యెహోషువ 4:1-24

  • రాళ్లు జ్ఞాపకార్థంగా ఉంటాయి (1-24)

4  ప్రజలందరూ యొర్దాను నది దాటిన వెంటనే, యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: 2  “నువ్వు గోత్రానికి ఒకరు చొప్పున ప్రజల్లో నుండి 12 మందిని ఎంచుకుని,+ 3  వాళ్లకు ఇలా ఆజ్ఞాపించు: ‘యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు పాదాలు కదల్చకుండా నిలబడివున్న స్థలం+ నుండి 12 రాళ్లు తీసుకొచ్చి వాటిని మీరు రాత్రి బస చేసే చోట ఉంచండి.’ ”+ 4  కాబట్టి యెహోషువ, గోత్రానికి ఒకరు చొప్పున ఇశ్రాయేలీయుల్లో నుండి తాను నియమించిన 12 మందిని పిలిచి, 5  వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మందసాన్ని దాటి యొర్దాను మధ్యలోకి వెళ్లి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం మీలో ప్రతీ ఒక్కరు తమ భుజాల మీద ఒక రాయిని మోసుకురావాలి. 6  ఆ రాళ్లు మీ మధ్య సూచనగా ఉండాలి. తర్వాత ఎప్పుడైనా మీ పిల్లలు,* ‘ఈ రాళ్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి?’ అని మిమ్మల్ని అడిగితే,+ 7  మీరు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘ఎందుకంటే, యెహోవా ఒప్పంద మందసం ముందు యొర్దాను నది నీళ్లు ఆగిపోయాయి.+ ఆ మందసం యొర్దాను నదిని దాటినప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పటికీ జ్ఞాపకార్థంగా* ఉంటాయి.’ ”+ 8  ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్టే చేశారు. యెహోవా యెహోషువకు చెప్పినట్టే, వాళ్లు యొర్దాను మధ్య నుండి ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం 12 రాళ్లను తీసుకున్నారు. వాళ్లు వాటిని తీసుకొచ్చి తాము రాత్రి బస చేయబోయే చోట ఉంచారు. 9  యొర్దాను మధ్యలో, ఒప్పంద మందసాన్ని మోస్తున్న యాజకులు తమ పాదాల్ని నిలిపిన చోట+ కూడా యెహోషువ 12 రాళ్లను ఉంచాడు. అవి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాయి. 10  మోషే యెహోషువకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం, ప్రజలకు చెప్పమని యెహోవా యెహోషువకు ఆదేశించినవన్నీ పూర్తయ్యేవరకు మందసాన్ని మోస్తున్న యాజకులు యొర్దాను మధ్యలో నిలబడేవున్నారు. ఈలోగా ప్రజలు త్వరత్వరగా నది దాటారు. 11  ప్రజలందరూ దాటిన వెంటనే, వాళ్లు చూస్తుండగా యాజకులు యెహోవా మందసాన్ని మోసుకుంటూ దాటారు.+ 12  మోషే తమకు ఆజ్ఞాపించినట్టే+ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్లు యుద్ధ పంక్తులు తీరి ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటారు.+ 13  ఆయుధాలు ధరించిన దాదాపు 40,000 మంది సైనికులు యెహోవా సన్నిధిలో యెరికో ఎడారి మైదానాలకు వెళ్లారు. 14  ఆ రోజున యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరి దృష్టిలో యెహోషువను ఘనపర్చాడు.+ వాళ్లు మోషేను ఎంతో గౌరవించినట్టే+ యెహోషువను కూడా అతను బ్రతికున్నంత కాలం ఎంతో గౌరవించారు.* 15  ఆ తర్వాత యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: 16  “యొర్దానులో నుండి బయటికి రమ్మని సాక్ష్యపు మందసం+ మోస్తున్న యాజకులకు ఆజ్ఞాపించు.” 17  కాబట్టి యెహోషువ, “యొర్దానులో నుండి బయటికి రండి” అని యాజకులకు ఆజ్ఞాపించాడు. 18  యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న యాజకులు+ యొర్దాను మధ్యలో నుండి బయటికి వచ్చి వాళ్ల పాదాల్ని తీరాన మోపినప్పుడు, యొర్దాను నది మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టింది, దాని గట్లు అంతకుముందులా నీళ్లతో పొంగిపొర్లాయి.+ 19  మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దానులో నుండి బయటికి వచ్చి, యెరికో తూర్పు సరిహద్దున ఉన్న గిల్గాలులో బసచేశారు.+ 20  యొర్దాను నదిలో నుండి తీసుకొచ్చిన 12 రాళ్ల విషయానికొస్తే, యెహోషువ వాటిని గిల్గాలులో నిలబెట్టించాడు.+ 21  ఆ తర్వాత అతను ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “భవిష్యత్తులో మీ పిల్లలు, ‘ఈ రాళ్లు ఏమిటి?’ అని మిమ్మల్ని అడిగితే,+ 22  మీరు మీ పిల్లలకు ఇలా వివరించాలి: ‘ఇశ్రాయేలీయులు పొడినేల మీద యొర్దాను నది దాటారు.+ 23  ప్రజలు ఎర్రసముద్రం దాటేవరకు మీ దేవుడైన యెహోవా వాళ్ల ఎదుట దాన్ని ఎండిపోయేలా చేసినట్టే,+ మేము యొర్దాను నది దాటేవరకు మీ దేవుడైన యెహోవా మా ఎదుట యొర్దాను నీళ్లను ఎండిపోయేలా చేశాడు. 24  యెహోవా చెయ్యి ఎంత బలమైనదో భూమ్మీది ప్రజలందరూ తెలుసుకోవాలనీ,+ మీరు మీ దేవుడైన యెహోవాకు ఎప్పుడూ భయపడాలనీ ఆయన అలా చేశాడు.’ ”

అధస్సూచీలు

అక్ష., “కుమారులు.”
లేదా “జ్ఞాపికగా.”
అక్ష., “భయపడ్డారు.”