యెహోషువ 5:1-15

  • గిల్గాలులో సున్నతి (1-9)

  • పస్కా ఆచరించడం; మన్నా ఆగిపోవడం (10-12)

  • యెహోవా సైన్యానికి అధిపతి (13-15)

5  ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటేవరకు యెహోవా వాళ్ల ఎదుట దాని నీళ్లను ఎండిపోయేలా చేశాడని యొర్దానుకు పడమటి వైపున్న* అమోరీయుల రాజులందరూ,+ సముద్ర తీరాన ఉన్న కనానీయుల రాజులందరూ విన్నారు. అది విన్న వెంటనే వాళ్లు చాలా భయపడిపోయారు,*+ ఇశ్రాయేలీయుల్ని బట్టి వాళ్లలో ఏమాత్రం ధైర్యం లేకుండా పోయింది. 2  అప్పుడు యెహోవా యెహోషువకు ఇలా చెప్పాడు: “రాతి కత్తులు చేయించి ఇశ్రాయేలు పురుషులకు మళ్లీ రెండోసారి సున్నతి చేయించు.”+ 3  కాబట్టి యెహోషువ రాతి కత్తులు చేయించి, గిబియత్‌-హారాలోతులో* ఇశ్రాయేలు పురుషులకు సున్నతి చేయించాడు.+ 4  యెహోషువ వాళ్లకు సున్నతి ఎందుకు చేయించాడంటే, ఐగుప్తు నుండి వచ్చినవాళ్లలో పురుషులందరూ అంటే యోధులందరూ* ఐగుప్తు నుండి వచ్చాక, దారిలో ఎడారిలోనే చనిపోయారు.+ 5  ఐగుప్తు నుండి వచ్చిన వాళ్లందరూ సున్నతి పొందారు, కానీ ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎడారి మార్గంలో పుట్టినవాళ్లంతా సున్నతి పొందలేదు. 6  ఇశ్రాయేలు జనమంతా చనిపోయేవరకు, అంటే ఐగుప్తు నుండి వచ్చి యెహోవా స్వరానికి లోబడని యోధులందరూ చనిపోయేవరకు+ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు+ ఎడారిలోనే నడిచారు. యెహోవా తన ప్రజలకు* ఇస్తానని వాళ్ల పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని,+ అంటే పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని+ వాళ్లను ఎన్నడూ చూడనివ్వనని యెహోవా వాళ్లతో ప్రమాణం చేశాడు.+ 7  కాబట్టి ఆయన వాళ్ల స్థానంలో వాళ్ల కుమారుల్ని ఈ దేశానికి తీసుకొచ్చాడు.+ వీళ్లకు యెహోషువ సున్నతి చేయించాడు; దారిలో వీళ్లకు సున్నతి చేయించలేదు కాబట్టి వీళ్లు సున్నతి పొందలేదు. 8  జనం మొత్తం సున్నతి చేయించుకున్న తర్వాత, వాళ్లు కోలుకునేంత వరకు పాలెంలోనే ఉండిపోయారు. 9  అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “ఈ రోజు నేను ఐగుప్తు నిందను మీ మీద నుండి తొలగించాను.”* అందుకే నేటివరకు ఆ స్థలాన్ని గిల్గాలు*+ అని పిలుస్తున్నారు. 10  ఇశ్రాయేలీయులు గిల్గాలులోనే ఉండిపోయారు. వాళ్లు యెరికో ఎడారి మైదానాల్లో ఆ నెల 14వ రోజు సాయంత్రం పస్కా ఆచరించారు.+ 11  పస్కా తర్వాతి రోజు నుండే వాళ్లు ఆ దేశ పంటను అంటే పులవని రొట్టెల్ని,+ వేయించిన ధాన్యాన్ని తినడం మొదలుపెట్టారు. 12  వాళ్లు ఆ దేశ పంటలో కొంత తిన్న రోజు నుండి మన్నా ఆగిపోయింది; ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు.+ అయితే ఆ సంవత్సరంలో వాళ్లు కనాను దేశపు పంటను తినడం మొదలుపెట్టారు.+ 13  యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు, అతను తలెత్తి చూడగా చేతిలో కత్తి పట్టుకొని ఉన్న+ ఒక వ్యక్తి కనిపించాడు.+ యెహోషువ ఆయన దగ్గరికి వెళ్లి, “నువ్వు మా వైపు ఉన్నావా, మా శత్రువుల వైపు ఉన్నావా?” అని అడిగాడు. 14  దానికి ఆయన, “లేదు, నేను యెహోవా సైన్యానికి అధిపతిగా వచ్చాను”+ అని అన్నాడు. వెంటనే యెహోషువ నేలమీద సాగిలపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి చెప్పాలనుకుంటున్నాడు?” అని ఆయన్ని అడిగాడు. 15  అప్పుడు యెహోవా సైన్యానికి అధిపతి, “నీ పాదాలకు ఉన్న చెప్పులు తీసేయి. నువ్వు నిలబడివున్న స్థలం పవిత్రమైనది” అని యెహోషువకు చెప్పాడు. యెహోషువ వెంటనే అలా చేశాడు.+

అధస్సూచీలు

అక్ష., “సముద్రం వైపున్న.”
లేదా “వాళ్ల గుండెలు నీరుగారిపోయాయి.”
“ముందోళ్ల కొండ” అని అర్థం.
లేదా “సైన్యంలో పనిచేసే వయసున్న మగవాళ్లందరూ.”
అక్ష., “మనకు.”
అక్ష., “దొర్లించాను.”
“దూరంగా దొర్లించడం” అని అర్థం.