మార్కు సువార్త 10:1-52

  • పెళ్లి, విడాకులు (1-12)

  • పిల్లల్ని యేసు దీవించడం (13-16)

  • ఒక ధనవంతుడు అడిగిన ప్రశ్న (17-25)

  • రాజ్యం కోసం త్యాగాలు (26-31)

  • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (32-34)

  • యాకోబు, యోహానుల మనవి (35-45)

    • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (45)

  • కళ్లులేని బర్తిమయి బాగవ్వడం (46-52)

10  యేసు అక్కడి నుండి బయల్దేరి యొర్దాను నది దాటి యూదయ సరిహద్దులకు* వచ్చాడు. ప్రజలు మళ్లీ గుంపులుగుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన అలవాటు ప్రకారం మళ్లీ వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు.  అప్పుడు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని ఆయన దగ్గరికి వచ్చి, “ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడం సరైనదేనా?” అని అడిగారు.+  అప్పుడు ఆయన, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని వాళ్లను అడిగాడు.  అందుకు వాళ్లు, “విడాకుల పత్రం రాయించి ఆమెను వదిలేయడాన్ని మోషే అనుమతించాడు” అన్నారు.+  కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీ హృదయాలు మొద్దుబారిపోవడం* వల్లే,+ అతను మీ కోసం ఆ ఆజ్ఞ రాశాడు.+  అయితే, సృష్టి ఆరంభం నుండి ‘దేవుడు వాళ్లను పురుషునిగా, స్త్రీగా సృష్టించాడు.+  అందుకే పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెడతాడు,+  వాళ్లిద్దరు* ఒక్క శరీరంగా ఉంటారు.’+ కాబట్టి వాళ్లు ఇక ఇద్దరు కాదుగానీ ఒకే శరీరం.  అందుకే, దేవుడు ఒకటి చేసినవాళ్లను* ఏ మనిషీ విడదీయకూడదు.”+ 10  వాళ్లు ఇంటికి తిరిగొచ్చినప్పుడు, శిష్యులు దాని గురించి ఆయన్ని అడిగారు. 11  ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు,+ తన భార్య విషయంలో పాపం చేస్తున్నాడు. 12  అలాగే తన భర్తకు విడాకులు ఇచ్చి ఇంకొకతన్ని పెళ్లి చేసుకునే భార్య వ్యభిచారం చేస్తోంది.”+ 13  యేసు చిన్నపిల్లల్ని ముట్టుకోవాలని ప్రజలు వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు, కానీ శిష్యులు వాళ్లను కోప్పడ్డారు.+ 14  అది చూసి యేసుకు చాలా కోపం వచ్చింది, ఆయన శిష్యులతో ఇలా అన్నాడు: “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటివాళ్లదే.+ 15  నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.”+ 16  ఆయన ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ల మీద చేతులుంచి, వాళ్లను దీవించాడు.+ 17  ఆయన వెళ్తుండగా, దారిలో ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరించి, “మంచి బోధకుడా, శాశ్వత జీవితం పొందాలంటే* నేను ఏంచేయాలి?” అని అడిగాడు.+ 18  యేసు అతనితో ఇలా అన్నాడు: “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవ్వరూ లేరు.+ 19  ‘హత్య చేయకూడదు,+ వ్యభిచారం చేయకూడదు,+ దొంగతనం చేయకూడదు,+ తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు,+ మోసం చేయకూడదు,+ మీ అమ్మానాన్నల్ని గౌరవించు’+ అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా?” 20  అప్పుడు అతను, “బోధకుడా, చిన్నప్పటి నుండి నేను ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 21  యేసు అతన్ని ప్రేమగా చూసి, “నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది.* వెళ్లి, నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, ఆ డబ్బును పేదవాళ్లకు ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది; నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.+ 22  కానీ యేసు చెప్పిన మాటలకు అతను బాధపడి, దుఃఖిస్తూ వెళ్లిపోయాడు. ఎందుకంటే అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి.+ 23  యేసు చుట్టూ చూసి తన శిష్యులతో ఇలా అన్నాడు: “డబ్బున్న వాళ్లు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం!”+ 24  కానీ శిష్యులు యేసు మాటలకు ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పిల్లలారా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం! 25  ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.”+ 26  వాళ్లు ఇంకా ఆశ్చర్యపోయి, “అసలు రక్షణ పొందడం ఎవరికైనా సాధ్యమేనా?” అని అడిగారు.*+ 27  యేసు వాళ్లను సూటిగా చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యమే”+ అన్నాడు. 28  అప్పుడు పేతురు ఆయనతో, “ఇదిగో! మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం” అన్నాడు.+ 29  అందుకు యేసు ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు+ 30  ఇప్పుడు* 100 రెట్లు ఎక్కువగా ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, వాటితోపాటు హింసల్ని+ పొందుతారు; అలాగే రానున్న వ్యవస్థలో* శాశ్వత జీవితాన్ని పొందుతారు. 31  అయితే ముందున్న చాలామంది వెనక్కి వెళ్తారు, వెనక ఉన్న చాలామంది ముందుకు వస్తారు.”+ 32  ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు వెళ్లే దారిలో నడుస్తున్నారు. యేసు శిష్యులకు ముందు నడుస్తున్నాడు, శిష్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు, వాళ్ల వెనక వస్తున్నవాళ్లు భయపడుతున్నారు. అప్పుడు యేసు మళ్లీ పన్నెండుమంది శిష్యుల్ని పక్కకు తీసుకెళ్లి, తనకు జరగబోయేవాటి గురించి ఇలా చెప్పాడు:+ 33  “ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధించి అన్యజనులకు అప్పగిస్తారు. 34  వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు, ఆయన్ని కొరడాలతో కొడతారు, చంపేస్తారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన మళ్లీ బ్రతుకుతాడు.”+ 35  జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను+ ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, మేము ఏది అడిగినా నువ్వు కాదనకూడదు”+ అని అన్నారు. 36  అందుకు యేసు, “చెప్పండి, నేను మీ కోసం ఏం చేయాలి?” అన్నాడు. 37  దానికి వాళ్లు, “నీ రాజ్యంలో* మా ఇద్దరిలో ఒకరు నీ కుడివైపు, ఒకరు నీ ఎడమవైపు కూర్చునే అవకాశం ఇవ్వు”+ అన్నారు. 38  అప్పుడు యేసు, “మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగుతున్న గిన్నెలోది తాగడం, నేను తీసుకుంటున్న బాప్తిస్మం తీసుకోవడం మీవల్ల అవుతుందా?”+ అని అడిగాడు. 39  అందుకు వాళ్లు, “మావల్ల అవుతుంది” అన్నారు. అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారు, నేను తీసుకుంటున్న బాప్తిస్మం మీరు తీసుకుంటారు.+ 40  కానీ నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, అవి ఎవరి కోసం సిద్ధం చేయబడ్డాయో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు.” 41  మిగతా పదిమంది ఆ విషయం గురించి విన్నప్పుడు, యాకోబు యోహానుల మీద మండిపడ్డారు.+ 42  కానీ యేసు వాళ్లను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “దేశాల పరిపాలకులు* ప్రజల మీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా?+ 43  కానీ మీలో అలా ఉండకూడదు; మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి,+ 44  మీలో అందరికన్నా ముఖ్యమైన స్థానంలో ఉండాలనుకునేవాడు అందరికీ దాసుడిగా ఉండాలి. 45  మానవ కుమారుడు కూడా ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి,+ ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా* తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.”+ 46  ఆ తర్వాత వాళ్లు యెరికోకు వచ్చారు. యేసు, ఆయన శిష్యులు, కొంతమంది ప్రజలు యెరికో నుండి వెళ్తున్నప్పుడు బర్తిమయి (తీమయి కుమారుడు) అనే కళ్లులేని బిచ్చగాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు.+ 47  అటుగా వెళ్తున్నది నజరేయుడైన యేసు అని అతను విన్నప్పుడు, “దావీదు కుమారుడా,+ యేసూ, నన్ను కరుణించు!”+ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. 48  అది చూసి చాలామంది నిశ్శబ్దంగా ఉండమని అతన్ని గద్దించడం మొదలుపెట్టారు, కానీ అతను ఇంకా ఎక్కువగా, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని అరుస్తూ ఉన్నాడు. 49  అప్పుడు యేసు ఆగి, “అతన్ని పిలవండి” అన్నాడు. వాళ్లు ఆ గుడ్డివాడితో, “ధైర్యం తెచ్చుకో! లే; ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. 50  అప్పుడు ఆ గుడ్డివాడు తన పైవస్త్రాన్ని తీసిపారేసి, టక్కున లేచి యేసు దగ్గరికి వచ్చాడు. 51  తర్వాత యేసు, “నీ కోసం నన్ను ఏం చేయమంటావు?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు యేసుతో, “రబ్బోనీ,* నాకు చూపు తెప్పించు” అన్నాడు. 52  అప్పుడు యేసు అతనితో, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది”+ అన్నాడు. వెంటనే అతనికి చూపు తిరిగొచ్చింది,+ అతను ప్రజలతోపాటు యేసును అనుసరించాడు.

అధస్సూచీలు

లేదా “పొలిమేర్లకు.”
లేదా “కఠినంగా ఉండడం.”
లేదా “అతను, అతని భార్య.”
అక్ష., “దేవుడు ఒక కాడి కిందికి తెచ్చినవాళ్లను.”
అక్ష., “స్వాస్థ్యంగా పొందాలంటే.”
అక్ష., “నీలో ఒకటి తక్కువగా ఉంది.”
లేదా “అని ఒకరితో ఒకరు అనుకున్నారు” అయ్యుంటుంది.
లేదా “ఇప్పటి కాలంలో.”
లేదా “యుగంలో.” పదకోశం చూడండి.
అక్ష., “మహిమలో.”
లేదా “పరిపాలకులుగా ఎంచబడేవాళ్లు.”
పదకోశం చూడండి.
“బోధకుడా” అని అర్థం.