ప్రసంగి 6:1-12

  • అనుభవించని ఆస్తి (1-6)

  • ఇప్పుడున్న దానితో సంతోషించు (7-12)

6  సూర్యుని కింద నేను విషాదకరమైన ఇంకో సంగతి చూశాను, అది మనుషుల మధ్య సాధారణంగా కనిపిస్తుంది: 2  సత్యదేవుడు ఒక మనిషికి సిరిసంపదల్ని, ఘనతను ఇస్తాడు, అతను కోరుకునేదేదీ అతనికి* తక్కువ కాదు; కానీ సత్యదేవుడు అతన్ని వాటిని అనుభవించనివ్వడు, బదులుగా పరాయి వ్యక్తి వాటిని అనుభవిస్తాడు. ఇది కూడా వ్యర్థం, తీవ్రమైన బాధ. 3  ఒక వ్యక్తికి వందమంది పిల్లలు ఉన్నా, అతను చాలా ఏళ్లు బ్రతికి ముసలివాడైనా, సమాధికి చేరేలోపు అతను తనకున్న మంచివాటిని అనుభవించకపోతే, అతని కన్నా కడుపులో చనిపోయిన బిడ్డ పరిస్థితే మేలని నాకు అనిపిస్తుంది. 4  ఎందుకంటే, ఆ బిడ్డ వ్యర్థంగా లోకంలోకి వచ్చి, చీకట్లోనే వెళ్లిపోయాడు; అతని పేరు చీకట్లో కలిసిపోతుంది. 5  అతను ఎప్పుడూ సూర్యుణ్ణి చూడలేదు, అతనికి ఏమీ తెలీదు; అయినా ఆ ముసలివాడి కన్నా అతని పరిస్థితే మేలు.+ 6  ఒక వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బ్రతికినా జీవితంలో సంతోషాన్ని అనుభవించకపోతే ఏం ప్రయోజనం? అందరూ వెళ్లేది ఒకే చోటికి కాదా?+ 7  మనిషి పడే కష్టమంతా అతని కడుపు కోసమే;+ అయినా అతని ప్రాణానికి ఎప్పుడూ తృప్తి ఉండదు. 8  మూర్ఖునితో పోలిస్తే తెలివిగలవాడికి వచ్చే ప్రయోజనం ఏంటి?+ ఎలా బ్రతకాలో* తెలుసుకోవడం వల్ల పేదవాడికి వచ్చే లాభం ఏంటి? 9  కోరికల వెంట పరుగెత్తే బదులు కళ్లముందు ఉన్నవాటిని ఆస్వాదించడం మేలు. ఇది కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడడమే. 10  ఉనికిలో ఉన్న ప్రతీదానికి ఇప్పటికే పేరు పెట్టబడింది, మనిషి అసలు స్వభావం వెల్లడైంది; మనిషి తనకన్నా బలవంతునితో వాదించలేడు.* 11  మాటలు* ఎంత ఎక్కువగా ఉంటే అంత వ్యర్థం; వాటివల్ల మనిషికి వచ్చే ప్రయోజనం ఏంటి? 12  నీడలా గడిచిపోయే తన కొన్ని రోజుల వ్యర్థ జీవితంలో+ మనిషి ఏం చేయడం శ్రేష్ఠమో ఎవరికి తెలుసు? అతను వెళ్లిపోయిన తర్వాత సూర్యుని కింద ఏం జరుగుతుందో అతనికి ఎవరు చెప్పగలరు?

అధస్సూచీలు

లేదా “అతని ప్రాణానికి ఏదీ.”
అక్ష., “సజీవుల ముందు ఎలా నడవాలో.”
లేదా “తన వ్యాజ్యం వాదించలేడు.”
లేదా “వస్తువులు” అయ్యుంటుంది.