యెహెజ్కేలు 31:1-18

  • గొప్ప దేవదారు చెట్టు అయిన ఐగుప్తు పతనం (1-18)

31  11వ సంవత్సరం మూడో నెల మొదటి రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఐగుప్తు రాజైన ఫరోతో, అతని సైన్యాలతో ఇలా చెప్పు,+‘గొప్పతనం విషయంలో నువ్వు ఎవరిలా ఉన్నావు?   నువ్వు ఒక అష్షూరీయుడిలా, లెబానోనులోని దేవదారు చెట్టులా ఉన్నావు,దానికి అందమైన కొమ్మలు ఉండేవి, అది గుబురుగా ఉండి నీడనిచ్చేది, చాలా ఎత్తుగా ఉండేది;దాని కొన మేఘాల్లో ఉండేది.   నీళ్ల వల్ల అది పెద్దగా పెరిగింది, లోతైన నీటి ఊటల వల్ల ఎత్తుగా ఎదిగింది. అది నాటబడిన చోట చుట్టూ వాగులు ఉండేవి;వాటి కాలువలు మైదానంలోని చెట్లన్నిటికీ ప్రవహించేవి.   అందుకే అది మైదానంలోని చెట్లన్నిటి కన్నా ఎత్తుగా పెరిగింది. ఆ వాగుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంవల్లదాని శాఖలు విస్తరించాయి, కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.   దాని శాఖల్లో ఆకాశపక్షులన్నీ గూళ్లు కట్టుకున్నాయి,దాని కొమ్మల కింద అడవి జంతువులన్నీ పిల్లల్ని కన్నాయి,ఎక్కువ జనాభా ఉన్న జనాలన్నీ దాని నీడలో నివసించాయి.   దాని వేళ్లు విస్తార జలాల్లోకి వ్యాపించడం వల్లఅది ఎంతో అందంగా తయారైంది, దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.   దేవుని తోటలోని+ ఏ దేవదారు చెట్టూ దానిలా లేదు. దానిలాంటి శాఖలు ఏ సరళవృక్షానికీ లేవు,దానిలాంటి కొమ్మలు ఏ సాల చెట్టుకూ లేవు. దేవుని తోటలోని ఏ చెట్టూ దాని అందంతో పోటీ పడలేదు.   నేను దానికి దట్టమైన ఆకులు, కొమ్మలు ఇచ్చి దాన్ని అందంగా చేశాను,ఏదెను తోటలో అంటే సత్యదేవుని తోటలో ఉన్న చెట్లన్నీ దాన్ని చూసి ఈర్ష్యపడ్డాయి.’ 10  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అది* చాలా ఎత్తుగా పెరిగి, తన కొనను మేఘాల్లోకి హెచ్చించుకుంది, దాని ఎత్తు వల్ల దాని హృదయానికి పొగరెక్కింది కాబట్టి, 11  నేను దాన్ని జనాల బలమైన పరిపాలకుడికి అప్పగిస్తాను.+ అతను ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తాడు; నేను దాని దుష్టత్వాన్ని బట్టి దాన్ని తిరస్కరిస్తాను. 12  జనాల్లో అత్యంత కిరాతకులైన విదేశీయులు దాన్ని నరికేసి పర్వతాల మీద విడిచిపెడతారు, దాని ఆకులు లోయలన్నిట్లో రాలిపడతాయి, దాని కొమ్మలు దేశంలోని వాగులన్నిట్లో విరిగిపడతాయి.+ భూమ్మీది జనాలన్నీ దాని నీడ నుండి బయటికొచ్చి, దాన్ని విడిచిపెడతాయి. 13  పడిపోయిన దాని మొద్దు మీద ఆకాశపక్షులు, దాని కొమ్మల మీద అడవి జంతువులు నివసిస్తాయి.+ 14  ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇకమీదట నీళ్ల దగ్గరున్న ఏ చెట్టూ అంత ఎత్తు ఎదగకూడదు, దాని కొనను మేఘాల్లోకి హెచ్చించకూడదు, పుష్కలంగా నీళ్లు అందే ఏ చెట్టూ మేఘాల్ని తాకేంత ఎత్తు ఎదగకూడదు. అవన్నీ గోతిలోకి* దిగిపోతున్న మనుషులతో పాటు మరణానికి, కింద ఉన్న దేశానికి అప్పగించబడతాయి.’ 15  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అది సమాధిలోకి* దిగిపోయే రోజున, నేను ప్రజలు దుఃఖించేలా చేస్తాను. నేను లోతైన జలాల్ని ఆపి, వాగులకు అడ్డుకట్ట వేసి, విస్తార జలాల్ని అడ్డుకుంటాను. నేను ఆ చెట్టు కారణంగా లెబానోనును చీకటిమయం చేస్తాను, దాంతో మైదానంలోని చెట్లన్నీ వాడిపోతాయి. 16  గోతిలోకి* దిగిపోయే వాళ్లందరితో పాటు నేను దాన్ని సమాధిలోకి* పంపేటప్పుడు, అది పతనమైన శబ్దానికి జనాలు వణికిపోయేలా చేస్తాను; ఏదెనులోని చెట్లన్నీ,+ లెబానోనులోని శ్రేష్ఠమైన మంచిమంచి చెట్లన్నీ, నీళ్లు పుష్కలంగా అందే చెట్లన్నీ, కింద ఉన్న దేశంలో ఊరట పొందుతాయి. 17  అవి అతనితో* పాటు, జనాల మధ్య అతని నీడలో నివసించిన అతని మద్దతుదారులతో* పాటు సమాధిలోకి* అంటే ఖడ్గం వల్ల చనిపోయినవాళ్ల+ దగ్గరికి  వెళ్లాయి.’+ 18  “ ‘ఘనత విషయంలో, గొప్పతనం విషయంలో ఏదెనులోని ఏ చెట్టు నీలా ఉంది?+ అయితే ఏదెనులోని చెట్లతోపాటు నువ్వు ఖచ్చితంగా కింద ఉన్న దేశానికి తీసుకురాబడతావు. నువ్వు ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు సున్నతిలేనివాళ్ల మధ్య పడుకుంటావు. ఫరోకు, అతని సైన్యాలన్నిటికీ ఇలా జరుగుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”

అధస్సూచీలు

అక్ష., “నువ్వు.”
లేదా “సమాధిలోకి.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “సమాధిలోకి.”
అంటే, లెబాలోనులోని దేవదారు చెట్టు.
అక్ష., “బాహువుతో.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.