మత్తయి సువార్త 14:1-36

  • బాప్తిస్మమిచ్చే యోహాను తలను నరికించడం (1-12)

  • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (13-21)

  • యేసు నీళ్లమీద నడవడం (22-33)

  • గెన్నేసరెతులో రోగుల్ని బాగుచేయడం (34-36)

14  ఆ కాలంలో గలిలయ ప్రాంత పరిపాలకుడైన* హేరోదు యేసు గురించి విని,+ 2  తన సేవకులతో ఇలా అన్నాడు: “అతను బాప్తిస్మమిచ్చే యోహానే. అతను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు, అందుకే అతను ఈ శక్తివంతమైన పనుల్ని చేయగలుగుతున్నాడు.”+ 3  హేరోదు* తన అన్న ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణంగా యోహానును బంధించి, చెరసాలలో వేయించాడు.+ 4  ఎందుకంటే యోహాను అతనితో, “నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవడం తప్పు”+ అని అంటూ ఉండేవాడు. 5  హేరోదు యోహానును చంపాలనుకున్నాడు, కానీ ప్రజలు యోహానును ప్రవక్తగా చూస్తున్నందువల్ల హేరోదు వాళ్లకు భయపడ్డాడు.+ 6  అయితే హేరోదు పుట్టినరోజు+ వేడుక జరుగుతున్న సమయంలో, హేరోదియ కూతురు నాట్యం చేసి హేరోదును చాలా సంతోషపెట్టింది.+ 7  కాబట్టి ఆమె ఏది అడిగినా ఇస్తానని అతను ప్రమాణం చేశాడు. 8  అప్పుడు ఆమె వాళ్లమ్మ చెప్పినట్టు, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇవ్వు” అని అడిగింది. 9  ఆ మాట విన్నప్పుడు హేరోదు రాజుకు దుఃఖం వచ్చింది, అయినా అతిథుల ముందు తాను చేసిన ప్రమాణాల్ని బట్టి యోహాను తలను ఆమెకు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. 10  ఒక భటుణ్ణి పంపించి, చెరసాలలో యోహాను తలను నరికించాడు. 11  వాళ్లు అతని తలను పళ్లెంలో పెట్టి, ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె దాన్ని వాళ్లమ్మ దగ్గరికి తీసుకొచ్చింది. 12  తర్వాత యోహాను శిష్యులు వచ్చి, అతని శరీరాన్ని తీసుకెళ్లి పాతిపెట్టారు; వాళ్లు యేసు దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పారు. 13  యేసు ఆ మాట విన్నప్పుడు, ఒంటరిగా ఉండడానికి అక్కడి నుండి పడవలో ఏకాంత ప్రదేశానికి బయల్దేరాడు. అయితే ప్రజలకు ఆ విషయం తెలిసినప్పుడు, వేర్వేరు నగరాల నుండి కాలినడకన ఆయన్ని అనుసరించారు.+ 14  ఆయన ఒడ్డుకు చేరుకున్నప్పుడు, అక్కడ చాలామంది ప్రజలు ఉండడం చూసి, వాళ్లమీద జాలిపడి,+ వాళ్లలో రోగుల్ని బాగుచేశాడు.+ 15  అయితే సాయంత్రం కావస్తుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తోంది; ఈ ప్రజల్ని పంపించేస్తే, చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి ఆహారం కొనుక్కుంటారు” అన్నారు.+ 16  కానీ యేసు, “వాళ్లు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అని శిష్యులతో అన్నాడు. 17  అందుకు వాళ్లు, “ఇక్కడ మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు” అని అన్నారు. 18  ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 19  తర్వాత ఆయన ప్రజల్ని గడ్డిమీద కూర్చోమని చెప్పాడు. ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకుని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి,*+ ఆ రొట్టెల్ని విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు; శిష్యులు వాటిని ప్రజలకు అందించారు. 20  దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేసినప్పుడు 12 గంపలు నిండాయి.+ 21  స్త్రీలు, చిన్నపిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఆ ఆహారాన్ని తిన్నారు.+ 22  తర్వాత యేసు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన శిష్యుల్ని పడవ ఎక్కించి తనకన్నా ముందుగా అవతలి ఒడ్డుకు వెళ్లమని చెప్పాడు. వాళ్లు వెళ్తుండగా ఆయన ప్రజల్ని పంపించేశాడు.+ 23  ప్రజల్ని పంపించేశాక యేసు ప్రార్థించడానికి ఒంటరిగా కొండ మీదికి వెళ్లాడు.+ చీకటిపడే సమయానికి ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నాడు. 24  అప్పటికల్లా శిష్యులు వెళ్తున్న పడవ ఒడ్డుకు చాలా* దూరంలో ఉంది, ఎదురుగాలి వీస్తున్నందువల్ల అలలు పడవను బలంగా కొడుతున్నాయి. 25  అయితే రాత్రి నాలుగో జామున* ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ల దగ్గరికి వచ్చాడు. 26  ఆయన అలా సముద్రం మీద నడుచుకుంటూ రావడం చూసినప్పుడు శిష్యులు కంగారుపడి, “అమ్మో, అదేదో వస్తోంది!” అంటూ భయంతో కేకలు వేశారు. 27  వెంటనే యేసు, “భయపడకండి, నేనే!” అని వాళ్లతో అన్నాడు.+ 28  అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, నువ్వే అయితే, నన్ను నీళ్లమీద నడుచుకుంటూ నీ దగ్గరికి రానివ్వు” అన్నాడు. 29  ఆయన, “రా!” అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్లమీద నడుచుకుంటూ యేసు వైపుకు వెళ్లాడు. 30  కానీ తుఫానును చూసినప్పుడు అతను భయపడిపోయాడు. అతను నీళ్లలో మునిగిపోతున్నప్పుడు, “ప్రభువా, రక్షించు!” అని కేకలు వేశాడు. 31  యేసు వెంటనే చెయ్యి చాపి పేతురును పట్టుకొని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.+ 32  వాళ్లిద్దరు పడవ ఎక్కాక, తుఫాను ఆగిపోయింది. 33  అప్పుడు పడవలో ఉన్నవాళ్లు, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అంటూ ఆయనకు వంగి నమస్కారం చేశారు. 34  వాళ్లు సముద్రం దాటి గెన్నేసరెతుకు వచ్చారు.+ 35  ఆ ప్రాంతంలోని వాళ్లు ఆయన్ని గుర్తుపట్టి, ఆ విషయం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేశారు. అప్పుడు ప్రజలు అనారోగ్యంగా ఉన్న వాళ్లందర్నీ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. 36  వాళ్లు యేసును, తన పైవస్త్రం అంచును మాత్రం ముట్టుకోనివ్వమని బ్రతిమాలారు.+ అలా ముట్టుకున్న వాళ్లంతా పూర్తిగా బాగయ్యారు.

అధస్సూచీలు

అక్ష., “చతుర్థాధిపతైన.”
అంటే, హేరోదు అంతిప. పదకోశం చూడండి.
అక్ష., “దీవించి.”
లేదా “వందల మీటర్ల.” అక్ష., “ఎన్నో స్టేడియా.” అప్పట్లో ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం.
అంటే, దాదాపు రాత్రి 3 గంటల నుండి దాదాపు ఉదయం 6 గంటల వరకు.