రోమీయులు 2:1-29

  • యూదుల మీద, గ్రీకువాళ్ల మీద దేవుని తీర్పు (1-16)

    • మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది (14, 15)

  • యూదులు, ధర్మశాస్త్రం (17-24)

  • హృదయ సంబంధమైన సున్నతి (25-29)

2  ఇతరులకు తీర్పు తీర్చే ఓ మనిషీ, నిన్ను నువ్వు సమర్థించుకోలేవు. నువ్వు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చినప్పుడు, నువ్వు దోషివని నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు వేటి విషయంలో తీర్పు తీరుస్తున్నావో అవే పనులు నువ్వు కూడా చేస్తున్నావు.+ 2  అలవాటుగా అలాంటి పనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా దేవుడు తీర్చే తీర్పు సత్యానికి అనుగుణంగా ఉంటుందని మనకు తెలుసు. 3  కానీ ఓ మనిషీ, అలవాటుగా అలాంటివి చేసేవాళ్లకు తీర్పు తీర్చే నువ్వు అవే పనులు చేస్తూ దేవుని తీర్పును తప్పించుకుంటావని అనుకుంటున్నావా? 4  దేవుని గొప్ప దయను,+ సహనాన్ని,+ ఓర్పును+ చిన్నచూపు చూస్తావా? ఆయన తన దయతో నిన్ను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడని+ నీకు తెలీదా? 5  అయితే నీ మొండితనం వల్ల, నువ్వు పశ్చాత్తాపం చూపించడానికి ఇష్టపడకపోవడం వల్ల నీకోసం నువ్వే దేవుని ఆగ్రహాన్ని మూటగట్టుకుంటున్నావు. దేవుడు తన నీతియుక్తమైన తీర్పును బయల్పర్చే రోజున ఆ ఆగ్రహాన్ని చూపిస్తాడు.+ 6  దేవుడు ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల పనులకు తగ్గట్టు ప్రతిఫలం ఇస్తాడు.+ 7  ఓర్పుగా మంచిపనులు చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను*+ పొందాలని ప్రయత్నించేవాళ్లకు ఆయన శాశ్వత జీవితాన్ని ఇస్తాడు; 8  అయితే గొడవలకు దిగే మనస్తత్వం ఉండి, సత్యానికి లోబడకుండా అవినీతిగా నడుచుకునేవాళ్ల మీద ఆయన ఆగ్రహాన్ని, కోపాన్ని వెళ్లగక్కుతాడు.+ 9  హానికరమైన పనులు చేసే ప్రతీ ఒక్కరి మీదికి, ముందు యూదుల మీదికి, తర్వాత గ్రీకువాళ్ల మీదికి ఆయన శ్రమలు, బాధలు తీసుకొస్తాడు; 10  కానీ మంచిపనులు చేసే ప్రతీ ఒక్కరికి, ముందు యూదులకు,+ తర్వాత గ్రీకువాళ్లకు+ మహిమ, ఘనత, శాంతి అనుగ్రహిస్తాడు. 11  ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.+ 12  ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వాళ్లందరూ ధర్మశాస్త్రం లేకుండానే నాశనమౌతారు;+ కానీ ధర్మశాస్త్రం కింద ఉండి పాపం చేసిన వాళ్లందరూ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందుతారు.+ 13  ధర్మశాస్త్రాన్ని వినేవాళ్లు దేవుని దృష్టిలో నీతిమంతులు అవ్వరు గానీ, దాన్ని పాటించేవాళ్లే నీతిమంతులుగా తీర్పుతీర్చబడతారు.+ 14  ధర్మశాస్త్రంలేని అన్యజనులు+ స్వతహాగా ధర్మశాస్త్రంలోని పనులు చేసినప్పుడు, ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్లకువాళ్లే ధర్మశాస్త్రంలా ఉన్నారు. 15  వాళ్లు తమ పనుల ద్వారా, ధర్మశాస్త్రం తమ హృదయాల్లో రాసివుందని చూపిస్తారు. వాళ్లతోపాటు వాళ్ల మనస్సాక్షి కూడా, వాళ్లు చేసే పనులు మంచివని గానీ చెడ్డవని గానీ సాక్ష్యం ఇస్తుంది. అలా, ఫలానా విషయంలో వాళ్లు దోషులో కాదో వాళ్ల ఆలోచనలే చెప్తాయి. 16  క్రీస్తుయేసు ద్వారా దేవుడు మనుషుల రహస్యమైన పనులకు తీర్పుతీర్చే రోజున ఆ విషయం బయటపడుతుంది.+ నేను ప్రకటిస్తున్న మంచివార్తకు అనుగుణంగా అది జరుగుతుంది. 17  నువ్వు యూదుణ్ణని చెప్పుకుంటున్నావు,+ ధర్మశాస్త్రం మీద ఆధారపడుతున్నావు, దేవుని విషయంలో గర్వపడుతున్నావు, 18  ఆయన ఇష్టం ఏమిటో నీకు తెలుసు, ధర్మశాస్త్రంలోని విషయాలు నేర్చుకోవడం* వల్ల ఏవి శ్రేష్ఠమైనవో గుర్తించగలుగుతున్నావు;+ 19  నువ్వు గుడ్డివాళ్లకు దారి చూపించేవాడిగా, చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగుగా, 20  తెలివితక్కువవాళ్లను సరిదిద్దేవాడిగా, పిల్లలకు* బోధకుడిగా, ధర్మశాస్త్రంలోని జ్ఞానానికీ సత్యానికీ సంబంధించిన ప్రాథమిక విషయాలు* తెలిసినవాడిగా ఉన్నావని బలంగా నమ్ముతున్నావు. 21  అలాంటిది, ఇతరులకు బోధించే నువ్వు, నీకు నువ్వు బోధించుకోవా?+ “దొంగతనం చేయకూడదు”+ అని ప్రకటించే నువ్వు దొంగతనం చేస్తావా? 22  “వ్యభిచారం చేయకూడదు”+ అని చెప్పే నువ్వు వ్యభిచారం చేస్తావా? విగ్రహాల్ని అసహ్యించుకునే నువ్వు గుళ్లను దోచుకుంటావా? 23  ధర్మశాస్త్రం విషయంలో గర్వపడే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరి దేవుణ్ణి అవమానిస్తావా? 24  లేఖనాల్లో రాసివున్నట్టే, “మీ వల్లే అన్యజనుల మధ్య దేవుని పేరు దూషించబడుతోంది.”+ 25  నిజానికి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే+ సున్నతివల్ల+ నీకు ప్రయోజనం ఉంటుంది; కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే నువ్వు సున్నతి చేయించుకున్నా, చేయించుకోనట్టే లెక్క. 26  సున్నతి చేయించుకోని వ్యక్తి+ ధర్మశాస్త్రంలోని దేవుని నియమాల్ని పాటిస్తే, అతను సున్నతి చేయించుకోకపోయినా, సున్నతి చేయించుకున్నట్టే లెక్క, కాదంటారా?+ 27  నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, నువ్వు సున్నతి చేయించుకున్నావు, అయినా ధర్మశాస్త్రాన్ని మీరావు. అలాంటి నీకు, సున్నతి చేయించుకోని వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా తీర్పుతీరుస్తాడు. 28  యూదుణ్ణని చెప్పుకునే వ్యక్తి అసలైన యూదుడు కాదు;+ శరీర ప్రకారం చేయించుకునే సున్నతి అసలైన సున్నతి కాదు.+ 29  హృదయంలో యూదునిగా ఉన్నవాడే అసలైన యూదుడు;+ అతని సున్నతి హృదయానికి సంబంధించినది.+ ఆ సున్నతి పవిత్రశక్తి ద్వారా జరుగుతుంది, ధర్మశాస్త్రం ద్వారా కాదు.+ అతన్ని మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.+

అధస్సూచీలు

లేదా “కుళ్లిపోయే అవకాశం లేని జీవాన్ని.”
లేదా “ఉపదేశించబడడం.”
ఈ పదం జ్ఞానంలో, అవగాహనలో ఎదగాల్సిన వాళ్లను సూచిస్తుండవచ్చు.
లేదా “సంబంధించిన నమూనా.”