సంఖ్యాకాండం 20:1-29

  • కాదేషులో మిర్యాము చనిపోవడం (1)

  • మోషే బండను కొట్టి పాపం చేస్తాడు (2-13)

  • ఇశ్రాయేలీయులు వెళ్లడానికి ఎదోము రాజు ఒప్పుకోడు (14-21)

  • అహరోను మరణం (22-29)

20  మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను ఎడారికి చేరుకొని, కాదేషు+ దగ్గర నివసించడం మొదలుపెట్టింది. అక్కడే మిర్యాము+ చనిపోయి, పాతిపెట్టబడింది. 2  సమాజం కోసం అక్కడ నీళ్లు లేకపోవడంతో+ వాళ్లు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా పోగయ్యారు. 3  ప్రజలు మోషేతో గొడవపడుతూ+ ఇలా అన్నారు: “మా సహోదరులు యెహోవా ముందు చనిపోయినప్పుడే మేమూ చనిపోయి ఉంటే బావుండేది! 4  మేమూ, మా పశువులూ చనిపోయేలా యెహోవా సమాజాన్ని మీరు ఈ ఎడారిలోకి ఎందుకు తీసుకొచ్చారు?+ 5  ఈ చెడ్డ ప్రదేశానికి తీసుకురావడానికి మీరు మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చారు?+ ఇక్కడ మేము విత్తనాలు చల్లలేం, అంజూర చెట్లను గానీ ద్రాక్షచెట్లను గానీ దానిమ్మ చెట్లను గానీ నాటలేం; పైగా తాగడానికి నీళ్లు కూడా లేవు.”+ 6  దాంతో మోషే, అహరోనులు సమాజం ముందు నుండి వెళ్లిపోయి ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చి నేలమీద సాష్టాంగపడ్డారు; అప్పుడు యెహోవా మహిమ వాళ్లకు కనిపించడం మొదలైంది.+ 7  యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 8  “నువ్వు ఆ కర్రను తీసుకో; నువ్వు, నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమావేశపర్చి వాళ్ల కళ్లముందు ఆ బండతో మాట్లాడండి; అప్పుడు దానిలో నుండి నీళ్లు వస్తాయి. సమాజంలోని వాళ్లు, వాళ్ల పశువులు తాగేలా నువ్వు ఆ బండలో నుండి నీళ్లు రప్పిస్తావు.”+ 9  కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే ఆయన ముందు నుండి ఆ కర్రను తీసుకున్నాడు.+ 10  తర్వాత మోషే, అహరోనులు సమాజాన్ని ఆ బండ ముందు సమావేశపర్చారు; అప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “తిరుగుబాటుదారులారా, వినండి! ఈ బండలో నుండి మేము మీ కోసం నీళ్లు రప్పించాలా?”+ 11  వెంటనే మోషే తన చెయ్యి ఎత్తి, తన కర్రతో ఆ బండను రెండుసార్లు కొట్టాడు; అప్పుడు దానిలో నుండి సమృద్ధిగా నీళ్లు రావడం మొదలైంది; ఆ నీళ్లను సమాజంలోని వాళ్లు తాగారు, వాళ్ల పశువులు కూడా తాగాయి.+ 12  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: “మీరు నా మీద విశ్వాసం చూపించలేదు, ఇశ్రాయేలీయుల కళ్లముందు నన్ను పవిత్రపర్చలేదు; కాబట్టి ఈ సమాజానికి నేను ఇవ్వబోతున్న దేశానికి మీరు వాళ్లను తీసుకెళ్లరు.”+ 13  ఇవి మెరీబా* నీళ్లు; ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడింది ఇక్కడే. అప్పుడాయన తన ప్రజల ముందు తనను తాను మహిమపర్చుకున్నాడు. 14  తర్వాత మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరికి సందేశకుల్ని పంపి+ ఇలా చెప్పించాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు+ ఏమంటున్నాడంటే, ‘మేము ఎన్ని కష్టాలు పడ్డామో నీకు బాగా తెలుసు. 15  మా పూర్వీకులు ఐగుప్తుకు వెళ్లారు, మేము చాలా సంవత్సరాలు ఐగుప్తులో జీవించాం;+ అయితే ఐగుప్తీయులు మమ్మల్ని, మా పూర్వీకుల్ని చాలా బాధలు పెట్టారు.+ 16  చివరికి మేము యెహోవాకు మొరపెట్టుకున్నాం;+ ఆయన మా మొర విని, తన దూతను పంపించి,+ ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము నీ ప్రాంతానికి సరిహద్దున ఉన్న కాదేషు నగరంలో దిగాం. 17  దయచేసి మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు. మేము ఎవ్వరి పొలంలోకి, ద్రాక్షతోటలోకి వెళ్లం; ఏ బావిలోని నీళ్లూ తాగం. మేము మీ ప్రాంతాన్ని దాటిపోయే వరకు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగకుండా తిన్నగా రాజమార్గంలో నడుచుకుంటూ వెళ్లిపోతాం.’ ”+ 18  అయితే ఎదోము రాజు, “మీరు మా ప్రాంతం గుండా వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ మీరు దాని గుండా వెళ్తే నేను కత్తితో మీ మీదికి వస్తాను” అన్నాడు. 19  దానికి ఇశ్రాయేలీయులు అతనితో, “మేము ప్రధాన మార్గం గుండా వెళ్లిపోతాం; ఒకవేళ మేము, మా పశువులు నీ నీళ్లు తాగితే అందుకు మేము డబ్బు చెల్లిస్తాం.+ మమ్మల్ని అలా నడుచుకుంటూ వెళ్లనిస్తే చాలు” అన్నారు.+ 20  అయినాసరే అతను, “మీరు వెళ్లడానికి వీల్లేదు” అన్నాడు.+ తర్వాత ఎదోము రాజు చాలామంది ప్రజల్ని, బలమైన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇశ్రాయేలు మీదికి వచ్చాడు. 21  అలా ఎదోము రాజు, తన ప్రాంతం గుండా వెళ్లడానికి ఇశ్రాయేలీయులకు అనుమతి ఇవ్వలేదు; దాంతో ఇశ్రాయేలీయులు వేరే దారిలో వెళ్లిపోయారు.+ 22  ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషు నుండి బయల్దేరి హోరు కొండ+ దగ్గరికి చేరుకుంది. 23  ఈ హోరు కొండ ఎదోము దేశ సరిహద్దు దగ్గర ఉంది. అక్కడ యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: 24  “అహరోను తన ప్రజల దగ్గరికి చేర్చబడతాడు.*+ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశంలోకి అతను ప్రవేశించడు; ఎందుకంటే, మెరీబా నీళ్ల విషయంలో నేనిచ్చిన ఆదేశాన్ని మీరిద్దరు పాటించలేదు.+ 25  నువ్వు అహరోనును, అతని కుమారుడు ఎలియాజరును హోరు కొండ పైకి తీసుకురా. 26  నువ్వు అక్కడ అహరోను వస్త్రాల్ని+ తీసేసి, అతని కుమారుడైన ఎలియాజరుకు+ వాటిని తొడుగు; అహరోను అక్కడ చనిపోతాడు.” 27  యెహోవా ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు, ఇశ్రాయేలీయులందరి కళ్లముందు వాళ్లు హోరు కొండ ఎక్కారు. 28  మోషే అక్కడ అహరోను వస్త్రాల్ని తీసేసి, అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగాడు. తర్వాత అహరోను అక్కడే ఆ కొండ శిఖరం పైన చనిపోయాడు.+ మోషే, ఎలియాజరు కొండ దిగి వచ్చారు. 29  అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ 30 రోజుల పాటు అతని గురించి ఏడ్చారు.+

అధస్సూచీలు

“గొడవపడడం” అని అర్థం.
మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.