సంఖ్యాకాండం 8:1-26

  • అహరోను ఏడు దీపాల్ని వెలిగిస్తాడు (1-4)

  • లేవీయులు శుద్ధీకరించబడి, సేవ మొదలుపెట్టడం (5-22)

  • లేవీయుల సేవకు వయోపరిమితి (23-26)

8  యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2  “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు: ‘నువ్వు దీపాల్ని వెలిగించినప్పుడు, ఆ ఏడు దీపాలు దీపస్తంభం ముందరి భాగంలో వెలుగు ఇవ్వాలి.’ ”+ 3  కాబట్టి అహరోను ఇలా చేశాడు: యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, దీపాలు దీపస్తంభం+ ముందరి భాగంలో వెలుగునిచ్చేలా వాటిని వెలిగించాడు. 4  దీపస్తంభాన్ని ఇలా తయారుచేశారు: ఒకే బంగారు ముక్కను సుత్తితో మలిచి* దాన్ని తయారుచేశారు; దాని కాండం నుండి పువ్వుల వరకు అంతా ఒకే బంగారు ముక్కను సుత్తితో మలిచి తయారుచేశారు.+ యెహోవా మోషేకు దర్శనంలో చూపించిన ప్రకారం+ ఆ దీపస్తంభాన్ని తయారుచేశారు. 5  యెహోవా మళ్లీ మోషేతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: 6  “నువ్వు ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయుల్ని తీసుకొని వాళ్లను శుద్ధీకరించు.+ 7  నువ్వు వాళ్లను ఎలా శుద్ధీకరించాలంటే, పాపాన్ని కడిగేసే నీళ్లను వాళ్లమీద చిలకరించాలి, వాళ్లు తమ ఒంటిమీద ఉన్న వెంట్రుకలన్నీ మంగలికత్తితో నున్నగా క్షౌరం చేసుకోవాలి, తమ వస్త్రాలు ఉతుక్కోవాలి, తమను తాము శుద్ధీకరించుకోవాలి.+ 8  తర్వాత వాళ్లు ఒక కోడెదూడను,+ దాని ధాన్యార్పణగా+ నూనె కలిపిన మెత్తని పిండిని తీసుకోవాలి; నువ్వు పాపపరిహారార్థ బలి కోసం ఇంకో కోడెదూడను తీసుకోవాలి.+ 9  తర్వాత నువ్వు లేవీయుల్ని ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకొచ్చి, ఇశ్రాయేలీయుల సమాజమంతటినీ సమావేశపర్చాలి.+ 10  నువ్వు లేవీయుల్ని యెహోవా ముందుకు తీసుకొచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు లేవీయుల మీద తమ చేతులు ఉంచాలి.+ 11  అప్పుడు అహరోను ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయుల్ని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా అర్పించాలి,+ తర్వాత వాళ్లు యెహోవాకు సేవ చేస్తారు.+ 12  “తర్వాత లేవీయులు ఆ కోడెదూడల తలల మీద తమ చేతులు ఉంచాలి.+ తర్వాత, లేవీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ వాటిలో ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా, ఇంకోదాన్ని దహనబలిగా యెహోవాకు అర్పించాలి. 13  నువ్వు లేవీయుల్ని అహరోను ముందు, అతని కుమారుల ముందు నిలబెట్టి, యెహోవాకు అల్లాడించే అర్పణగా వాళ్లను అర్పించాలి.* 14  నువ్వు ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయుల్ని వేరుచేయాలి, లేవీయులు నావాళ్లు అవుతారు.+ 15  ఆ తర్వాత లేవీయులు ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి లోపలికి వస్తారు. ఈ విధంగా నువ్వు వాళ్లను శుద్ధీకరించాలి, అల్లాడించే అర్పణగా అర్పించాలి.* 16  ఎందుకంటే, వాళ్లు ఇశ్రాయేలీయుల్లో నుండి నాకు ఇవ్వబడినవాళ్లు. ఇశ్రాయేలీయుల మొదటి సంతానమంతటికీ బదులుగా+ వాళ్లను నా కోసం తీసుకుంటాను. 17  ఎందుకంటే, మనుషుల దగ్గర నుండి జంతువుల వరకు ఇశ్రాయేలీయుల మొదటి సంతానమంతా నాదే.+ ఐగుప్తు దేశంలోని మొదటి సంతానమంతటినీ నేను చంపిన రోజున+ వాళ్లను నాకోసం ప్రతిష్ఠించుకున్నాను. 18  ఇశ్రాయేలీయుల మొదటి సంతానమంతటికీ బదులుగా నేను లేవీయుల్ని తీసుకుంటాను. 19  ఇశ్రాయేలీయులు పవిత్ర స్థలం దగ్గరికి వచ్చినందువల్ల వాళ్లమధ్య ఏ తెగులూ రాకుండా ఉండేలా,+ ఇశ్రాయేలీయుల తరఫున ప్రత్యక్ష గుడారం దగ్గర సేవచేయడానికి, వాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయుల్ని అహరోనుకు, అతని కుమారులకు ఇస్తాను.”+ 20  మోషే, అహరోను, ఇశ్రాయేలీయుల సమాజమంతా లేవీయుల విషయంలో అలా చేశారు. లేవీయుల విషయంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు లేవీయులకు చేశారు. 21  కాబట్టి లేవీయులు తమను తాము శుద్ధీకరించుకొని, తమ వస్త్రాలు ఉతుక్కున్నారు;+ తర్వాత అహరోను అల్లాడించే అర్పణగా వాళ్లను యెహోవా ముందు అర్పించాడు.*+ ఆ తర్వాత అహరోను వాళ్లను శుద్ధీకరించడానికి వాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.+ 22  తర్వాత లేవీయులు అహరోను ముందు, అతని కుమారుల ముందు ప్రత్యక్ష గుడారం దగ్గర తమ సేవ చేయడానికి లోపలికి వెళ్లారు. లేవీయుల విషయంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు లేవీయులకు చేశారు. 23  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 24  “ఇది లేవీయులకు వర్తిస్తుంది: 25 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న పురుషులు, ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేసే గుంపులో చేరుతారు. 25  కానీ 50 ఏళ్లు దాటాక, వాళ్లు ఆ సేవ నుండి విరమణ పొందుతారు, ఇక ఆ సేవలో కొనసాగరు. 26  వాళ్లు ప్రత్యక్ష గుడారం దగ్గర బాధ్యతల్ని చూసుకుంటున్న తమ సహోదరులకు పరిచారం చేయవచ్చు కానీ వాళ్లు అక్కడ సేవ చేయకూడదు. లేవీయుల విషయంలో, వాళ్ల బాధ్యతల విషయంలో నువ్వు ఇలా చేయాలి.”+

అధస్సూచీలు

లేదా “నకిషీ పనిగా.”
అక్ష., “అల్లాడించాలి,” అంటే ముందుకు, వెనుకకు కదిలేలా చేయాలి.
అక్ష., “అల్లాడించాలి,” అంటే ముందుకు, వెనుకకు కదిలేలా చేయాలి.
అక్ష., “అల్లాడించాడు,” అంటే ముందుకు, వెనుకకు కదిలేలా చేశాడు.