యెహెజ్కేలు 43:1-27

  • ఆలయం యెహోవా మహిమతో నిండిపోవడం (1-12)

  • బలిపీఠం (13-27)

43  తర్వాత అతను నన్ను తూర్పు ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు.+  అక్కడ నేను ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు వైపు నుండి రావడం+ చూశాను, ఆయన స్వరం ప్రవాహాల శబ్దంలా ఉంది;+ ఆయన మహిమ వల్ల భూమి ప్రకాశించింది.+  నేను చూసింది, నేను* నగరాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు చూసిన దర్శనంలా ఉంది. అది కెబారు నది దగ్గర నేను చూసిన దానిలా కనిపించింది;+ దాంతో నేను నేల మీద సాష్టాంగపడ్డాను.  అప్పుడు యెహోవా మహిమ తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.+  ఒక శక్తి* నన్ను లేపి లోపలి ప్రాంగణంలోకి తీసుకొచ్చింది, ఆలయం యెహోవా మహిమతో నిండివుండడం నేను చూశాను.+  అప్పుడు ఆలయంలో నుండి ఒక వ్యక్తి నాతో మాట్లాడడం నేను విన్నాను, ఆ మనిషి వచ్చి నా పక్కన నిలబడ్డాడు.+  ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇది నా సింహాసనం ఉండే స్థలం,+ నేను నా పాదాలు నిలిపే స్థలం.+ ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎప్పటికీ నివసిస్తాను.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లూ, వాళ్ల రాజులూ తమ ఆధ్యాత్మిక వ్యభిచారంతో, వాళ్ల రాజులు చనిపోయినప్పుడు వాళ్ల కళేబరాలతో నా పవిత్రమైన పేరును ఇక అపవిత్రపర్చరు.+  వాళ్లు నా గడప పక్కనే తమ గుళ్ల గడపల్ని, నా ద్వారబంధాల పక్కనే వాళ్ల గుళ్ల ద్వారబంధాల్ని పెట్టి తమ అసహ్యమైన పనులతో నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చారు; నాకూ వాటికీ మధ్య కేవలం ఒక గోడే అడ్డుగా ఉంది.+ వాళ్లు అలా చేశారు కాబట్టి నేను కోపంతో వాళ్లను తుడిచిపెట్టేశాను.+  ఇప్పుడు వాళ్లు తమ ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని, తమ రాజుల కళేబరాల్ని నాకు దూరంగా పెట్టాలి, అలాచేస్తే నేను ఎప్పటికీ వాళ్ల మధ్య నివసిస్తాను.+ 10  “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ తప్పుల్ని బట్టి సిగ్గుపడేలా+ నువ్వు ఆలయం గురించి వాళ్లకు వివరంగా చెప్పు,+ వాళ్లు దాని నమూనాను పరిశీలించాలి.* 11  ఒకవేళ వాళ్లు తాము చేసిన దానంతటి గురించి సిగ్గుపడితే, నువ్వు వాళ్లకు ఆలయ రేఖాచిత్రాన్ని, దాని నమూనాను, బయటికీ లోపలికీ వెళ్లే దారుల్ని తెలియజేయాలి.+ వాళ్లకు దాని రేఖాచిత్రాలు, శాసనాలు, నియమాలు అన్నిటినీ చూపించు. వాళ్ల కళ్లముందు వాటిని రాయి. అప్పుడు వాళ్లు దాని రేఖాచిత్రాన్ని గమనించి, దాని శాసనాల్ని పాటించగలుగుతారు.+ 12  ఇది ఆలయానికి సంబంధించిన నియమం. పర్వతం మీద ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా అతి పవిత్రం.+ ఇదిగో! ఇది ఆలయానికి సంబంధించిన నియమం. 13  “ఇవి మూర (ప్రతీ మూరకు ఒక బెత్తెడు జతచేయబడింది)* కొలత ప్రకారం బలిపీఠానికి సంబంధించిన కొలతలు.+ దాని అడుగుభాగం ఒక మూర ఎత్తు, ఒక మూర వెడల్పు ఉంది. దానికి నాలుగువైపులా జేనడు* చూరు ఉంది. ఇది బలిపీఠం అడుగుభాగం. 14  నేలమీదున్న ఆ అడుగుభాగం మీద చుట్టూ ఒక అంచు ఉంది, దాని ఎత్తు రెండు మూరలు, వెడల్పు ఒక మూర. ఈ చిన్న అంచు మీద చుట్టూ పెద్ద అంచు ఉంది, దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. 15  బలిపీఠం కొలిమి నాలుగు మూరల ఎత్తు ఉంది, బలిపీఠం కొలిమి నుండి నాలుగు కొమ్ములు పైకి ఉన్నాయి.+ 16  బలిపీఠం కొలిమి చతురస్రాకారంలో ఉంది, దాని పొడవు 12 మూరలు, వెడల్పు 12 మూరలు.+ 17  దాని చుట్టూ ఉన్న అంచు 14 మూరల పొడవు, 14 మూరల వెడల్పు ఉంది; దాని చుట్టూ ఉన్న చూరు అర మూర ఉంది, దాని అడుగుభాగం అన్నివైపులా ఒక మూర ఉంది. “దాని మెట్లు తూర్పు వైపుకు ఉన్నాయి.” 18  తర్వాత అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సంపూర్ణ దహనబలులు అర్పించడానికి, రక్తాన్ని చిలకరించడానికి బలిపీఠాన్ని చేసేటప్పుడు ఈ నిర్దేశాలు పాటించాలి.’+ 19  “ ‘నాకు పరిచారం చేయడానికి నన్ను సమీపించే సాదోకు వంశస్థులైన లేవి యాజకులకు+ నువ్వు పాపపరిహారార్థ బలిగా మందలో నుండి ఒక కోడెదూడను ఇవ్వాలి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 20  ‘నువ్వు దాని రక్తంలో కొంచెం తీసుకొని, బలిపీఠం నాలుగు కొమ్ముల మీద, దాని చుట్టూ ఉన్న అంచు నాలుగు మూలల మీద, అలాగే చుట్టూ ఉన్న చూరు మీద రాయాలి. అలా నువ్వు బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేసి, దానికి ప్రాయశ్చిత్తం చేస్తావు.+ 21  తర్వాత పాపపరిహారార్థ బలిని అంటే కోడెదూడను తీసుకుని, ఆలయంలో నిర్ణయించబడిన చోట, పవిత్రమైన స్థలం బయట దాన్ని కాల్చేయాలి.+ 22  రెండో రోజు నువ్వు ఏ లోపంలేని మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి; వాళ్లు కోడెదూడతో శుద్ధి చేసినట్టే బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేస్తారు.’ 23  “ ‘నువ్వు దాన్ని పాపం నుండి శుద్ధి చేశాక, మందలో నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడను, ఏ లోపంలేని పొట్టేలును అర్పించాలి. 24  నువ్వు వాటిని యెహోవా సన్నిధికి తేవాలి; అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి,+ యెహోవాకు సంపూర్ణ దహనబలిగా అర్పిస్తారు. 25  ఏడురోజుల పాటు నువ్వు ప్రతీరోజు ఒక మేకపోతును పాపపరిహారార్థ బలిగా అర్పించాలి,+ అలాగే మందలో నుండి ఒక కోడెదూడను, ఒక పొట్టేలును అర్పించాలి; నువ్వు ఏ దోషంలేని* జంతువుల్ని అర్పించాలి. 26  ఏడురోజుల పాటు వాళ్లు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వాళ్లు దాన్ని శుద్ధి చేసి ప్రతిష్ఠించాలి. 27  ఆ రోజులు పూర్తయ్యాక, ఎనిమిదో రోజున+ అలాగే అప్పటినుండి యాజకులు మీ* సంపూర్ణ దహనబలుల్ని, సమాధాన బలుల్ని బలిపీఠం మీద అర్పిస్తారు; నేను మీ విషయంలో సంతోషిస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”

అధస్సూచీలు

లేదా “ఆయన” అయ్యుంటుంది.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
అక్ష., “కొలవాలి.”
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
లేదా “పరిపూర్ణ.”
అంటే, ప్రజల.