ప్రసంగి 3:1-22

  • ప్రతీదానికి సమయం ఉంది (1-8)

  • జీవితాన్ని ఆనందించడం దేవుని బహుమతి (9-15)

    • నిరంతరం జీవించడమనే ఆలోచన మనిషి హృదయంలో ఉంది (11)

  • దేవుడు అందరికీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు (16, 17)

  • మనుషులకూ జంతువులకూ పట్టే గతి ఒక్కటే (18-22)

    • అన్నీ మట్టిలోకే తిరిగెళ్తాయి (20)

3  ప్రతీదానికి ఒక సమయం ఉంది,ఆకాశం కింద జరిగే ప్రతీ పనికి ఒక సమయం ఉంది:  2  పుట్టడానికి ఒక సమయం, చనిపోవడానికి ఒక సమయం;నాటడానికి ఒక సమయం, నాటింది పీకేయడానికి ఒక సమయం;  3  చంపడానికి ఒక సమయం, బాగుచేయడానికి ఒక సమయం;కూలగొట్టడానికి ఒక సమయం, కట్టడానికి ఒక సమయం;  4  ఏడ్వడానికి ఒక సమయం, నవ్వడానికి ఒక సమయం;రోదించడానికి ఒక సమయం, నాట్యం చేయడానికి* ఒక సమయం;  5  రాళ్లను పారేయడానికి ఒక సమయం, రాళ్లను సమకూర్చడానికి ఒక సమయం;కౌగిలించుకోవడానికి ఒక సమయం, కౌగిలించుకోకుండా ఉండడానికి ఒక సమయం;  6  వెదకడానికి ఒక సమయం, పోయిందని వదిలేసుకోవడానికి ఒక సమయం;దాచిపెట్టుకోవడానికి ఒక సమయం, పారేయడానికి ఒక సమయం;  7  చింపడానికి ఒక సమయం,+ కలిపి కుట్టడానికి ఒక సమయం;మౌనంగా ఉండడానికి ఒక సమయం,+ మాట్లాడడానికి ఒక సమయం;+  8  ప్రేమించడానికి ఒక సమయం, ద్వేషించడానికి ఒక సమయం;+యుద్ధం కోసం ఒక సమయం, శాంతి కోసం ఒక సమయం ఉంది. 9  పనిచేసే వ్యక్తికి అతని కష్టమంతటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?+ 10  మనుషులు కష్టపడి చేసేలా దేవుడు వాళ్లకు ఇచ్చిన పనిని నేను చూశాను. 11  ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా* చేశాడు;+ నిరంతరం జీవించడమనే ఆలోచనను కూడా వాళ్ల హృదయంలో పెట్టాడు; అయినా సత్యదేవుడు చేసిన పనిని మనుషులు ఎప్పటికీ పూర్తిగా* అర్థం చేసుకోలేరు. 12  చివరికి నేను ఇది గ్రహించాను: సంతోషంగా ఉండడం, తమ జీవితకాలంలో మంచి చేయడం కన్నా మనుషులకు మేలైనది ఏదీ లేదు,+ 13  అంతేకాదు, ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.+ 14  సత్యదేవుడు చేసే ప్రతీది ఎప్పటికీ నిలిచివుంటుందని నేను తెలుసుకున్నాను. దానికి ఏదీ కలపలేం, దాని నుండి ఏదీ తీసేయలేం. ప్రజలు తనపట్ల భయభక్తులు చూపించాలని సత్యదేవుడే దాన్ని అలా చేశాడు.+ 15  జరిగే ప్రతీది ఇంతకుముందు జరిగిందే, రాబోయేది గతంలో ఉన్నదే;+ అయితే తరమబడినదాన్ని* సత్యదేవుడు వెదుకుతాడు. 16  సూర్యుని కింద నేను ఈ విషయం కూడా గమనించాను: న్యాయం స్థానంలో దుష్టత్వం, నీతి స్థానంలో చెడు ఉన్నాయి.+ 17  కాబట్టి నేను నా మనసులో ఇలా అనుకున్నాను: “సత్యదేవుడు నీతిమంతులకు, దుష్టులకు ఇద్దరికీ తీర్పు తీరుస్తాడు;+ ఎందుకంటే ప్రతీ పనికి, ప్రతీ చర్యకు ఒక సమయం ఉంది.” 18  నేను మనుషుల గురించి నా మనసులో ఇంకా ఇలా అనుకున్నాను: సత్యదేవుడు మనుషుల్ని పరీక్షించి, వాళ్లు కూడా జంతువుల లాంటివాళ్లే అని వాళ్లకు చూపిస్తాడు; 19  మనుషులకూ జంతువులకూ పట్టే గతి ఒక్కటే.+ జంతువులు చనిపోయినట్టే మనుషులు చనిపోతారు; వాటన్నిట్లో ఉన్న జీవశక్తి*+ ఒక్కటే. జంతువులకన్నా మనుషుల గొప్పేమీ లేదు, అంతా వ్యర్థం. 20  అన్నీ ఒకే చోటికి వెళ్తున్నాయి. అన్నీ మట్టిలో నుండే వచ్చాయి, అన్నీ మట్టిలోకే తిరిగెళ్తున్నాయి.+ 21  మనుషుల జీవశక్తి* పైకి ఎక్కిపోతుందో లేదో, జంతువుల జీవశక్తి* భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?+ 22  మనిషి తన పనిని బట్టి సుఖపడడం కన్నా మేలైనదేదీ లేదని నేను గమనించాను,+ అదే అతని బహుమతి;* అతను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూసేలా ఎవరు అతన్ని వెనక్కి తీసుకురాగలరు?+

అధస్సూచీలు

అక్ష., “ఎగరడానికి; గంతులు వేయడానికి.”
లేదా “పద్ధతిగా; సరిగ్గా; తగినట్టుగా.”
అక్ష., “మొదటినుండి చివరివరకు.”
లేదా “గతించిపోయిన దాన్ని” అయ్యుంటుంది.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “భాగం.”