సంఖ్యాకాండం 35:1-34

  • లేవీయుల నగరాలు (1-8)

  • ఆశ్రయపురాలు (9-34)

35  యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో+ యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2  “ఇశ్రాయేలీయులు తాము స్వాస్థ్యంగా పొందే భూమిలో నుండి లేవీయులు నివసించడానికి కొన్ని నగరాల్ని,+ వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లను ఇవ్వాలని వాళ్లను ఆదేశించు.+ 3  లేవీయులు ఆ నగరాల్లో నివసిస్తారు; వాటి పచ్చికబయళ్లలో వాళ్ల పశువులు, వాటికి సంబంధించిన వస్తువులు, మిగతా జంతువులన్నీ ఉంటాయి. 4  మీరు లేవీయులకు ఇచ్చే నగరాల పచ్చికబయళ్లు నగర ప్రాకారం దగ్గర నుండి అన్నివైపులా 1,000 మూరల* వరకు ఉంటాయి. 5  మీరు నగరం బయట తూర్పు వైపు 2,000 మూరలు, దక్షిణం వైపు 2,000 మూరలు, పడమటి వైపు 2,000 మూరలు, ఉత్తరం వైపు 2,000 మూరలు కొలవాలి; మధ్యలో నగరం ఉండాలి. ఇవి వాళ్ల నగరాలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి. 6  “మీరు లేవీయులకు ఇచ్చే నగరాల్లో 6 నగరాలు ఆశ్రయపురాలుగా ఉంటాయి,+ నరహత్య చేసిన వాళ్లు పారిపోవడానికి వాటిని ఇవ్వాలి;+ ఇవి కాకుండా లేవీయులకు ఇంకా 42 నగరాలు ఇవ్వాలి. 7  మీరు లేవీయులకు మొత్తం 48 నగరాల్ని, వాటి పచ్చికబయళ్లను ఇవ్వాలి.+ 8  మీరు ఇశ్రాయేలీయుల సొత్తులో నుండి ఆ నగరాల్ని వాళ్లకు ఇవ్వాలి. పెద్ద గుంపుల్లో నుండి ఎక్కువ నగరాల్ని, చిన్న గుంపుల్లో నుండి తక్కువ నగరాల్ని తీసుకోవాలి.+ ఒక్కో గుంపు అది పొందిన స్వాస్థ్యానికి తగ్గట్టు కొన్ని నగరాల్ని లేవీయులకు ఇవ్వాలి.” 9  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 10  “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను నది దాటి కనాను దేశానికి వెళ్లబోతున్నారు.+ 11  ఆశ్రయపురాలుగా పనిచేయడానికి మీకు అనుకూలంగా ఉన్న నగరాల్ని మీరు ఎంచుకోవాలి; అనుకోకుండా నరహత్య చేసిన వ్యక్తి వాటిలోకి పారిపోవాలి.+ 12  ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి* నుండి కాపాడడానికి అవి మీకు ఆశ్రయంగా పనిచేస్తాయి;+ దానివల్ల, నరహత్య చేసిన వ్యక్తి విచారణ కోసం సమాజం ముందు నిలబడే వరకు చనిపోకుండా ఉంటాడు.+ 13  మీరు ఇచ్చే ఆరు ఆశ్రయపురాలు అందుకోసం పనికొస్తాయి. 14  మీరు యొర్దాను నదికి ఇటువైపు మూడు నగరాల్ని,+ కనాను దేశంలో మూడు నగరాల్ని+ ఆశ్రయపురాలుగా ఇవ్వాలి. 15  ఈ ఆరు నగరాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు,+ వాళ్ల మధ్య స్థిరపడినవాళ్లకు ఆశ్రయపురాలుగా పనిచేస్తాయి; వాళ్లలో ఎవరైనా అనుకోకుండా నరహత్య చేస్తే ఆ నగరాల్లోకి పారిపోవచ్చు.+ 16  “ ‘కానీ అతను ఇనుప వస్తువుతో కొట్టడం వల్ల ఆ వ్యక్తి చనిపోతే, అతను హంతకుడౌతాడు. ఆ హంతకుడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.+ 17  ఒకవేళ అతను చంపగలిగే రాయితో కొట్టడం వల్ల ఆ వ్యక్తి చనిపోతే, అతను హంతకుడౌతాడు. ఆ హంతకుడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. 18  అతను ఒకవేళ చంపగలిగే చెక్క వస్తువుతో కొట్టడం వల్ల ఆ వ్యక్తి చనిపోతే, అతను హంతకుడౌతాడు. ఆ హంతకుడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. 19  “ ‘ప్రతీకారం తీర్చుకునే వ్యక్తే ఆ హంతకుణ్ణి చంపాలి. హంతకుడు ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తే అతన్ని చంపుతాడు. 20  ఒకవేళ ఎవరైనా ద్వేషంతో తొయ్యడం వల్ల లేదా కపట ఉద్దేశంతో* దేన్నైనా విసరడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే,+ 21  లేదా అతను లోపల ద్వేషం పెట్టుకొని చేతితో కొట్టడం వల్ల ఆ వ్యక్తి చనిపోతే, కొట్టిన వ్యక్తికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. అతను హంతకుడు. అతను ఎదురుపడినప్పుడు, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి అతన్ని చంపుతాడు. 22  “ ‘ఒకవేళ ఎవరైనా ద్వేషంతో కాకుండా అనుకోకుండా తొయ్యడం వల్ల లేదా కపట ఉద్దేశంతో* కాకుండా అనుకోకుండా ఏదైనా విసరడం వల్ల+ 23  లేదా చూసుకోకుండా రాయిని పడేయడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే, అలాగే వాళ్లిద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేకపోతే, ఆ వ్యక్తికి హానిచేయాలని అతను ప్రయత్నించకపోతే, 24  అలాంటప్పుడు సమాజం ఆ కొట్టిన వ్యక్తికి, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తికి మధ్య ఈ న్యాయనిర్ణయాలకు అనుగుణంగా తీర్పుతీర్చాలి.+ 25  సమాజం, నరహత్య చేసిన ఆ వ్యక్తిని ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి చేతిలో నుండి కాపాడి అతను ఇంతకుముందు ఏ ఆశ్రయపురానికైతే పారిపోయాడో అక్కడికి తిరిగి పంపించేయాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధానయాజకుడు+ చనిపోయేంత వరకు అతను ఆ నగరంలోనే ఉండాలి. 26  “ ‘కానీ నరహత్య చేసిన వ్యక్తి తాను పారిపోయిన ఆశ్రయపురం సరిహద్దు దాటి బయటికి వస్తే, 27  అతను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తికి ఆశ్రయపురం సరిహద్దు బయట కనబడితే, ఆ వ్యక్తి ఇతన్ని చంపేస్తే, ఆ వ్యక్తి పైన రక్తాపరాధం ఉండదు. 28  ఎందుకంటే, ప్రధానయాజకుడు చనిపోయేంత వరకు అతను ఆ నగరంలోనే ఉండాలి. అయితే ప్రధానయాజకుడు చనిపోయిన తర్వాత అతను తిరిగి తన స్వస్థలానికి వెళ్లొచ్చు.+ 29  మీ నివాసాలన్నిట్లో మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు తరతరాలపాటు ఈ నియమాల్ని పాటించాలి. 30  “ ‘ఒక వ్యక్తిని ఎవరైనా చంపితే, సాక్షుల నోటి మాట+ ఆధారంగా అతన్ని హంతకుడిగా తీర్పుతీర్చి, మరణశిక్ష విధించాలి;+ అయితే ఒకే ఒక్క వ్యక్తి సాక్ష్యం ఆధారంగా ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. 31  అయితే మరణశిక్ష పొందాల్సిన హంతకుడి ప్రాణాన్ని విడిపించడానికి ఎలాంటి విమోచనా మూల్యం తీసుకోకూడదు, అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+ 32  అలాగే ఆశ్రయపురానికి పారిపోయిన ఒక వ్యక్తి ప్రధానయాజకుడు చనిపోకముందే తిరిగి తన స్వస్థలంలో నివసించేలా చేయడానికి విమోచనా మూల్యం తీసుకోకూడదు. 33  “ ‘మీరు నివసించే దేశాన్ని మీరు కలుషితం చేయకూడదు, రక్తం దేశాన్ని కలుషితం చేస్తుంది;+ దేశంలో ఎవరైనా రక్తాన్ని చిందిస్తే, అలా రక్తం చిందించిన వ్యక్తి రక్తం ద్వారా తప్ప ఆ రక్తానికి ప్రాయశ్చిత్తం ఉండదు.+ 34  మీరు నివసించే దేశాన్ని మీరు అపవిత్రం చేయకూడదు, అందులో నేను నివసిస్తాను; యెహోవా అనే నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను.’ ”+

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి.”
అక్ష., “పొంచి ఉండి; కాపు కాసి.”
అక్ష., “పొంచి ఉండి; కాపు కాసి.”