లేవీయకాండం 21:1-24

  • యాజకులు పవిత్రులుగా ఉండాలి, మలినపర్చుకోకూడదు (1-9)

  • ప్రధానయాజకుడు తనను తాను మలినపర్చుకోకూడదు (10-15)

  • యాజకులకు శారీరక లోపాలు ​ఉండకూడదు (16-24)

21  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు యాజకులైన అహరోను కుమారులతో ఇలా చెప్పు: ‘తన ప్రజల్లో ఎవరైనా చనిపోతే యాజకుడు ఆ వ్యక్తి కోసం తనను తాను మలినపర్చుకోకూడదు.+ 2  కానీ చనిపోయిన వ్యక్తి తన సమీప రక్తసంబంధి అయితే, ఆ వ్యక్తి కోసం, అంటే తల్లి కోసం, తండ్రి కోసం, కుమారుడి కోసం, కూతురు కోసం, సహోదరుడి కోసం తనను తాను మలినపర్చుకోవచ్చు. 3  అంతేకాదు, తన దగ్గర ఉంటున్న పెళ్లికాని* సహోదరి కోసం అతను తనను తాను మలినపర్చుకోవచ్చు. 4  అయితే తన ప్రజల్లో ఒకరికి భార్యగా ఉన్న స్త్రీ కోసం అతను తనను తాను మలినపర్చుకోకూడదు, అపవిత్రపర్చుకోకూడదు. 5  వాళ్లు తమ తలను బోడి చేసుకోకూడదు,+ తమ గడ్డం పక్కల్ని కత్తిరించుకోకూడదు, తమ శరీరాన్ని కోసుకోకూడదు.+ 6  వాళ్లు తమ దేవుని కోసం పవిత్రంగా ఉండాలి,+ వాళ్లు తమ దేవుని పేరును అపవిత్రపర్చకూడదు;+ ఎందుకంటే వాళ్లు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్ని, అంటే తమ దేవుని రొట్టెను* అర్పిస్తున్నారు కాబట్టి వాళ్లు పవిత్రులుగా ఉండాలి.+ 7  యాజకుడు వేశ్యను+ గానీ, కన్యాత్వం కోల్పోయిన స్త్రీని గానీ, విడాకులైన స్త్రీని గానీ పెళ్లి చేసుకోకూడదు.+ ఎందుకంటే అతను తన దేవుని దృష్టిలో పవిత్రుడు. 8  అతను నీ దేవుని రొట్టెను అర్పించే వ్యక్తి కాబట్టి నువ్వు అతన్ని శుద్ధీకరించాలి.+ అతను నీ దృష్టిలో పవిత్రుడిగా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని పవిత్రపరుస్తున్న యెహోవానైన నేను పవిత్రుణ్ణి.+ 9  “ ‘ఒక యాజకుడి కూతురు వేశ్య అయ్యి తనను తాను అపవిత్రపర్చుకుంటే ఆమె తన తండ్రిని అపవిత్రపర్చినట్టే. ఆమెను మంటల్లో కాల్చేయాలి.+ 10  “ ‘యాజకులైన తన సహోదరుల మధ్య ఎవరైతే ప్రధానయాజకుడిగా నియమించబడతాడో అంటే ఎవరి తలమీదైతే అభిషేక తైలం పోయబడుతుందో,+ ఎవరైతే ప్రత్యేకమైన యాజక వస్త్రాలు వేసుకోవడానికి ప్రతిష్ఠించబడతారో*+ అతను తన జుట్టును విరబోసుకోకూడదు, తన వస్త్రాల్ని చింపుకోకూడదు.+ 11  అతను చనిపోయిన ఏ వ్యక్తి* దగ్గరికీ వెళ్లకూడదు;+ ఆఖరికి తన తండ్రి కోసం లేదా తల్లి కోసం కూడా తనను తాను మలినపర్చుకోకూడదు. 12  అతను పవిత్రమైన స్థలం నుండి బయటికి వెళ్లకూడదు, తన దేవుని పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చకూడదు.+ ఎందుకంటే సమర్పణకు సూచనగా ఉన్న తన దేవుని అభిషేక తైలం+ అతని మీద ఉంది. నేను యెహోవాను. 13  “ ‘అతను కన్యగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి.+ 14  అతను విధవరాలిని గానీ, విడాకులైన స్త్రీని గానీ, కన్యాత్వం కోల్పోయిన స్త్రీని గానీ, వేశ్యను గానీ పెళ్లి చేసుకోకూడదు; కానీ తన ప్రజల్లో నుండి ఒక కన్యను పెళ్లి చేసుకోవాలి. 15  అతను తన ప్రజల మధ్య తన సంతానాన్ని అపవిత్రపర్చుకోకూడదు;+ ఎందుకంటే నేను అతన్ని పవిత్రపరుస్తున్న యెహోవాను.’ ” 16  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 17  “అహరోనుతో ఇలా చెప్పు: ‘తరతరాలపాటు నీ సంతానంలో లోపం ఉన్న ఏ వ్యక్తీ తన దేవుని రొట్టెను అర్పించడానికి రాకూడదు. 18  లోపమున్న ఇలాంటివాళ్లు రొట్టెను అర్పించడానికి రాకూడదు: గుడ్డివాడు, కుంటివాడు, ముక్కిడివాడు,* చాలా పొడవాటి కాలు లేదా చెయ్యి ఉన్నవాడు, 19  కాలు లేదా చెయ్యి విరిగినవాడు, 20  గూనివాడు, మరగుజ్జువాడు,* కంటి సమస్య ఉన్నవాడు, గజ్జి ఉన్నవాడు, తామర ఉన్నవాడు, వృషణాలు నలిగినవాడు.+ 21  యాజకుడైన అహరోను సంతానంలో లోపమున్న ఏ పురుషుడూ యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణలు అర్పించడానికి రాకూడదు. అతనికి లోపం ఉంది కాబట్టి అతను తన దేవుని రొట్టెను అర్పించడానికి రాకూడదు. 22  అతను తన దేవుని రొట్టెను అంటే అతి పవిత్రమైన వాటిని,+ పవిత్రమైన వాటిని+ తినొచ్చు. 23  కానీ అతను తెర+ దగ్గరికి, బలిపీఠం+ దగ్గరికి రాకూడదు; ఎందుకంటే అతనికి లోపం ఉంది; అతను నా పవిత్రమైన స్థలాన్ని+ అపవిత్రపర్చకూడదు, ఎందుకంటే నేను వాళ్లను పవిత్రపరుస్తున్న+ యెహోవాను.’ ” 24  కాబట్టి మోషే అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు.

అధస్సూచీలు

లేదా “కన్యయైన.”
లేదా “ఆహారాన్ని.” ఇది బలుల్ని సూచిస్తోంది.
లేదా “ఎవరి చేతులైతే అధికారంతో నింపబడతాయో.”
లేదా “ప్రాణి.” పదకోశం చూడండి.
లేదా “ముఖరూపం చెడినవాడు.”
లేదా “బాగా బక్కచిక్కినవాడు” అయ్యుంటుంది.