లేవీయకాండం 13:1-59

  • కుష్ఠువ్యాధి గురించిన నియమాలు (1-46)

  • బట్టల్లో వచ్చే కుష్ఠు (47-59)

13  యెహోవా మోషే, అహరోనులతో ఇంకా ఇలా అన్నాడు: 2  “ఒకవేళ ఎవరి చర్మం మీదైనా వాపు గానీ, పక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ వచ్చి, అది అతని చర్మం మీద కుష్ఠువ్యాధిగా*+ మారే అవకాశం ఉంటే, అతన్ని యాజకుడైన అహరోను దగ్గరికి లేదా యాజకులైన అహరోను కుమారుల్లో ఒకరి దగ్గరికి తీసుకురావాలి.+ 3  అప్పుడు యాజకుడు అతని చర్మం మీద వచ్చిన పొడను పరిశీలిస్తాడు. ఒకవేళ దాని మీది వెంట్రుకలు తెల్లబారి, అది చర్మం కన్నా లోతుగా ఉంటే, అది కుష్ఠువ్యాధి. యాజకుడు దాన్ని పరిశీలించి అతను అపవిత్రుడని ప్రకటిస్తాడు. 4  ఒకవేళ నిగనిగలాడే ఆ మచ్చ తెల్లగా ఉండి, అది చర్మం కన్నా లోతుగా లేకపోతే, ఆ పొడ మీది వెంట్రుకలు తెల్లబారకపోయుంటే, యాజకుడు ఆ పొడ వచ్చిన వ్యక్తిని ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచుతాడు.+ 5  తర్వాత యాజకుడు ఏడో రోజున అతన్ని పరిశీలిస్తాడు. ఒకవేళ ఆ పొడ చర్మం మీద వ్యాపించకుండా అలాగే ఉంటే, యాజకుడు అతన్ని ఇంకో ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచుతాడు. 6  “యాజకుడు మళ్లీ ఏడో రోజున అతన్ని పరిశీలించాలి. ఆ పొడ చర్మం మీద వ్యాపించకుండా కాస్త మానిపోయుంటే అతను పవిత్రుడని యాజకుడు ప్రకటిస్తాడు;+ అది పక్కు మాత్రమే. అప్పుడు ఆ వ్యక్తి తన వస్త్రాలు ఉతుక్కొని పవిత్రుడౌతాడు. 7  కానీ తాను శుద్ధుణ్ణని ప్రకటించబడడం కోసం అతను యాజకుని దగ్గరికి వెళ్లిన తర్వాత అతని పక్కు* వ్యాపిస్తే, అతను మళ్లీ* యాజకుని దగ్గరికి రావాలి. 8  యాజకుడు దాన్ని పరిశీలిస్తాడు. చర్మం మీద ఆ పక్కు వ్యాపించి ఉంటే, యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. అది కుష్ఠువ్యాధి.+ 9  “ఒకవేళ ఎవరికైనా కుష్ఠువ్యాధి సోకితే, అతన్ని యాజకుని దగ్గరికి తీసుకురావాలి. 10  యాజకుడు అతన్ని పరిశీలిస్తాడు.+ ఒకవేళ చర్మం మీద తెల్లని వాపు ఉండి, అక్కడి వెంట్రుకలు తెల్లబారి, ఆ వాపు మీద పచ్చి పుండు కనిపిస్తే,+ 11  అది అతని చర్మం మీద వచ్చిన దీర్ఘకాల కుష్ఠువ్యాధి. యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. యాజకుడు అతన్ని ప్రజలకు దూరంగా ఉంచి పరిశీలించాల్సిన అవసరం లేదు,+ ఎందుకంటే అతను అపవిత్రుడు. 12  అయితే కుష్ఠువ్యాధి చర్మం అంతటా సోకి, యాజకుడు చూడగలిగే మేరకు ఆ కుష్ఠు అతని తల నుండి పాదాల వరకు వ్యాపించివుంటే, 13  యాజకుడు అతన్ని పరిశీలించినప్పుడు, ఆ కుష్ఠు అతని చర్మం అంతటా వ్యాపించి ఉండడం గమనిస్తే, యాజకుడు ఆ వ్యాధి సోకిన వ్యక్తిని పవిత్రుడని ప్రకటిస్తాడు.* చర్మం మొత్తం తెల్లబారింది కాబట్టి అతను పవిత్రుడు. 14  కానీ, ఎప్పుడైనా దానిమీద పచ్చి పుండు కనిపిస్తే, అతను అపవిత్రుడౌతాడు. 15  యాజకుడు ఆ పచ్చి పుండును గమనించినప్పుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు.+ ఆ పచ్చి పుండు అపవిత్రమైనది. అది కుష్ఠువ్యాధి.+ 16  కానీ ఆ పచ్చి పుండు మళ్లీ తెల్లబారితే, అతను యాజకుని దగ్గరికి వస్తాడు. 17  యాజకుడు అతన్ని పరిశీలిస్తాడు.+ ఆ పొడ తెల్లబారి ఉంటే, ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటిస్తాడు. అతను పవిత్రుడు. 18  “ఒకవేళ ఎవరి చర్మం మీదైనా పుండు వచ్చి మానిపోయాక, 19  ఆ చోట ఒక తెల్లని వాపు గానీ, ఎరుపు-తెలుపు కలిసిన నిగనిగలాడే మచ్చ గానీ వస్తే, అతను యాజకుని దగ్గరికి వెళ్లాలి. 20  యాజకుడు దాన్ని పరిశీలిస్తాడు.+ అది చర్మం కన్నా లోతుగా ఉండి, అక్కడి వెంట్రుకలు తెల్లబారి ఉంటే, యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. అది పుండులో నుండి బయటపడిన కుష్ఠువ్యాధి. 21  కానీ యాజకుడు పరిశీలించినప్పుడు దాని మీద తెల్ల వెంట్రుకలు లేకుండా, అది చర్మం కన్నా లోతుగా లేకుండా కాస్త మానినట్టు కనిపిస్తే, యాజకుడు అతన్ని ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచుతాడు.+ 22  కానీ అది చర్మం మీద వ్యాపించినట్టు స్పష్టంగా కనిపిస్తే, యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. అది కుష్ఠువ్యాధి. 23  కానీ నిగనిగలాడే ఆ మచ్చ వ్యాపించకుండా ఒక్కచోటే ఉంటే, అది కేవలం పుండు వల్ల ఏర్పడిన దద్దురు; యాజకుడు అతన్ని పవిత్రుడని ప్రకటిస్తాడు.+ 24  “లేదా ఎవరికైనా కాలినందువల్ల వాత ఏర్పడి, ఆ వాత దగ్గర ఉన్న పచ్చి మాంసం ఎరుపు-తెలుపు కలిసిన నిగనిగలాడే మచ్చగా లేదా తెల్ల మచ్చగా మారితే, 25  యాజకుడు దాన్ని పరిశీలిస్తాడు. నిగనిగలాడే ఆ మచ్చ ఉన్న చోట వెంట్రుకలు తెల్లబారితే, అది చర్మం కన్నా లోతుగా ఉంటే, అది వాతలో బయటపడిన కుష్ఠు. యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. అది కుష్ఠువ్యాధి. 26  కానీ యాజకుడు దాన్ని పరిశీలించినప్పుడు, నిగనిగలాడే ఆ మచ్చ మీదున్న వెంట్రుకలు తెల్లబారకుండా, అది చర్మం కన్నా లోతుగా లేకుండా కాస్త మానినట్టు కనిపిస్తే, యాజకుడు అతన్ని ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచుతాడు.+ 27  యాజకుడు అతన్ని ఏడో రోజున పరిశీలిస్తాడు. అది చర్మం మీద వ్యాపించినట్టు స్పష్టంగా కనిపిస్తే, యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటిస్తాడు. అది కుష్ఠువ్యాధి. 28  కానీ నిగనిగలాడే ఆ మచ్చ చర్మం మీద వ్యాపించకుండా ఒక్కచోటే ఉండి, కాస్త మానివుంటే అది కేవలం వాత మీద వచ్చిన వాపు. యాజకుడు అతన్ని పవిత్రుడని ప్రకటిస్తాడు, ఎందుకంటే అది వాత వల్ల ఏర్పడిన దద్దురు మాత్రమే. 29  “ఒక పురుషునికి గానీ స్త్రీకి గానీ తలమీద లేదా గడ్డం మీద పొడ వస్తే, 30  యాజకుడు ఆ పొడను పరిశీలిస్తాడు.+ అది చర్మం కన్నా లోతుగా ఉండి, అక్కడి వెంట్రుకలు పసుపు రంగులో సన్నగా ఉంటే, యాజకుడు అలాంటి వ్యక్తిని అపవిత్రుడని ప్రకటిస్తాడు; అది మాడు* మీద లేదా గడ్డం మీద వచ్చిన పొడ. అది తల మీద లేదా గడ్డం మీద వచ్చే కుష్ఠు. 31  కానీ ఆ పొడ చర్మం కన్నా లోతుగా లేకపోవడం, అక్కడ నల్లని వెంట్రుకలు లేకపోవడం యాజకుడు గమనిస్తే, ఆ పొడ సోకిన వ్యక్తిని యాజకుడు ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచాలి.+ 32  యాజకుడు ఏడో రోజున ఆ పొడను పరిశీలిస్తాడు. ఆ పొడ వ్యాపించకుండా, అక్కడి వెంట్రుకలు పసుపు రంగుకు మారకుండా, అది చర్మం కన్నా లోతుగా లేకుండా ఉంటే, 33  అతను క్షౌరం చేయించుకోవాలి, కానీ ఆ పొడ ఉన్న చోట మాత్రం క్షౌరం చేయించుకోకూడదు. తర్వాత యాజకుడు అతన్ని ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచుతాడు. 34  “యాజకుడు ఏడో రోజున ఆ పొడను మళ్లీ పరిశీలిస్తాడు. మాడు మీద, గడ్డం మీద ఉన్న పొడ చర్మంపై వ్యాపించకుండా, అది చర్మం కన్నా లోతుగా లేకుండా ఉంటే, యాజకుడు అతన్ని పవిత్రుడని ప్రకటించాలి. అతను తన వస్త్రాల్ని ఉతుక్కొని పవిత్రుడవ్వాలి. 35  కానీ అతను శుద్ధుడని ప్రకటించబడిన తర్వాత ఆ పొడ చర్మం మీద వ్యాపించినట్టు స్పష్టంగా కనిపిస్తే, 36  యాజకుడు అతన్ని పరిశీలిస్తాడు. ఆ పొడ చర్మం మీద వ్యాపించి ఉంటే, యాజకుడు పసుపు రంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; అతను అపవిత్రుడు. 37  కానీ యాజకుడు పరిశీలించినప్పుడు ఆ పొడ వ్యాపించకపోవడం, అక్కడ నల్లని వెంట్రుకలు పెరగడం గమనిస్తే, ఆ పొడ తగ్గిపోయినట్టు. అతను పవిత్రుడు, యాజకుడు అతన్ని పవిత్రుడని ప్రకటిస్తాడు.+ 38  “ఒక పురుషునికి గానీ స్త్రీకి గానీ చర్మం మీద నిగనిగలాడే మచ్చలు వచ్చి, ఆ మచ్చలు తెల్లగా ఉంటే, 39  యాజకుడు వాటిని పరిశీలిస్తాడు.+ చర్మం మీద వచ్చిన నిగనిగలాడే ఆ మచ్చలు వాడిపోయి తెల్లగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన మామూలు మచ్చలు. అతను పవిత్రుడు. 40  “ఒక వ్యక్తి తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల వస్తే, అతను పవిత్రుడే. 41  ఒకవేళ అతని తల ముందటి భాగంలో వెంట్రుకలు రాలిపోయి అక్కడ బట్టతల వస్తే, అతను పవిత్రుడే. 42  కానీ మాడు మీద గానీ నుదుటి దగ్గర గానీ బట్టతల ఏర్పడిన చోట ఎరుపు-తెలుపు కలిసిన పుండు వస్తే, అది మాడు మీద లేదా నుదుటి మీద బయటపడిన కుష్ఠు. 43  యాజకుడు అతన్ని పరిశీలిస్తాడు. బట్టతల మీద లేదా బోడి నొసటి మీద ఉన్న ఆ పొడ దగ్గర వచ్చిన వాపు ఎరుపు-తెలుపు కలిసిన పుండులా ఉంటే, అది అతని చర్మం మీద కుష్ఠులా కనిపిస్తే, 44  అతను కుష్ఠురోగి. అతను అపవిత్రుడు, అతని తలమీద వచ్చిన వ్యాధిని బట్టి యాజకుడు అతన్ని అపవిత్రుడని ప్రకటించాలి. 45  ఆ వ్యాధి సోకిన కుష్ఠురోగి తన వస్త్రాల్ని చింపుకోవాలి, తన తలవెంట్రుకల్ని దువ్వుకోకుండా వదిలేయాలి, తన మీసానికి చెయ్యి అడ్డం పెట్టుకొని, ‘అపవిత్రుణ్ణి! అపవిత్రుణ్ణి!’ అని అరవాలి. 46  అతనికి ఆ వ్యాధి ఉన్నంతకాలం అతను అపవిత్రుడిగానే ఉంటాడు. అతను అపవిత్రుడు కాబట్టి అందరికీ దూరంగా జీవించాలి. అతని నివాసం పాలెం బయట ఉంటుంది.+ 47  “కుష్ఠువ్యాధి ఒక ఉన్నివస్త్రం మీద గానీ, నారవస్త్రం మీద గానీ కనిపిస్తే, 48  అంటే ఆ నారవస్త్రంలోని లేదా ఉన్నివస్త్రంలోని నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ కనిపిస్తే; లేదా తోలు మీద గానీ, తోలుతో చేసిన వస్తువు మీద గానీ కనిపిస్తే, 49  ఆ వ్యాధివల్ల ఏర్పడిన ఆకుపచ్చ మరక లేదా ఎర్రటి మరక వస్త్రం మీద గానీ, తోలు మీద గానీ, నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ, తోలుతో చేసిన వస్తువు మీద గానీ కనిపిస్తే, దానికి కుష్ఠు సోకినట్టు. దాన్ని యాజకునికి చూపించాలి. 50  యాజకుడు ఆ వ్యాధిని పరిశీలించి, దాన్ని ఏడురోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంచాలి.+ 51  యాజకుడు ఏడో రోజున ఆ వ్యాధిని పరిశీలించినప్పుడు, అది వస్త్రం మీద గానీ, నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ, తోలు (ఆ తోలు దేనికి ఉపయోగించేదైనా) మీద గానీ వ్యాపించిందని గమనిస్తే, అది తీవ్రమైన కుష్ఠు, అది అపవిత్రమైనది.+ 52  అతను ఆ వ్యాధి సోకిన వస్త్రాన్ని గానీ, ఉన్ని వస్త్రంలోని లేదా నారవస్త్రంలోని నిలువు పోగుల్ని గానీ, అడ్డ పోగుల్ని గానీ, తోలుతో చేసిన వస్తువును గానీ కాల్చేయాలి; ఎందుకంటే అది హానికరమైన కుష్ఠు. దాన్ని అగ్నిలో కాల్చేయాలి. 53  “కానీ యాజకుడు దాన్ని పరిశీలించినప్పుడు, అది ఆ వస్త్రం మీద గానీ, నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ, తోలుతో చేసిన వస్తువు మీద గానీ వ్యాపించి ఉండకపోతే, 54  యాజకుడు దాన్ని ఉతకమని వాళ్లకు ఆజ్ఞాపిస్తాడు, దాన్ని ఇంకో ఏడురోజుల పాటు దూరంగా ఉంచుతాడు. 55  దాన్ని బాగా ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని పరిశీలిస్తాడు. మరకలో ఏ మార్పూ రాకపోతే, వ్యాధి వ్యాపించకపోయినా సరే, అది అపవిత్రమైనదే. మీరు దాన్ని అగ్నిలో కాల్చేయాలి. ఎందుకంటే ఆ వ్యాధి దాన్ని లోపలి నుండో, బయటి నుండో తినేస్తూ వచ్చింది. 56  “కానీ బాగా ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని పరిశీలించినప్పుడు, ఆ భాగంలోని మరక కాస్త తగ్గివుంటే, ఆ భాగాన్ని ఆ వస్త్రం నుండి గానీ, తోలు నుండి గానీ, నిలువు పోగుల నుండి గానీ, అడ్డ పోగుల నుండి గానీ చింపేస్తాడు. 57  అయితే అది ఇంకా ఆ వస్త్రంలో గానీ, నిలువు పోగుల్లో గానీ, అడ్డ పోగుల్లో గానీ, తోలుతో చేసిన వస్తువులో గానీ మరోచోట కనిపిస్తే, అది వ్యాపిస్తోందన్నమాట; అలా వ్యాధి సోకిన దేన్నైనా మీరు అగ్నిలో కాల్చేయాలి.+ 58  అయితే ఉతికిన తర్వాత ఆ వస్త్రం మీద గానీ, నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ, తోలుతో చేసిన వస్తువు మీద గానీ ఉన్న మరక మాయమైపోతే, మీరు దాన్ని రెండోసారి ఉతకాలి, అప్పుడు అది పవిత్రమౌతుంది. 59  “ఉన్నితో లేదా నారతో చేసిన వస్త్రం మీద గానీ, నిలువు పోగుల మీద గానీ, అడ్డ పోగుల మీద గానీ, తోలుతో చేసిన వస్తువు మీద గానీ కుష్ఠువ్యాధి కనిపిస్తే, అది పవిత్రమైనదో అపవిత్రమైనదో నిర్ధారించడానికి మీరు పాటించాల్సిన నియమాలు ఇవి.”

అధస్సూచీలు

“కుష్ఠు” అని అనువదించిన హీబ్రూ పదానికి విస్తృత అర్థం ఉంది. ఇందులో ఒకరి నుండి ఒకరికి సోకే రకరకాల చర్మవ్యాధులు ఉన్నాయి. అంతేకాదు బట్టలకు లేదా ఇళ్లకు వచ్చే కొన్ని అంటువ్యాధులు కూడా ఇందులో ఉండవచ్చు.
లేదా “పొడ.”
లేదా “రెండోసారి.”
లేదా “అది అంటువ్యాధి కాదని ప్రకటిస్తాడు.”
లేదా “తలమీది చర్మం.”