర్పింది నేనే;+ నేనే వాళ్లను నా చేతుల్లోకి తీసుకున్నాను;+కానీ వాళ్లను బాగుచేసింది నేనే అని వాళ్లు గుర్తించలేదు.  4  నేను మనుషుల తాళ్లతో,* ప్రేమ అనే తాళ్లతో వాళ్లను నడిపిస్తూ వచ్చాను,+వాళ్ల మెడల మీద నుండి కాడిని తీసేశాను,ఆప్యాయంగా ప్రతీ ఒక్కరికి భోజనం పెట్టాను.  5  అతను ఐగుప్తు దేశానికి తిరిగెళ్లడు, అయితే అష్షూరు అతనికి రాజుగా ఉంటాడు,+ఎందుకంటే, అతను నా దగ్గరికి తిరిగి రావడానికి ఒప్పుకోలేదు.+  6  అతని నగరాల మీద ఖడ్గం తిరుగుతుంది,+అది అతని ద్వారాల అడ్డగడియల్ని నాశనం చేస్తుంది, వాళ్ల కుట్రల్ని బట్టి వాళ్లను మింగేస్తుంది.+  7  నా ప్రజలు నా పట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తించాలని నిశ్చయించుకున్నారు.+ ఉన్నతమైనదాని* వైపు పిలిచినా, ఎవ్వరూ లేవట్లేదు.  8  ఎఫ్రాయిమూ, నేను నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను అద్మాలా ఎలా చూడగలను? నిన్ను సెబోయీములా ఎలా చేయగలను?+ నీ విషయంలో నా మనసు మారింది;నీ మీద నాకు కనికరం కలిగింది.+  9  నేను నా కోపాగ్నిని వెళ్లగక్కను. నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను,+ఎందుకంటే నేను మనిషిని కాదు దేవుణ్ణి,మీ మధ్య ఉన్న పవిత్ర దేవుణ్ణి;నేను కోపంతో మీ మీద విరుచుకుపడను. 10  వాళ్లు యెహోవాను అనుసరిస్తారు, ఆయన సింహంలా గర్జిస్తాడు;+ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణుకుతూ వస్తారు.+ 11  వాళ్లు పక్షిలా వణుకుతూ ఐగుప్తు నుండి బయటికి వస్తారు,పావురంలా అష్షూరు దేశం నుండి బయటికి వస్తారు;+నేను వాళ్లను తమ ఇళ్లలో స్థిరపడేలా చేస్తాను” అని యెహోవా అంటున్నాడు.+ 12  “ఎఫ్రాయిము అబద్ధాలతో నన్ను చుట్టుముట్టాడు,ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ఇంటివాళ్ల మోసమే కనిపిస్తుంది.+ కానీ యూదా ఇంకా దేవునితోనే నడుస్తున్నాడు,అతి పవిత్రుడైన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.”+

అధస్సూచీలు

అంటే, ప్రవక్తలూ ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశించడానికి పంపబడిన ఇతరులూ వాళ్లను పిలిచినకొద్దీ.
లేదా “దయ అనే తాళ్లతో.” ఇవి పిల్లలకు నడక నేర్పించడానికి తల్లిదండ్రులు ఉపయోగించే తాళ్లు అని తెలుస్తోంది.
అంటే, ఉన్నతమైన ఆరాధన.