హెబ్రీయులు 10:1-39

  • జంతు బలులు పాపాన్ని తీసేయలేవు (1-4)

    • ధర్మశాస్త్రం ఒక నీడ (1)

  • అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే క్రీస్తు బలి (5-18)

  • జీవానికి నడిపించే ఒక కొత్త మార్గం (19-25)

    • కూటాలు మానేయకూడదు (24, 25)

  • కావాలని పాపం చేసే విషయంలో హెచ్చరిక (26-31)

  • సహించడానికి నమ్మకం, విశ్వాసం అవసరం (32-39)

10  ధర్మశాస్త్రం రాబోయే మంచివాటికి నీడ మాత్రమే+ కానీ అదే నిజమైన రూపం కాదు. కాబట్టి, ప్రతీ సంవత్సరం అర్పించబడే ఒకే రకమైన బలుల ద్వారా అది,* దేవుని దగ్గరికి వచ్చేవాళ్లను ఎన్నడూ పరిపూర్ణుల్ని చేయలేదు.+ 2  ఒకవేళ అదే సాధ్యమైతే, బలులు అర్పించడం ఆగిపోయి ఉండేది కదా? ఎందుకంటే పవిత్రసేవ చేసేవాళ్లు ఒక్కసారి శుద్ధీకరించబడ్డాక, ఇక తమ పాపాల్ని బట్టి అపరాధ భావాలతో నలిగిపోరు కదా? 3  బదులుగా, ఆ బలులు ప్రతీ సంవత్సరం వాళ్ల పాపాల్ని గుర్తుచేస్తాయి.+ 4  ఎందుకంటే ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాల్ని తీసేయడం అసాధ్యం. 5  అందుకే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు: “ ‘బలిని, అర్పణను నువ్వు కోరుకోలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని ఏర్పాటు చేశావు. 6  సంపూర్ణ దహనబలుల్ని, పాపపరిహారార్థ బలుల్ని నువ్వు ఆమోదించలేదు.’+ 7  తర్వాత నేను ఇలా అన్నాను: ‘దేవా, ఇదిగో (గ్రంథపు చుట్టలో నా గురించి రాసివున్నట్టే) నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను.’ ”+ 8  ఆయన ముందుగా ఇలా అన్నాడు: “బలుల్ని, అర్పణల్ని, సంపూర్ణ దహనబలుల్ని, పాపపరిహారార్థ బలుల్ని నువ్వు కోరుకోలేదు, ఆమోదించలేదు.” అవన్నీ ధర్మశాస్త్రం ప్రకారం అర్పించే బలులు. 9  ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు: “ఇదిగో, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను.”+ రెండోదాన్ని స్థాపించడానికి ఆయన మొదటిదాన్ని రద్దు చేస్తున్నాడు. 10  ఆ “ఇష్టం” ప్రకారమే,+ అన్నికాలాలకు సరిపోయేలా యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పించబడడం వల్ల మనం పవిత్రపర్చబడ్డాం.+ 11  అంతేకాదు, ప్రతీ యాజకుడు రోజూ పవిత్రసేవ* చేస్తూ,+ ఒకే రకమైన బలులు పదేపదే అర్పిస్తూ ఉంటాడు.+ అయితే ఆ బలులు ఎన్నడూ పాపాల్ని పూర్తిగా తీసేయలేవు.+ 12  కానీ ఈయన, పాపాల నుండి విడిపించడానికి అన్నికాలాలకు సరిపోయేలా ఒకేఒక్క బలిని అర్పించి, దేవుని కుడిపక్కన కూర్చున్నాడు.+ 13  అప్పటినుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు.+ 14  ఆయన ఒకేఒక్క బలిని అర్పించి, పవిత్రపర్చబడుతున్న వాళ్లను శాశ్వతంగా పరిపూర్ణుల్ని చేశాడు.+ 15  అంతేకాదు, ఈ విషయంలో పవిత్రశక్తి కూడా మనకు సాక్ష్యమిస్తోంది. ఎందుకంటే అది ముందుగా ఇలా చెప్పింది: 16  “ ‘ఆ రోజుల తర్వాత వాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల హృదయాల్లో పెడతాను, వాళ్ల మనసుల మీద వాటిని రాస్తాను’ అని యెహోవా* అంటున్నాడు.”+ 17  అది ఇంకా ఇలా అంది: “వాళ్ల పాపాల్ని, అక్రమాల్ని ఇక గుర్తుచేసుకోను.”+ 18  దేవుడు ఆ పాపాలన్నిటినీ క్షమించినప్పుడు, ఇక వాటికోసం బలి అర్పించాల్సిన అవసరం ఉండదు. 19  కాబట్టి సహోదరులారా, యేసు రక్తం వల్ల, అతి పవిత్ర స్థలంలోకి తీసుకెళ్లే మార్గంలో అడుగుపెట్టడానికి+ మనం అస్సలు భయపడం. 20  అది జీవానికి నడిపించే ఒక కొత్త మార్గం. తెర* గుండా వెళ్లడం ద్వారా ఆయన మన కోసం ఆ మార్గాన్ని తెరిచాడు,*+ ఆ తెర ఆయన శరీరమే. 21  అంతేకాదు, దేవుని ఇంటి+ మీద నియమించబడిన ఒక గొప్ప యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి, 22  మనం నిండు హృదయాలతో, పూర్తి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే, రక్తం చిలకరించబడడం వల్ల మన హృదయాలు శుద్ధి అయ్యాయి, చెడ్డ మనస్సాక్షి పోయింది;+ అలాగే మన శరీరాలు స్వచ్ఛమైన నీళ్లతో కడగబడ్డాయి.+ 23  వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మకమైనవాడు కాబట్టి, మనం అటూఇటూ ఊగిసలాడకుండా+ మన నిరీక్షణ గురించి పట్టుదలగా ప్రకటిద్దాం. 24  అంతేకాదు ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా+ పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం.* 25  కూటాలు మానేయడం కొందరికి అలవాటు, కానీ మనం అలా మానేయకుండా+ ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం,+ ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇవన్నీ చేద్దాం.+ 26  సత్యం గురించిన సరైన జ్ఞానం పొందిన తర్వాత, మనం కావాలని పాపం చేస్తూ ఉంటే,+ మన పాపాల కోసం ఇక బలి అనేదే ఉండదు.+ 27  బదులుగా, భయంకరమైన తీర్పు కోసం, వ్యతిరేకుల్ని నాశనం చేయబోతున్న కోపాగ్ని+ కోసం ఎదురుచూడడం మాత్రమే ఉంటుంది. 28  మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరైనా మీరితే, ఇద్దరిముగ్గురి సాక్ష్యం ఆధారంగా వాళ్లను ఏమాత్రం కనికరం చూపించకుండా చంపేవాళ్లు.+ 29  అలాంటిది, దేవుని కుమారుణ్ణి కాళ్లతో తొక్కినవానికి, తనను పవిత్రపర్చిన ఒప్పంద రక్తాన్ని+ విలువలేనిదన్నట్టు చూసినవానికి, దేవుడు తన అపారదయను దేని ద్వారా వెల్లడిచేస్తాడో ఆ పవిత్రశక్తికి ధిక్కార స్వభావంతో కోపం తెప్పించినవానికి ఎంత గొప్ప శిక్ష పడుతుందో ఆలోచించండి!+ 30  ఎందుకంటే, “పగతీర్చుకోవడం నా పని; నేనే ప్రతిఫలం ఇస్తాను” అని చెప్పిన దేవుడు మనకు తెలుసు. అంతేకాదు, “యెహోవా* తన ప్రజలకు తీర్పు* తీరుస్తాడు” అని కూడా లేఖనాలు చెప్తున్నాయి.+ 31  జీవంగల దేవుని చేతుల్లో పడడం భయంకరమైన విషయం. 32  అయితే మీరు వెనుకటి రోజుల్ని, అంటే మీరు సత్యం గురించిన జ్ఞానం పొందిన+ తర్వాతి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఉండండి. అప్పట్లో మీరు ఎన్నో బాధలు సహిస్తూ గట్టి పోరాటం చేశారు. 33  కొన్నిసార్లు మీరు అందరిముందు* నిందలపాలయ్యారు, శ్రమలు అనుభవించారు. ఇంకొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు మీరు అండగా నిలబడ్డారు. 34  మీరు చెరసాలలో ఉన్నవాళ్ల మీద సానుభూతి చూపించారు; మీ ఆస్తులు దోచుకోబడినా సంతోషంగానే ఉన్నారు.+ ఎందుకంటే, ఇంకా మెరుగైన ఆస్తి, కలకాలం నిలిచే ఆస్తి+ మీ దగ్గర ఉందని మీకు తెలుసు. 35  కాబట్టి మీ ధైర్యాన్ని వదులుకోకండి, దానివల్ల గొప్ప ప్రతిఫలం వస్తుంది.+ 36  మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, ఆయన వాగ్దానం చేసినదాన్ని పొందాలంటే మీకు సహనం అవసరం.+ 37  “చాలా తక్కువ సమయం” మిగిలివుంది,+ “వస్తున్నవాడు తప్పక వస్తాడు, ఆలస్యం చేయడు.”+ 38  “కానీ, నీతిమంతుడైన నా సేవకుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు,”+ “ఒకవేళ అతను వెనకడుగు వేస్తే, అతని విషయంలో నేను సంతోషించను.”+ 39  మనం వెనకడుగు వేసి నాశనమయ్యే ప్రజలం కాదుగానీ+ ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసం చూపించే ప్రజలం.

అధస్సూచీలు

లేదా “మనుషులు” అయ్యుంటుంది.
లేదా “ప్రజాసేవ.”
అనుబంధం A5 చూడండి.
ఇది గుడారంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెరను సూచిస్తోంది.
అక్ష., “ప్రారంభించాడు.”
లేదా “శ్రద్ధ తీసుకుందాం; పట్టించుకుందాం.”
లేదా “న్యాయం.”
అనుబంధం A5 చూడండి.
అక్ష., “రంగస్థలంలో నిలబెట్టినట్టు.”