యోహానుకు ఇచ్చిన ప్రకటన 18:1-24

  • “మహాబబులోను” కూలిపోవడం (1-8)

    • ‘నా ప్రజలారా, అక్కడి నుండి బయటికి రండి’ (4)

  • బబులోను కూలిపోయిందని దుఃఖించడం (9-19)

  • బబులోను కూలిపోయిందని పరలోకంలో గొప్ప సంతోషం (20)

  • బబులోను ఒక రాయిలా సముద్రంలోకి పడవేయబడుతుంది (21-24)

18  ఆ తర్వాత ఇంకో దేవదూత గొప్ప అధికారంతో పరలోకం నుండి దిగిరావడం నేను చూశాను. అతని మహిమ వల్ల భూమి ప్రకాశించింది. 2  అతను గట్టి స్వరంతో అరుస్తూ ఇలా అన్నాడు: “ఆమె కూలిపోయింది! మహాబబులోను కూలిపోయింది.+ చెడ్డదూతలకు,* అపవిత్రమైన-అసహ్యమైన ప్రతీ పక్షికి ఆమె నివాస స్థలంగా మారింది! విషపూరితమైన గాలితో* నిండిన స్థలంగా మారింది!+ 3  ఎందుకంటే, లైంగిక పాపం* చేయాలనే కోరిక* అనే తన మద్యాన్ని ఆమె అన్నిదేశాలతో తాగించింది.+ భూమ్మీది రాజులు ఆమెతో లైంగిక పాపం చేశారు.+ భూమ్మీది వర్తకులు* ఆమె సుఖభోగాల వల్ల ధనవంతులయ్యారు.” 4  అప్పుడు పరలోకం నుండి ఇంకొక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగస్థులు అవ్వకూడదని, ఆమె తెగుళ్లలో పాలుపంచుకోకూడదని అనుకుంటే అక్కడి* నుండి బయటికి రండి.+ 5  ఎందుకంటే, ఆమె పాపాలు ఆకాశాన్నంటాయి.+ ఆమె చేసిన అన్యాయాల్ని* దేవుడు గుర్తుచేసుకున్నాడు.+ 6  ఆమె ఇతరులకు చేసిందే ఆమెకూ చేయండి,+ రెండింతలు చేయండి;+ ఆమె కలిపిన గిన్నెలో+ ఆమెకు రెండు రెట్లు కలపండి.+ 7  ఆమె తనను తాను ఎంతగానో మహిమపర్చుకుంది, ఎన్నో సుఖభోగాలు అనుభవించింది. కాబట్టి ఆమె అంతగా బాధను, దుఃఖాన్ని అనుభవించాలి. ఎందుకంటే ఆమె తన హృదయంలో, ‘నేను రాణిలా కూర్చున్నాను, నేను విధవరాలిని కాను, దుఃఖపడాల్సిన పరిస్థితి నాకు ఎప్పటికీ రాదు’ అని అనుకుంటూ ఉంది.+ 8  కాబట్టి ఒక్క రోజులోనే ఆమె మీదికి తెగుళ్లు, అంటే మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమె అగ్నితో పూర్తిగా కాల్చేయబడుతుంది.+ ఎందుకంటే, ఆమెకు తీర్పు తీర్చిన యెహోవా* దేవుడు శక్తిమంతుడు.+ 9  “ఆమెతో లైంగిక పాపం* చేసి, ఆమెతోపాటు సుఖభోగాలు అనుభవించిన భూరాజులు ఆమె కాలిపోతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఏడుస్తూ, దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. 10  ఆమెలా బాధించబడతామేమో అనే భయంతో వాళ్లు దూరంగా నిలబడి, ‘అయ్యో! అయ్యో! మహానగరమా,+ బలమైన బబులోను నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చిందే!’ అని అంటారు. 11  “భూమ్మీది వర్తకులు ఆమెను చూసి ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల సరుకులన్నీ కొనేవాళ్లు ఎవ్వరూ లేరు; 12  అవేమిటంటే: బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నారవస్త్రం, ఊదారంగు వస్త్రం, పట్టు వస్త్రం, ఎర్రని వస్త్రం; సువాసనగల కలప నుండి తయారుచేసిన అన్ని వస్తువులు; దంతంతో, ఖరీదైన కలపతో, రాగితో, ఇనుముతో, చలువరాయితో చేసిన అన్నిరకాల వస్తువులు; 13  అంతేకాదు దాల్చినచెక్క, ఏలక్కాయ, ధూపద్రవ్యం, పరిమళ తైలం, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, దాసులు, ప్రజలు. 14  నువ్వు* కోరుకున్న మంచివన్నీ నీకు దూరమయ్యాయి. రుచికరమైన ఆహారపదార్థాలన్నీ, వైభవంగల వస్తువులన్నీ శాశ్వతంగా నీకు దూరమైపోయాయి. 15  “ఈ సరుకులు అమ్ముకొని, ఆమె వల్ల ధనవంతులైన వర్తకులు ఆమెలా బాధించబడతామేమో అనే భయంతో దూరంగా నిలబడి ఏడుస్తూ, దుఃఖిస్తూ 16  ఇలా అంటారు: ‘అయ్యో! అయ్యో! సన్నని నారవస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎర్రని వస్త్రం ధరించుకొని బంగారు నగలతో, అమూల్యమైన రాళ్లతో, ముత్యాలతో ఆడంబరంగా అలంకరించుకున్న మహానగరానికి+ ఇలా జరిగిందే! 17  ఆమె గొప్ప సంపదలన్నీ ఒక్క గంటలోనే నాశనమైపోయాయే!’ “ప్రతీ ఓడ అధికారి, ప్రతీ సముద్ర ప్రయాణికుడు, నావికులు, సముద్రం మీద ఆధారపడి జీవనం సంపాదించుకునే వాళ్లందరూ దూరంగా నిలబడి, 18  ఆమె కాలిపోతున్నప్పుడు వచ్చే పొగను చూసి గట్టిగా అరుస్తూ, ‘ఈ మహానగరం లాంటి నగరం ఏదైనా ఉందా?’ అన్నారు. 19  వాళ్లు తలల మీద దుమ్ము పోసుకుంటూ ఏడుస్తూ, దుఃఖిస్తూ, ‘అయ్యో! అయ్యో! మహానగరానికి ఇలా జరిగిందే! సముద్రంలో ఓడలు ఉన్న వాళ్లందరూ ఆమె సంపదల వల్ల ధనవంతులయ్యారు; అలాంటిది ఒక్క గంటలోనే ఆమె నాశనమైపోయిందే!’+ అని అరిచారు. 20  “పరలోకమా,+ పవిత్రులారా,+ అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెకు జరిగినదాన్ని బట్టి సంతోషించండి. ఎందుకంటే, ఆమె మీకు చేసినదాన్ని బట్టి దేవుడు ఆమె మీద తీర్పు ప్రకటించాడు!”+ 21  అప్పుడొక బలమైన దేవదూత, పెద్ద తిరుగలి రాయి లాంటి ఒక రాయిని ఎత్తి సముద్రంలో విసిరేస్తూ ఇలా అన్నాడు: “బబులోను మహానగరం ఇలా వేగంగా పడేయబడుతుంది, అది ఇక ఎప్పటికీ కనిపించదు.+ 22  వీణ* వాయించే గాయకుల శబ్దం, సంగీతకారుల శబ్దం, పిల్లనగ్రోవి* ఊదేవాళ్ల శబ్దం, బాకా ఊదేవాళ్ల శబ్దం ఇక మళ్లీ నీలో వినిపించదు. ఏదైనా వృత్తిపని చేసేవాళ్లెవ్వరూ ఇక ఎప్పటికీ నీలో కనిపించరు, తిరుగలి రాయి శబ్దం ఇక ఎప్పటికీ నీలో వినిపించదు. 23  దీపకాంతి ఇక ఎప్పటికీ నీలో ప్రకాశించదు; పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం మళ్లీ నీలో వినిపించదు. ఎందుకంటే నీ వర్తకులు భూమ్మీదున్న వాళ్లలో ప్రముఖులుగా ఉండేవాళ్లు, నీ మంత్రతంత్రాల+ వల్ల దేశాలన్నీ మోసపోయాయి. 24  అవును, ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం,+ భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి రక్తం ఈ నగరంలో కనిపించింది.”+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “ఊపిరితో; నిశ్వాసతో; ప్రేరేపిత సందేశంతో” అయ్యుంటుంది.
లేదా “ఉద్రేకం.”
లేదా “ప్రయాణ వర్తకులు.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అక్ష., “ఆమెలో.”
లేదా “ఆమె నేరాల్ని.”
అనుబంధం A5 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “నీ ప్రాణం.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అంటే, ఫ్లూటు.