మత్తయి సువార్త 7:1-29

  • కొండమీది ప్రసంగం (1-27)

    • తీర్పు తీర్చడం ఆపేయండి (1-6)

    • అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉండండి (7-11)

    • బంగారు సూత్రం (12)

    • ఇరుకు ద్వారం (13, 14)

    • ఫలాల్ని బట్టి గుర్తుపట్టవచ్చు (15-23)

    • బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు (24-27)

  • ప్రజలు యేసు బోధకు చాలా ఆశ్చర్యపోవడం (28, 29)

7  “తీర్పు తీర్చడం ఆపేయండి,+ అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు; 2  మీరు ఎలా తీర్పు తీరుస్తారో, మీకూ అలాగే తీర్పు తీర్చబడుతుంది;+ మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకూ అదే కొలతతో కొలవబడుతుంది.+ 3  అలాంటిది, నీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించుకోకుండా నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు? 4  నీ కంట్లోనే దూలాన్ని పెట్టుకుని, నీ సహోదరునితో, ‘నన్ను నీ కంట్లో ఉన్న నలుసును తీసేయనివ్వు’ అని ఎలా అంటావు? 5  వేషధారీ! ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది. 6  “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి, మీ ముత్యాలు పందుల ముందు వేయకండి;+ అలాచేస్తే అవి వాటిని కాళ్లతో తొక్కేసి, మీ వైపుకు తిరిగి మిమ్మల్ని చీల్చేస్తాయి. 7  “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది;+ వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది; 8  అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు,+ వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది. 9  మీలో ఎవరైనా, మీ కుమారుడు రొట్టెను అడిగితే రాయిని ఇస్తారా? 10  చేపను అడిగితే పామును ఇస్తారా? 11  మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా మంచి బహుమతులు ఇస్తాడో కదా!+ 12  “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.+ నిజానికి ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలు బోధించేది అదే.+ 13  “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి;+ ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు. 14  అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.+ 15  “గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి,+ లోలోపల వాళ్లు క్రూరమైన* తోడేళ్లు.+ 16  వాళ్ల పనుల్ని* బట్టి మీరు వాళ్లను గుర్తుపడతారు. ప్రజలు ముళ్లపొదల నుండి ద్రాక్షపండ్లు గానీ అంజూర పండ్లు గానీ ఏరుకుంటారా?+ 17  ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, ప్రతీ చెడ్డ చెట్టు పనికిరాని ఫలాలు ఇస్తుంది.+ 18  మంచి చెట్టు పనికిరాని ఫలాలు ఇవ్వలేదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వలేదు.+ 19  మంచి ఫలాలు ఇవ్వని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో పడేయబడుతుంది.+ 20  కాబట్టి, మీరు వాళ్ల పనుల్ని* బట్టి వాళ్లను గుర్తుపడతారు.+ 21  “‘ప్రభువా, ప్రభువా,’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి కోరేవాటిని* చేసేవాళ్లే ప్రవేశిస్తారు.+ 22  ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా,+ మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున చెడ్డదూతల్ని* వెళ్లగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు* చేయలేదా?’+ అని అంటారు. 23  అయితే అప్పుడు నేను వాళ్లతో, ‘అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరు ఎవరో నాకు అస్సలు తెలీదు, నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని అంటాను.+ 24  “కాబట్టి, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతీ వ్యక్తి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిగల వ్యక్తి లాంటివాడు.+ 25  పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. 26  అయితే, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించని ప్రతీ వ్యక్తి, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివితక్కువ వ్యక్తి లాంటివాడు.+ 27  పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినప్పుడు+ ఆ ఇల్లు కూలిపోయింది, పూర్తిగా ధ్వంసమైపోయింది.” 28  యేసు ఈ మాటలు చెప్పడం పూర్తయినప్పుడు, ప్రజలు ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు,+ 29  ఎందుకంటే ఆయన వాళ్ల శాస్త్రుల్లా కాకుండా అధికారంగల వ్యక్తిలా బోధించాడు.+

అధస్సూచీలు

లేదా “ఆకలిగా ఉన్న.”
అక్ష., “ఫలాల్ని.”
అక్ష., “ఫలాల్ని.”
లేదా “ఇష్టాన్ని.”
పదకోశం చూడండి.
లేదా “శక్తివంతమైన పనులు.”