పరమగీతం 5:1-16
5 “నా ప్రేయసీ, నా పెళ్లికూతురా,నేను నా తోటలోకి ప్రవేశించాను.+
నా బోళాన్ని, సుగంధ ద్రవ్యాన్ని+ సమకూర్చుకున్నాను.
నా తేనెపట్టును, తేనెను తిన్నాను;నా ద్రాక్షారసాన్ని, పాలను తాగాను.”+
“ప్రియ స్నేహితుల్లారా, తినండి! తాగండి!
ప్రేమానురాగాల్లో మునిగితేలండి!”+
2 “నేను నిద్రపోతున్నాను, కానీ నా హృదయం మేల్కొనే ఉంది.+
నా ప్రియుడు తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తోంది!
‘నా ప్రేయసీ, నా ప్రియురాలా,నా పావురమా, మచ్చలేనిదానా, తలుపు తీయి!
మంచు వల్ల నా తల,రాత్రి తేమ వల్ల నా జుట్టు తడిసిపోయాయి.’+
3 నేను నా పైవస్త్రం తీసేశాను.
దాన్ని మళ్లీ వేసుకోవాలా?
నా పాదాలు కడుక్కున్నాను.
వాటిని మళ్లీ మురికి చేసుకోవాలా?
4 నా ప్రియుడు తలుపు రంధ్రంలో నుండి తన చెయ్యి తీసేశాడు,నా హృదయం అతని కోసం తపించింది.
5 నా ప్రియుడి కోసం తలుపు తీద్దామని నేను లేచాను;నా చేతుల నుండి బోళం,నా వేళ్ల నుండి బోళరసం కారి తలుపు గడియల మీద పడ్డాయి.
6 నా ప్రియుడి కోసం నేను తలుపు తీశాను,కానీ అతను అక్కడ లేడు, వెళ్లిపోయాడు.
అతను వెళ్లిపోయినప్పుడు నా ప్రాణం సొమ్మసిల్లింది.*
నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.+
నేను అతన్ని పిలిచాను, కానీ అతను పలకలేదు.
7 నగరంలో గస్తీ తిరుగుతున్న కావలివాళ్లు నాకు ఎదురుపడ్డారు.
వాళ్లు నన్ను కొట్టి గాయపర్చారు.
ప్రాకారపు కావలివాళ్లు నా ముసుగును లాగేసుకున్నారు.
8 యెరూషలేము కూతుళ్లారా, మీతో ఒట్టు వేయిస్తున్నాను:
నా ప్రియుడు మీకు కనిపిస్తే,నేను విరహ వేదన పడుతున్నానని అతనితో చెప్పండి.”
9 “అత్యంత సౌందర్యవతీ!మిగతావాళ్ల కన్నా నీ ప్రియుడి గొప్పేంటి?
నువ్వు మాతో ఇలా ఒట్టు వేయించడానికిమిగతావాళ్ల కన్నా అతను ఎందులో గొప్ప?”
10 “నా ప్రియుడు అందగాడు, ఎర్రనివాడు;పదివేల మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు.
11 అతని తల బంగారం, మేలిమి బంగారం.
అతని తలవెంట్రుకలు ఊగుతున్న ఖర్జూర మట్టల్లా,*కాకి అంత నల్లగా ఉంటాయి.
12 అతని కళ్లు, నీటి ప్రవాహాల పక్కన ఉన్న పావురాల్లా,పాలలో స్నానం చేసి, పొంగిపొర్లే నీటి మడుగు* పక్కన కూర్చున్న పావురాల్లా ఉన్నాయి.
13 అతని చెంపలు సుగంధ ద్రవ్యాల పరుపులు,+సువాసన మొక్కల గుట్టలు;
అతని పెదాలు బోళరసం+ కారుతున్న లిల్లీ పూలు.
14 అతని చేతులు, లేతపచ్చ రాళ్లు పొదిగిన బంగారు కడ్డీలు.
అతని ఉదరం, నీలం రాళ్లు పొదిగిన నున్నటి దంతపు పలక.
15 అతని కాళ్లు, మేలిమి బంగారు దిమ్మల్లో నిలబెట్టిన చలువరాతి స్తంభాలు.
అతను లెబానోనులా అందంగా, దేవదారు చెట్లలా ఎత్తుగా ఉంటాడు.+
16 అతని నోరు* అతి మధురం,అతను అన్నివిధాలా కోరదగినవాడు.+
యెరూషలేము కూతుళ్లారా, అతనే నా ప్రియుడు, అతనే నా చెలికాడు.”
అధస్సూచీలు
^ లేదా “అతను మాట్లాడినప్పుడు నా ప్రాణం నన్ను విడిచి వెళ్లింది” అయ్యుంటుంది.
^ లేదా “ఖర్జూర పండ్ల గుత్తుల్లా” అయ్యుంటుంది.
^ లేదా “ఊట అంచుల” అయ్యుంటుంది.
^ అక్ష., “అంగిలి.”