యిర్మీయా 41:1-18

  • ఇష్మాయేలు గెదల్యాను చంపడం (1-10)

  • యోహానాను వల్ల ఇష్మాయేలు పారిపోవడం (11-18)

41  ఏడో నెలలో, ఎలీషామా మనవడూ నెతన్యా కుమారుడూ అయిన ఇష్మాయేలు+ పదిమందిని తీసుకుని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వచ్చాడు. ఈ ఇష్మాయేలు రాజవంశానికి* చెందినవాడు, రాజు ఆస్థానంలో ఉన్నతాధికారి. వాళ్లంతా కలిసి మిస్పాలో+ భోంచేస్తున్నప్పుడు 2  నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న పదిమంది లేచి షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యాను కత్తితో చంపారు. అలా అతను, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన వ్యక్తిని చంపేశాడు. 3  ఇష్మాయేలు గెదల్యాతో పాటు మిస్పాలో ఉన్న యూదులందర్నీ, అక్కడున్న కల్దీయ సైనికుల్ని కూడా చంపేశాడు. 4  గెదల్యా చంపబడిన తర్వాతి రోజు, ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియకముందు 5  గడ్డం గొరిగించుకొని, బట్టలు చింపుకొని, శరీరాన్ని కోసుకున్న+ 80 మంది షెకెము+ నుండి, షిలోహు+ నుండి, సమరయ+ నుండి వచ్చారు. యెహోవా మందిరంలోకి తీసుకురావడానికి వాళ్ల చేతుల్లో ధాన్యార్పణలు, సాంబ్రాణి+ ఉన్నాయి. 6  అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వాళ్లను కలుసుకోవడానికి ఏడుస్తూ, నడుచుకుంటూ మిస్పా నుండి బయల్దేరాడు. అతను వాళ్లను కలుసుకున్నప్పుడు, “అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి రండి” అన్నాడు. 7  అయితే వాళ్లు నగరంలోకి వచ్చినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని మనుషులు వాళ్లను చంపి గోతిలో పడేశారు. 8  అయితే వాళ్లలో పదిమంది ఇష్మాయేలుతో ఇలా అన్నారు: “మమ్మల్ని చంపొద్దు, ఎందుకంటే మా దగ్గర గోధుమలు, బార్లీ, నూనె, తేనె ఉన్నాయి, మేము వాటిని పొలంలో దాచిపెట్టాం.” కాబట్టి అతను వాళ్ల సహోదరులతో పాటు వాళ్లను చంపలేదు. 9  ఇష్మాయేలు తాను చంపినవాళ్ల శవాలన్నిటినీ పెద్ద గోతిలో పడేశాడు. అది ఇశ్రాయేలు రాజైన బయెషా+ కారణంగా ఆసా రాజు తవ్వించిన గోతి. ఆ గోతినే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు శవాలతో నింపేశాడు. 10  ఇష్మాయేలు మిస్పాలో+ మిగిలిన ప్రజలందర్నీ, అంటే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యా కింద ఉంచిన మిస్పాలోని మిగతా ప్రజలందర్నీ,+ అలాగే రాజు కూతుళ్లను బందీలుగా తీసుకెళ్లాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వాళ్లను బందీలుగా తీసుకొని అమ్మోనీయుల దగ్గరికి బయల్దేరాడు.+ 11  నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన చెడు అంతటి గురించి కారేహ కుమారుడైన యోహానాను,+ అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందరూ విన్నప్పుడు 12  వాళ్లు తమ మనుషులందర్నీ తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో పోరాడడానికి బయల్దేరారు; అతను గిబియోనులో ఉన్న మహా జలాల* దగ్గర వాళ్లకు కనిపించాడు. 13  ఇష్మాయేలుతో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును, అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందర్నీ చూసినప్పుడు చాలా సంతోషించారు. 14  ఇష్మాయేలు మిస్పా నుండి బందీలుగా తీసుకొచ్చిన ప్రజలందరూ+ తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లిపోయారు. 15  అయితే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని మనుషుల్లో ఎనిమిదిమంది యోహానాను నుండి తప్పించుకుని అమ్మోనీయుల దగ్గరికి వెళ్లిపోయారు. 16  కారేహ కుమారుడైన యోహానాను, అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందరూ మిస్పాకు చెందిన మిగతా ప్రజలందర్నీ, అంటే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత,+ తాము అతని దగ్గర నుండి రక్షించిన వాళ్లందర్నీ తమతోపాటు తీసుకెళ్లారు. వాళ్లు పురుషుల్ని, సైనికుల్ని, స్త్రీలను, పిల్లల్ని, ఆస్థాన అధికారుల్ని గిబియోను నుండి వెనక్కి తీసుకొచ్చారు. 17  వాళ్లు బయల్దేరి ఐగుప్తుకు వెళ్లాలనే ఉద్దేశంతో+ బేత్లెహేము+ పక్కనున్న కింహాము విడిది స్థలంలో ఆగారు. 18  బబులోను రాజు యూదా దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపేశాడు+ కాబట్టి కల్దీయులకు భయపడి వాళ్లు అలా వెళ్లాలనుకున్నారు.

అధస్సూచీలు

అక్ష., “రాజ్య విత్తనానికి.”
లేదా “పెద్ద చెరువు” అయ్యుంటుంది.