యెహెజ్కేలు 10:1-22

  • చక్రాల మధ్య ఉన్న నిప్పును తీసుకోవడం (1-8)

  • కెరూబుల, చక్రాల వర్ణన (9-17)

  • దేవుని మహిమ ఆలయాన్ని విడిచివెళ్లడం (18-22)

10  నేను చూస్తుండగా, కెరూబుల తలల పైనున్న విశాలం మీద నీలం రాయి లాంటిది ఒకటి కనిపించింది, అది సింహాసనంలా ఉంది.+ 2  అప్పుడు ఆయన నారవస్త్రాలు ధరించిన వ్యక్తితో,+ “కెరూబుల కిందున్న తిరిగే చక్రాల+ మధ్యకు ప్రవేశించి, కెరూబుల మధ్య ఉన్న నిప్పుల్ని రెండు చేతుల నిండా తీసుకొని+ నగరం మీద చల్లు”+ అన్నాడు. కాబట్టి నేను చూస్తుండగా ఆ వ్యక్తి ప్రవేశించాడు. 3  ఆ వ్యక్తి ప్రవేశించినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడ్డారు, అప్పుడు లోపలి ప్రాంగణమంతా మేఘం కమ్ముకుంది. 4  యెహోవా మహిమ+ కెరూబుల నుండి లేచి మందిరం గడప దగ్గరికి వచ్చింది, దాంతో మెల్లమెల్లగా మందిరమంతా మేఘం కమ్ముకుంది,+ ప్రాంగణం యెహోవా మహిమ తేజస్సుతో నిండిపోయింది. 5  కెరూబుల రెక్కల చప్పుడు బయటి ప్రాంగణం వరకు వినిపించింది, ఆ శబ్దం సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడినట్టు ఉంది.+ 6  అప్పుడు ఆయన నారవస్త్రాలు ధరించిన వ్యక్తికి ఇలా ఆజ్ఞాపించాడు: “తిరిగే చక్రాల మధ్య నుండి, కెరూబుల మధ్య నుండి నిప్పు తీసుకో.” దాంతో ఆ వ్యక్తి ప్రవేశించి చక్రం పక్కన నిలబడ్డాడు. 7  అప్పుడు ఒక కెరూబు, ఆ కెరూబుల మధ్యవున్న నిప్పు వైపు చెయ్యి చాపి కొన్ని నిప్పుల్ని+ తీసుకుని నారవస్త్రాలు ధరించిన వ్యక్తి+ రెండు చేతుల్లో పెట్టాడు, ఆ వ్యక్తి వాటిని తీసుకొని బయటికి వెళ్లాడు. 8  కెరూబుల రెక్కల కింద మనిషి చేతుల లాంటివి ఉన్నాయి.+ 9  నేను చూస్తుండగా, కెరూబుల పక్కన నాలుగు చక్రాలు కనిపించాయి, ఒక్కో కెరూబు పక్కన ఒక్కో చక్రం ఉంది; ఆ చక్రాలు లేతపచ్చ రాయిలా మెరుస్తున్నట్టు కనిపించాయి.+ 10  ఆ నాలుగు చక్రాలు చూడడానికి ఒకేలా ఉన్నాయి, అవి ఒక చక్రంలో ఇంకో చక్రం ఉన్నట్టు కనిపించాయి. 11  అవి కదిలినప్పుడు పక్కకు తిరగకుండానే నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్లగలవు. ఎందుకంటే అవి పక్కకు తిరగకుండానే, ముఖం ఏ వైపు ఉంటే ఆ వైపుకు వెళ్తాయి. 12  కెరూబుల శరీరాల నిండా, వీపుల నిండా, చేతుల నిండా, రెక్కల నిండా కళ్లు ఉన్నాయి, అలాగే ఆ నాలుగు కెరూబుల పక్కన ఉన్న చక్రాలు కూడా చుట్టూ కళ్లతో నిండివున్నాయి.+ 13  చక్రాల విషయానికొస్తే, ఒక స్వరం వాటిని, “తిరిగే చక్రాలు!” అని పిలవడం నేను విన్నాను. 14  ప్రతీ కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం, రెండో ముఖం మనిషి ముఖం, మూడో ముఖం సింహం ముఖం, నాలుగో ముఖం గద్ద ముఖం.+ 15  అప్పుడు కెరూబులు లేచారు, కెబారు నది+ దగ్గర నేను చూసింది ఆ జీవుల్నే.* 16  కెరూబులు కదిలినప్పుడు వాళ్ల పక్కన చక్రాలు కూడా కదిలేవి; కెరూబులు భూమ్మీద నుండి పైకి లేవడానికి తమ రెక్కల్ని ఎత్తినప్పుడు, చక్రాలు పక్కకు తిరిగేవి కావు, వాళ్ల నుండి దూరంగా వెళ్లేవి కావు.+ 17  వాళ్లు కదలకుండా ఉన్నప్పుడు చక్రాలు కూడా కదలకుండా ఉండేవి; వాళ్లు లేచినప్పుడు వాళ్లతోపాటు చక్రాలు కూడా లేచేవి; ఎందుకంటే ఆ జీవుల* మీద పనిచేస్తున్న పవిత్రశక్తే* ఆ చక్రాల్లో కూడా ఉంది. 18  అప్పుడు యెహోవా మహిమ+ మందిరం గడప దగ్గర నుండి బయల్దేరి కెరూబుల మీద నిలిచింది.+ 19  నేను చూస్తుండగా ఆ కెరూబులు తమ రెక్కలు పైకెత్తి భూమ్మీద నుండి పైకి లేచారు. వాళ్లు బయల్దేరినప్పుడు వాళ్ల పక్కన చక్రాలు కూడా పైకి లేచాయి. వాళ్లు యెహోవా మందిర తూర్పు ద్వార ప్రవేశం దగ్గర ఆగారు, ఇశ్రాయేలు దేవుని మహిమ వాళ్ల పైన ఉంది.+ 20  కెబారు నది పక్కన, ఇశ్రాయేలు దేవుని కింద ఉన్నట్టు నేను చూసింది ఈ జీవుల్నే,*+ కాబట్టి వాళ్లు కెరూబులు అని నాకు అర్థమైంది. 21  ఆ నాలుగు కెరూబుల్లో ప్రతీ కెరూబుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు, అలాగే ఆ రెక్కల కింద మనిషి చేతుల లాంటివి ఉన్నాయి.+ 22  వాళ్ల ముఖాలు నేను కెబారు నది పక్కన చూసిన ముఖాల్లా కనిపించాయి.+ ప్రతీ కెరూబు తిన్నగా ముందుకు వెళ్తున్నాడు.+

అధస్సూచీలు

అక్ష., “ఆ జీవినే.”
అక్ష., “ఆ జీవి.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “ఈ జీవినే.”