సంఖ్యాకాండం 14:1-45

  • ప్రజలు ఐగుప్తుకు తిరిగెళ్లాలని అనుకుంటారు (1-10)

    • యెహోషువ, కాలేబుల మంచి నివేదిక (6-9)

  • యెహోవాకు కోపం వస్తుంది; మోషే వేడుకుంటాడు (11-19)

  • శిక్ష: 40 ఏళ్లు ఎడారిలో (20-38)

  • అమాలేకీయుల చేతుల్లో ఇశ్రాయేలీయులు ఓడిపోవడం (39-45)

14  అప్పుడు సమాజమంతా బిగ్గరగా కేకలు వేశారు, ఆ రాత్రంతా వాళ్లు ఏడుస్తూనే ఉన్నారు.+ 2  ఇశ్రాయేలీయులందరూ మోషే, అహరోనుల మీద సణగడం మొదలుపెట్టారు;+ సమాజమంతా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలా అన్నారు: “మేము ఐగుప్తు దేశంలోనే చనిపోయుంటే బావుండేది, లేదా ఈ ఎడారిలో చనిపోయినా బావుండేది! 3  మేము కత్తి చేత చంపబడేలా యెహోవా మమ్మల్ని ఈ దేశానికి ఎందుకు తీసుకొస్తున్నాడు?+ మా భార్యలు, పిల్లలు దోపుడుసొమ్ము అవుతారు.+ అంతకన్నా మేము ఐగుప్తుకు తిరిగెళ్లడం నయం కాదా?”+ 4  చివరికి వాళ్లు, “మనం ఒక నాయకుణ్ణి నియమించుకొని ఐగుప్తుకు తిరిగెళ్లిపోదాం” అని కూడా చెప్పుకున్నారు.+ 5  దాంతో మోషే, అహరోనులు ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా నేలమీద సాష్టాంగపడ్డారు. 6  మిగతావాళ్లతో పాటు కనాను దేశాన్ని వేగుచూసి వచ్చిన నూను కుమారుడు యెహోషువ,+ యెఫున్నె కుమారుడు కాలేబు తమ వస్త్రాల్ని చింపుకొని, 7  ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము ఏ దేశాన్నైతే వేగుచూసి వచ్చామో అది చాలాచాలా మంచి దేశం.+ 8  యెహోవా ఆమోదం మనమీద ఉంటే, ఆయన తప్పకుండా మనల్ని ఆ దేశంలోకి తీసుకెళ్లి, దాన్ని మనకు ఇస్తాడు; అది పాలుతేనెలు ప్రవహించే దేశం.+ 9  అయితే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయకూడదు, ఆ దేశ ప్రజలకు భయపడకూడదు;+ ఎందుకంటే మనం వాళ్లను ఇట్టే ఓడిస్తాం. వాళ్లను రక్షించడానికి ఎవరూ లేరు, మనకు మాత్రం యెహోవా తోడుగా ఉన్నాడు.+ మీరు వాళ్లకు భయపడకండి.” 10  అయినాసరే, సమాజమంతా వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు.+ అయితే యెహోవా మహిమ ప్రత్యక్ష గుడారం మీద ఇశ్రాయేలీయులందరికీ కనిపించింది.+ 11  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇంకా ఎంతకాలం ఈ ప్రజలు నామీద గౌరవం లేనట్టు ప్రవర్తిస్తారు?+ నేను వాళ్ల మధ్య ఇన్ని అద్భుతాలు చేసినా ఇంకా ఎంతకాలం నామీద విశ్వాసం చూపించకుండా ఉంటారు?+ 12  వాళ్లను తెగులుతో శిక్షించి తరిమేయనివ్వు; నిన్ను వాళ్లకన్నా గొప్ప జనంగా, బలమైన జనంగా చేయనివ్వు.”+ 13  అయితే మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “అలాచేస్తే, నువ్వు నీ శక్తితో ఎవరి మధ్య నుండైతే ఈ ప్రజల్ని బయటికి తీసుకొచ్చావో ఆ ఐగుప్తీయులు దాని గురించి విని,+ 14  ఈ దేశ నివాసులకు దాని గురించి చెప్తారు. యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావని, ఈ ప్రజలకు ముఖాముఖిగా ప్రత్యక్షమయ్యావని+ ఈ దేశ నివాసులు కూడా విన్నారు.+ నువ్వు యెహోవావని, నీ మేఘం ఈ ప్రజలపై నిలిచి ఉందని, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నువ్వు ఈ ప్రజలకు ముందుగా వెళ్తున్నావని ఈ దేశ నివాసులు విన్నారు.+ 15  ఈ ప్రజలందర్నీ నువ్వు ఒకేసారి* చంపేస్తే, నీ కీర్తి గురించి విన్న దేశాల వాళ్లందరూ ఇలా చెప్పుకుంటారు: 16  ‘ఈ ప్రజలకు ఇస్తానని తాను ప్రమాణం చేసిన దేశానికి యెహోవా వాళ్లను తీసుకెళ్లలేకపోయాడు, అందుకే వాళ్లను ఎడారిలో వధించేశాడు.’+ 17  యెహోవా, నువ్వు వాగ్దానం చేసినట్టే దయచేసి ఇప్పుడు నీ శక్తిని గొప్పదిగా ఉండనివ్వు. నువ్వు వాగ్దానం చేసినప్పుడు ఇలా అన్నావు: 18  ‘యెహోవా ఓర్పును,* అపారమైన విశ్వసనీయ ప్రేమను* చూపిస్తాడు;+ తప్పుల్ని, అపరాధాల్ని మన్నిస్తాడు; అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు; మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.’+ 19  దయచేసి నీ గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి ఈ ప్రజల దోషాన్ని క్షమించు, ఐగుప్తు నుండి బయల్దేరినప్పటి నుండి ఇప్పటివరకు మన్నించినట్టే ఇప్పుడు కూడా మన్నించు.”+ 20  అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నీ మాట ప్రకారం వాళ్లను క్షమిస్తున్నాను.+ 21  అయితే, నా జీవం తోడు, భూమంతా యెహోవా మహిమతో నింపబడుతుంది.+ 22  అయినాసరే, నా మహిమనూ ఐగుప్తులో, అలాగే ఎడారిలో నేను చేసిన అద్భుతాల్నీ+ చూసి కూడా ఈ పదిసార్లు నన్ను పరీక్షిస్తూ+ నా మాట విననివాళ్లలో+ ఒక్కరు కూడా 23  నేను వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్ని ఎప్పటికీ చూడరు. నా మీద గౌరవం లేనట్టు ప్రవర్తించినవాళ్లలో ఒక్కరు కూడా దాన్ని చూడరు.+ 24  అయితే నా సేవకుడైన కాలేబు+ వైఖరి మిగతావాళ్లందరి కన్నా వేరుగా ఉంది కాబట్టి, అతను నిండు హృదయంతో నన్ను అనుసరిస్తూ వచ్చాడు కాబట్టి అతను ఏ దేశానికైతే వెళ్లొచ్చాడో ఆ దేశంలోకి నేనతన్ని తప్పకుండా తీసుకెళ్తాను, అతని వంశస్థులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ 25  అమాలేకీయులు, కనానీయులు లోయలో నివసిస్తున్నారు కాబట్టి రేపు మీరు వెనక్కి తిరిగి ఎర్రసముద్ర మార్గం గుండా ఎడారికి బయల్దేరాలి.”+ 26  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: 27  “ఇంకా ఎంతకాలం ఈ చెడ్డ సమాజం నామీద ఇలా సణుగుతూ ఉంటుంది?+ ఇశ్రాయేలీయులు నామీద సణుగుతున్న సణుగుల్ని+ నేను విన్నాను. 28  వాళ్లతో ఇలా అనండి: ‘యెహోవా ఏం చెప్తున్నాడంటే, “నా జీవం తోడు, మీరు ఏమైతే అనడం నేను విన్నానో, సరిగ్గా అదే మీకు చేస్తాను!+ 29  ఈ ఎడారిలో మీ శవాలు రాలిపోతాయి;+ అవును, మీలో 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి పేర్లు నమోదైన వాళ్లంతా, నామీద సణిగిన వాళ్లంతా చనిపోతారు.+ 30  మిమ్మల్ని అక్కడ నివసింపజేయడానికి నేను మీకు ఇస్తానని ప్రమాణం చేసిన* దేశంలోకి+ మీలో ఏ ఒక్కరూ ప్రవేశించరు; యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే దానిలోకి ప్రవేశిస్తారు.+ 31  “ ‘ “వీళ్లు దోపుడుసొమ్ము అవుతారని మీరు ఎవరి గురించైతే చెప్పారో వాళ్లను, అంటే మీ పిల్లల్ని ఆ దేశంలోకి తీసుకెళ్తాను,+ మీరు తిరస్కరించిన దేశాన్ని వాళ్లు చూస్తారు.+ 32  మీ శవాలు మాత్రం ఈ ఎడారిలోనే రాలిపోతాయి. 33  మీ కుమారులు ఈ ఎడారిలో 40 సంవత్సరాల పాటు+ పశువుల కాపరులుగా ఉంటారు, మీ నమ్మకద్రోహ* ప్రవర్తనకు వాళ్లు శిక్ష అనుభవిస్తారు;* మీలోని చివరి వ్యక్తి శవం ఎడారిలో రాలిపోయేవరకు ఇలా జరుగుతుంది.+ 34  మీరు ఆ దేశాన్ని వేగుచూసిన రోజుల లెక్క ప్రకారం, ఒక్కో రోజుకి ఒక్కో సంవత్సరం చొప్పున 40 రోజులకు+ 40 సంవత్సరాలు మీ దోషశిక్ష అనుభవిస్తారు;+ నన్ను వ్యతిరేకిస్తే ఏమౌతుందో* మీరు తెలుసుకుంటారు. 35  “ ‘ “యెహోవానైన నేనే చెప్పాను. నాకు వ్యతిరేకంగా ఒక్కటైన ఈ చెడ్డ సమాజమంతటికీ నేను ఇలా చేస్తాను: ఈ ఎడారిలోనే వాళ్ల జీవితాలు ముగిసిపోతాయి, ఇక్కడే వాళ్లు చనిపోతారు.+ 36  ఆ దేశాన్ని వేగుచూడమని మోషే ఎవరినైతే పంపించాడో, ఎవరైతే ఆ దేశం గురించి చెడ్డ నివేదికను తీసుకొచ్చి+ సమాజమంతా అతని మీద సణిగేలా చేశారో వాళ్లు, 37  అవును, ఆ దేశం గురించి చెడ్డ నివేదికను తీసుకొచ్చిన వాళ్లు శిక్షించబడి యెహోవా ముందు చనిపోతారు.+ 38  అయితే కనాను దేశాన్ని వేగుచూసి వచ్చిన వాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం ఖచ్చితంగా బ్రతికే ఉంటారు.” ’ ”+ 39  మోషే ఇశ్రాయేలీయులందరికీ ఈ మాటలు చెప్పినప్పుడు ప్రజలు బోరున ఏడ్వడం మొదలుపెట్టారు. 40  అంతేకాదు, వాళ్లు పొద్దున్నే లేచి పర్వతం పైకి వెళ్లడానికి ప్రయత్నించారు; “మేము పాపం చేశాం. కానీ ఇప్పుడు మేము యెహోవా చెప్పిన స్థలానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం” అని వాళ్లు అన్నారు.+ 41  అయితే మోషే ఇలా అన్నాడు: “మీరెందుకు యెహోవా ఆదేశాన్ని మీరుతున్నారు? మీరు విజయం సాధించలేరు. 42  మీరు దాని పైకి వెళ్లకండి, ఎందుకంటే యెహోవా మీతో లేడు; మీరు మీ శత్రువుల చేతిలో ఓడిపోతారు.+ 43  మీతో తలపడడానికి అక్కడ అమాలేకీయులు, కనానీయులు ఉన్నారు, మీరు కత్తి చేత చంపబడతారు. మీరు యెహోవాను అనుసరించడం మానేశారు కాబట్టి యెహోవా మీతో ఉండడు.”+ 44  అయినాసరే, వాళ్లు అహంకారంతో ఆ పర్వత శిఖరం వైపుగా వెళ్లారు.+ అయితే యెహోవా ఒప్పంద మందసం గానీ, మోషే గానీ పాలెం మధ్య నుండి కదల్లేదు.+ 45  అప్పుడు ఆ పర్వతం మీద నివసిస్తున్న అమాలేకీయులు, కనానీయులు దిగివచ్చి వాళ్లను ఓడించి, హోర్మా వరకు వాళ్లను చెదరగొట్టారు.+

అధస్సూచీలు

అక్ష., “ఒకే మనిషిని చంపినట్టు.”
లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
లేదా “ప్రేమపూర్వక దయను.”
అక్ష., “చెయ్యి ఎత్తిన.”
లేదా “లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.”
లేదా “వ్యభిచార.”
లేదా “నన్ను శత్రువుగా చేసుకోవడమంటే ఏంటో.”