లూకా సువార్త 8:1-56
-
యేసుతోపాటు ఉన్న స్త్రీలు (1-3)
-
విత్తేవాడి ఉదాహరణ (4-8)
-
యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (9, 10)
-
విత్తేవాడి ఉదాహరణను వివరించడం (11-15)
-
దీపం మీద గిన్నె బోర్లించరు (16-18)
-
యేసు తల్లి, తమ్ముళ్లు (19-21)
-
యేసు తుఫానును నిమ్మళింపజేయడం (22-25)
-
యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (26-39)
-
యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (40-56)
8 కొన్ని రోజుల తర్వాత, ఆయన దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణించాడు.+ ఆ పన్నెండుమంది ఆయనతోపాటే ఉన్నారు.
2 అలాగే, చెడ్డదూతలు* వెళ్లగొట్టబడిన, రోగాలు బాగైన కొంతమంది స్త్రీలు కూడా ఆయనతోపాటు ఉన్నారు. వాళ్లెవరంటే: ఏడుగురు చెడ్డదూతలు వెళ్లగొట్టబడిన మగ్దలేనే మరియ;
3 హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న; ఇంకా చాలామంది ఇతర స్త్రీలు ఉన్నారు. వీళ్లంతా తమకున్న వాటితో యేసుకు, అపొస్తలులకు సేవలు చేస్తూ ఉన్నారు.+
4 వేర్వేరు నగరాల నుండి తన వెంట వచ్చిన వాళ్లతోపాటు, ఇంకా చాలామంది ప్రజలు ఒకచోట చేరినప్పుడు ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు:
5 “ఒకతను తన విత్తనాలు చల్లడానికి బయల్దేరాడు. అతను విత్తనాలు చల్లుతుండగా, కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. ప్రజలు వాటిని తొక్కుకుంటూ వెళ్లారు, ఆకాశపక్షులు వాటిని తినేశాయి.+
6 కొన్ని విత్తనాలు రాతినేల మీద పడి, మొలకెత్తాయి. కానీ తేమ లేకపోవడం వల్ల ఎండిపోయాయి.
7 మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి. ముళ్లపొదలు వాటితోపాటు పెరిగి వాటి ఎదుగుదలను అడ్డుకున్నాయి.
8 అయితే మిగతా విత్తనాలు మంచినేల మీద పడి, మొలకెత్తి, 100 రెట్లు ఎక్కువగా ఫలించాయి.” ఆయన ఈ విషయాలు చెప్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “చెవులు ఉన్నవాడు వినాలి.”+
9 అయితే ఆయన శిష్యులు, ఆ ఉదాహరణకు అర్థం చెప్పమని ఆయన్ని అడిగారు.
10 అప్పుడాయన ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం గురించిన పవిత్ర రహస్యాల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కానీ వేరేవాళ్లకు అన్నీ ఉదాహరణలుగానే ఉండిపోతాయి.+ వాళ్లు తమ కళ్లతో చూసినా కనిపించకుండా, చెవులతో విన్నా అర్థంకాకుండా ఉండేందుకే అవన్నీ ఉదాహరణల రూపంలో ఉంటాయి.+
11 ఆ ఉదాహరణకు అర్థం ఇది: విత్తనం దేవుని వాక్యం.+
12 దారిపక్కన నేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు వింటారు కానీ వాళ్లు దాన్ని నమ్మి రక్షించబడకుండా ఉండేలా అపవాది వచ్చి వాళ్ల హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్లిపోతాడు.+
13 రాతినేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు వాక్యాన్ని విన్నప్పుడు సంతోషంగా స్వీకరిస్తారు కానీ వాళ్లకు వేరు ఉండదు. కొంతకాలం వరకు వాళ్లు నమ్ముతారు. అయితే పరీక్షా కాలం వచ్చినప్పుడు పడిపోతారు.
14 ముళ్లపొదలు ఉన్న నేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు వింటారు కానీ ఈ జీవితానికి సంబంధించిన ఆందోళనలు, సిరిసంపదలు,+ సుఖాల వల్ల+ పక్కదారి పట్టి పూర్తిగా అణచివేయబడతారు, ఎప్పటికీ మంచి ఫలాలు ఫలించరు.
15 అయితే మంచినేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు వాక్యాన్ని విన్న తర్వాత ఎంతో మంచి మనసుతో+ దాన్ని అంగీకరించి, ఓర్పుతో ఫలిస్తారు.+
16 “దీపాన్ని వెలిగించిన తర్వాత ఎవ్వరూ దానిమీద గిన్నెను బోర్లించరు లేదా దాన్ని మంచం కింద పెట్టరు. కానీ లోపలికి వచ్చేవాళ్లు ఆ వెలుగును చూడగలిగేలా దాన్ని దీపస్తంభం మీద పెడతారు.+
17 రహస్యంగా ఉన్న ప్రతీది వెలుగులోకి వస్తుంది, జాగ్రత్తగా దాచివుంచిన ప్రతీది తెలిసిపోతుంది, బయటికి వస్తుంది.+
18 కాబట్టి మీరు ఎలా వింటున్నారనే దానిమీద మనసుపెట్టండి. ఎవరి దగ్గర ఉందో, వాళ్లు ఇంకా ఎక్కువ పొందుతారు.+ కానీ ఎవరి దగ్గర లేదో వాళ్లు తమ దగ్గర ఉందని ఊహించుకునేది కూడా పోగొట్టుకుంటారు.”+
19 అప్పుడు యేసువాళ్ల అమ్మ, తమ్ముళ్లు+ ఆయన కోసం వచ్చారు. కానీ అక్కడ చాలామంది ఉండడంతో ఆయన దగ్గరికి రాలేకపోయారు.+
20 కాబట్టి, “మీ అమ్మ, తమ్ముళ్లు నిన్ను చూడాలని వచ్చి బయట నిలబడ్డారు” అని ఎవరో ఆయనకు చెప్పారు.
21 అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, దాన్ని పాటించే వీళ్లే మా అమ్మ, నా తమ్ముళ్లు.”+
22 ఒకరోజు యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కినప్పుడు యేసు వాళ్లతో, “మనం సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నాడు. దాంతో వాళ్లు తెరచాప ఎత్తి బయల్దేరారు.+
23 వాళ్లు అలా వెళ్తుండగా ఆయనకు నిద్రొచ్చి పడుకున్నాడు. అప్పుడు సముద్రంలో ఒక పెనుతుఫాను చెలరేగింది. దాంతో వాళ్ల పడవ నీళ్లతో నిండి, మునిగిపోయే పరిస్థితి వచ్చింది.+
24 కాబట్టి వాళ్లు వచ్చి, “బోధకుడా, బోధకుడా, చనిపోయేలా ఉన్నాం!” అంటూ ఆయన్ని నిద్రలేపారు. దాంతో ఆయన లేచి గాలిని, ఎగసిపడుతున్న నీళ్లను గద్దించాడు. అప్పుడు అవి సద్దుమణిగాయి, అంతా ప్రశాంతంగా మారిపోయింది.+
25 అప్పుడాయన వాళ్లతో, “మీ విశ్వాసం ఏమైంది?” అన్నాడు. వాళ్లు మాత్రం చాలా భయపడిపోయి ఆశ్చర్యంతో, “అసలు ఈయన ఎవరు? ఈయన గాలుల్ని, నీళ్లను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు; అవి ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు.+
26 తర్వాత వాళ్లు గలిలయకు ఎదురుగా ఉన్న గెరసవాళ్ల ప్రాంతానికి చేరుకున్నారు.+
27 యేసు పడవ దిగగానే, ఆ నగరంలో చెడ్డదూత పట్టిన ఒకతను ఆయనకు ఎదురుపడ్డాడు. చాలాకాలం నుండి అతను బట్టలు వేసుకోకుండానే తిరుగుతున్నాడు; ఇంట్లో కాకుండా సమాధుల* మధ్య ఉంటున్నాడు.+
28 అతను యేసును చూడగానే కేకలు వేసి, ఆయన ముందు పడిపోయి, “సర్వోన్నత దేవుని కుమారుడివైన యేసూ, నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని నిన్ను వేడుకుంటున్నాను” అని బిగ్గరగా అరిచాడు.+
29 (ఎందుకంటే, యేసు ఆ అపవిత్ర దూతను* అతనిలో నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ అపవిత్ర దూత చాలాసార్లు* ఆ వ్యక్తిని లొంగదీసుకున్నాడు.+ అతన్ని పదేపదే గొలుసులతో, సంకెళ్లతో బంధించి కాపలా కింద ఉంచారు, కానీ అతను వాటిని తెంచేసుకునేవాడు. ఆ చెడ్డదూత అతన్ని ఎవరూలేని చోట్లకు ఈడ్చుకొని వెళ్లేవాడు.)
30 యేసు అతన్ని, “నీ పేరేంటి?” అని అడిగాడు. దానికి అతను, “సేన”* అని చెప్పాడు. ఎందుకంటే, అతనిలో చాలామంది చెడ్డదూతలు ఉన్నారు.
31 తమను అగాధంలోకి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించవద్దని ఆ చెడ్డదూతలు ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు.+
32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల మంద+ మేత మేస్తూ ఉంది. కాబట్టి ఆ చెడ్డదూతలు తమను ఆ పందుల్లోకి వెళ్లనివ్వమని ఆయన్ని వేడుకున్నారు, ఆయన వెళ్లనిచ్చాడు.+
33 అప్పుడు ఆ చెడ్డదూతలు అతనిలో నుండి బయటికి వచ్చి ఆ పందుల్లో దూరారు. దాంతో ఆ పందులు కొండ అంచు* వరకు పరుగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి, మునిగిపోయాయి.
34 అయితే ఆ పందుల్ని మేపేవాళ్లు జరిగింది చూసి, అక్కడి నుండి పారిపోయి ఆ నగరంలో, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో దాని గురించి చెప్పారు.
35 అప్పుడు ప్రజలు జరిగింది చూడడానికి వెళ్లారు. వాళ్లు యేసు దగ్గరికి వచ్చి, చెడ్డదూతలు వదిలిపోయిన వ్యక్తి బట్టలు వేసుకొని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చొని ఉండడం చూసి భయపడ్డారు.
36 ఆ సంఘటనను చూసినవాళ్లు, చెడ్డదూతలు పట్టిన వ్యక్తి ఎలా బాగయ్యాడనే దాని గురించి వచ్చిన ప్రజలకు చెప్పారు.
37 తర్వాత, గెరస చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చిన చాలామంది యేసును తమ దగ్గర నుండి వెళ్లిపొమ్మని అడిగారు. ఎందుకంటే వాళ్లకు చాలా భయం పట్టుకుంది. అప్పుడు ఆయన అక్కడి నుండి వెళ్లిపోవడానికి పడవ ఎక్కాడు.
38 అయితే చెడ్డదూతలు వదిలిపోయిన వ్యక్తి మాత్రం తాను కూడా యేసుతో పాటు వస్తానని ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు. కానీ యేసు ఇలా అంటూ అతన్ని పంపించేశాడు:+
39 “మీ ఇంటికి వెళ్లి, దేవుడు నీ కోసం చేసినదాని గురించి చెప్తూ ఉండు.” కాబట్టి అతను వెళ్లి, యేసు తన కోసం చేసినదాని గురించి ఆ నగరమంతా ప్రకటిస్తూ ఉన్నాడు.
40 యేసు గలిలయకు తిరిగొచ్చినప్పుడు జనం ఆయన్ని ప్రేమతో చేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్లందరూ ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.+
41 అయితే ఇదిగో! యాయీరు అనే ఒకతను వచ్చాడు. అతను సమాజమందిర అధికారి. అతను యేసు పాదాల దగ్గర పడి, తన ఇంటికి రమ్మని ఆయన్ని బ్రతిమాలడం మొదలుపెట్టాడు.+
42 ఎందుకంటే, అతని ఒక్కగానొక్క కూతురు చావుబ్రతుకుల మధ్య ఉంది. ఆమెకు 12 ఏళ్లు.
యేసు వెళ్తుండగా ప్రజలు తోసుకుంటూ ఆయన మీద పడుతున్నారు.
43 వాళ్లలో 12 ఏళ్లుగా రక్తస్రావంతో+ బాధపడుతున్న ఒకామె ఉంది, అప్పటివరకు ఎవరూ ఆమెను బాగుచేయలేకపోయారు.+
44 ఆమె యేసు వెనక నుండి వచ్చి ఆయన పైవస్త్రం అంచును+ ముట్టుకుంది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
45 అప్పుడు యేసు, “నన్ను ముట్టుకుంది ఎవరు?” అని అడిగాడు. వాళ్లందరూ, “నేను కాదు” అని అంటూ ఉండగా పేతురు, “బోధకుడా, ప్రజలు తోసుకుంటూ నీ మీద పడుతున్నారు” అని అన్నాడు.
46 అయితే యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి+ బయటికి వెళ్లింది” అన్నాడు.
47 జరిగింది యేసుకు తెలిసిపోయిందని గమనించిన ఆ స్త్రీ వణికిపోతూ వచ్చి ఆయన ముందు మోకరించి, తాను ఆయన్ని ఎందుకు ముట్టుకుందో, వెంటనే ఎలా బాగైందో ఆ ప్రజలందరి ముందు చెప్పింది.
48 అయితే యేసు ఆమెతో, “అమ్మా,* నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది. మనశ్శాంతితో వెళ్లు” అన్నాడు.+
49 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిర అధికారి ఇంటినుండి ఒక వ్యక్తి వచ్చి, “నీ కూతురు చనిపోయింది. ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టకు” అన్నాడు.+
50 ఆ మాట విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు, ఆమె రక్షించబడుతుంది” అన్నాడు.+
51 ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురును, యోహానును, యాకోబును, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని తప్ప ఇంకెవర్నీ తనతోపాటు లోపలికి రానివ్వలేదు.
52 కానీ ప్రజలందరూ ఆ పాప గురించి ఏడుస్తూ, దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు, “ఏడ్వకండి,+ ఆమె చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+
53 ఆ మాట వినగానే వాళ్లు ఆయన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆమె చనిపోయిందని వాళ్లకు తెలుసు.
54 అయితే యేసు ఆ పాప చెయ్యి పట్టుకొని, “పాపా, లే!” అన్నాడు.+
55 దాంతో ఆమె ప్రాణం*+ తిరిగొచ్చింది, వెంటనే ఆమె లేచి నిలబడింది.+ ఆమెకు తినడానికి ఏమైనా పెట్టమని యేసు ఆజ్ఞాపించాడు.
56 అప్పుడు ఆమె తల్లిదండ్రులు సంతోషం పట్టలేకపోయారు. అయితే, జరిగినదాని గురించి ఎవరికీ చెప్పొద్దని యేసు వాళ్లకు ఆజ్ఞాపించాడు.+
అధస్సూచీలు
^ లేదా “ఉపమానం.”
^ లేదా “స్మారక సమాధుల.”
^ పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
^ లేదా “చాలాకాలంగా” అయ్యుంటుంది.
^ మత్తయి 26:53 అధస్సూచి చూడండి.
^ లేదా “నిటారుగా ఉన్న అంచు.”
^ అక్ష., “కూతురా.”
^ లేదా “జీవశక్తి.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.