ద్వితీయోపదేశకాండం 27:1-26
27 తర్వాత మోషే ఇశ్రాయేలు పెద్దలతో కలిసి ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇస్తున్న ప్రతీ ఆజ్ఞను పాటించండి.
2 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజున, పెద్దపెద్ద రాళ్లను నిలబెట్టి వాటికి సున్నం వేయండి.+
3 మీరు ఆ నది దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ వాటిమీద రాయండి. అప్పుడే మీరు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించగలుగుతారు.+
4 మీరు యొర్దాను నది దాటిన తర్వాత, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నట్టు, ఆ రాళ్లను ఏబాలు పర్వతం+ మీద నిలబెట్టి, వాటికి సున్నం వేయాలి.
5 అంతేకాదు అక్కడ మీరు మీ దేవుడైన యెహోవాకు రాళ్లతో బలిపీఠం కట్టాలి. ఆ రాళ్లమీద ఇనుప పనిముట్టు పడకూడదు.+
6 నీ దేవుడైన యెహోవా బలిపీఠాన్ని నువ్వు చెక్కబడని రాళ్లతో కట్టాలి, దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలులు అర్పించాలి.
7 నువ్వు సమాధాన బలులు+ అర్పించి వాటిని అక్కడే తినాలి,+ నీ దేవుడైన యెహోవా ముందు నువ్వు సంతోషించాలి.+
8 ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ ఆ రాళ్లమీద స్పష్టంగా రాయాలి.”+
9 తర్వాత మోషే, అలాగే లేవీయులైన యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు ప్రజలారా, నిశ్శబ్దంగా ఉండి ఈ మాటలు వినండి. ఈరోజు మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు.+
10 మీరు మీ దేవుడైన యెహోవా మాట* వినాలి, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞల్ని, ఆయన నియమాల్ని పాటించాలి.”+
11 ఆ రోజు మోషే ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు:
12 “మీరు యొర్దాను నది దాటినప్పుడు, ప్రజల్ని దీవించడానికి ఈ గోత్రాల వాళ్లు గెరిజీము పర్వతం+ మీద నిలబడతారు: షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను.
13 శాపాన్ని ప్రకటించడానికి ఈ గోత్రాల వాళ్లు ఏబాలు పర్వతం మీద నిలబడతారు:+ రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి.
14 అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా అంటారు:
15 “ ‘చెక్కిన విగ్రహాన్ని గానీ,+ పోత* విగ్రహాన్ని గానీ+ తయారుచేసి, దాన్ని దాచిపెట్టినవాడు శాపగ్రస్తుడు; అది చేతిపనులు* చేసే వ్యక్తి తన చేతులతో మలిచినది; అది యెహోవాకు అసహ్యం.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’* అనాలి.)
16 “ ‘అమ్మను గానీ, నాన్నను గానీ నీచంగా చూసేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
17 “ ‘తన పొరుగువాడి సరిహద్దు రాయిని జరిపేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
18 “ ‘గుడ్డివాణ్ణి దారితప్పేలా చేసేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
19 “ ‘పరదేశులకు గానీ, తండ్రిలేని పిల్లలకు* గానీ, విధవరాళ్లకు గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
20 “ ‘తన తండ్రి భార్యతో పడుకునేవాడు శాపగ్రస్తుడు, ఎందుకంటే అతను తన తండ్రిని అవమానపర్చాడు.’*+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
21 “ ‘ఏ జంతువుతోనైనా పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
22 “ ‘తన సహోదరితో అంటే తన తండ్రి కూతురితో గానీ, తల్లి కూతురితో గానీ పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
23 “ ‘తన అత్తతో పడుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
24 “ ‘మాటువేసి తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
25 “ ‘నిర్దోషిని చంపడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
26 “ ‘ఈ ధర్మశాస్త్రంలోని మాటల్ని పాటించనివాడు, వీటిని సమర్థించనివాడు శాపగ్రస్తుడు.’+ (అప్పుడు ప్రజలంతా ‘ఆమేన్!’ అనాలి.)
అధస్సూచీలు
^ అక్ష., “స్వరం.”
^ లేదా “అలాగే జరగాలి!”
^ లేదా “చెక్క పని, లోహం పని.”
^ లేదా “లోహపు.”
^ లేదా “అనాథలకు.”
^ లేదా “తన తండ్రి వస్త్రాన్ని తీశాడు.”