విలాపవాక్యాలు 5:1-22

  • పునరుద్ధరించమని ప్రజల ప్రార్థన

    • “మా మీదికి వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకో” (1)

    • “అయ్యో, మాకు శ్రమ! మేము పాపం చేశాం!” (16)

    • “యెహోవా, మమ్మల్ని మళ్లీ నీ దగ్గరికి తెచ్చుకో” (21)

    • “మళ్లీ మాకు పాత రోజుల్ని తీసుకురా” (21)

5  యెహోవా, మా మీదికి వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకో. మాకు కలిగిన అవమానాన్ని చూడు.+  2  మా వారసత్వ ఆస్తి పరాయివాళ్లకు, మా ఇళ్లు పరదేశులకు అప్పగించబడ్డాయి.+  3  మేము తండ్రిలేనివాళ్లం అయ్యాం, అనాథలం అయ్యాం; మా తల్లులు విధవరాళ్లు అయ్యారు.*+  4  మా సొంత నీళ్లను, మా సొంత కట్టెల్ని డబ్బిచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది.+  5  మమ్మల్ని వెంటాడుతున్న వాళ్లు మా మెడ దగ్గర ఉన్నారు;మేము అలసిపోయాం, కానీ మాకు విశ్రాంతి దొరకట్లేదు.+  6  ఆహారం కోసం మేము ఐగుప్తు* మీద, అష్షూరు మీద ఆధారపడ్డాం.+  7  పాపం చేసిన మా పూర్వీకులు ఇప్పుడు లేరు, కానీ మేం మాత్రం వాళ్ల దోషాల్ని భరిస్తున్నాం.  8  సేవకులు మమ్మల్ని ఏలుతున్నారు; వాళ్ల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించే వాళ్లెవ్వరూ లేరు.  9  ఎడారిలోని ఖడ్గం వల్ల మేము ప్రాణాలకు తెగించి ఆహారం తెచ్చుకుంటున్నాం.+ 10  తీవ్రమైన ఆకలి వల్ల మా చర్మం కొలిమిలా కాలిపోతోంది.+ 11  సీయోనులోని భార్యల్ని, యూదా నగరాల్లోని కన్యల్ని వాళ్లు అవమానించారు.*+ 12  తమ చేతితో అధిపతుల్ని వేలాడదీశారు,+ పెద్దల మీద ఏమాత్రం గౌరవం చూపించలేదు.+ 13  యువకులు తిరుగలి మోస్తున్నారు, పిల్లలు కట్టెల మోపులు మోయలేక తడబడుతున్నారు. 14  నగర ద్వారం దగ్గర పెద్దలు లేరు;+ యువకులు సంగీతం వాయించట్లేదు. 15  మా హృదయంలో ఇక సంతోషం లేదు; మా నాట్యం దుఃఖంగా మారింది.+ 16  మా తల మీద నుండి కిరీటం పడిపోయింది. అయ్యో, మాకు శ్రమ! మేము పాపం చేశాం! 17  అందువల్ల మా హృదయం బలహీనపడింది,ఈ విషయాల వల్ల మా కళ్లు మసకబారాయి;+ 18  ఎందుకంటే సీయోను పర్వతం నిర్జనంగా మారింది;+ ఇప్పుడు దానిమీద నక్కలు సంచరిస్తున్నాయి. 19  యెహోవా, నువ్వు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చొని ఉంటావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.+ 20  నువ్వు మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా మర్చిపోయావు? ఇంతకాలం పాటు మమ్మల్ని ఎందుకు వదిలేశావు?+ 21  యెహోవా, మమ్మల్ని మళ్లీ నీ దగ్గరికి తెచ్చుకో, మేము ఇష్టపూర్వకంగా నీ దగ్గరికి తిరిగొస్తాం.+ మళ్లీ మాకు పాత రోజుల్ని తీసుకురా.+ 22  అయితే నువ్వు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. మా మీద చాలా కోపంగా ఉన్నావు.+

అధస్సూచీలు

అక్ష., “విధవరాళ్లలా ఉన్నారు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “చెరిచారు.”