ద్వితీయోపదేశకాండం 11:1-32

  • మీరు యెహోవా గొప్పతనాన్ని చూశారు (1-7)

  • వాగ్దాన దేశం (8-12)

  • లోబడితే వచ్చే దీవెనలు (13-17)

  • దేవుని మాటల్ని హృదయాల మీద ముద్రించుకోవాలి (18-25)

  • ‘దీవెన, శాపం’ (26-32)

11  “నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి,+ ఎప్పుడూ ఆయనకు లోబడి ఉండాలి, ఆయన శాసనాల్ని, న్యాయనిర్ణయాల్ని, ఆజ్ఞల్ని పాటించాలి. 2  నేను ఈ రోజు మాట్లాడుతున్నది మీతోనే కానీ మీ దేవుడైన యెహోవా ఇచ్చిన క్రమశిక్షణను,+ ఆయన గొప్పతనాన్ని,+ బలమైన చేతిని, చాచిన బాహువును చూడని, వాటి గురించి తెలియని మీ కుమారులతో కాదు. ఈ విషయం మీకు తెలుసు. 3  ఆయన ఐగుప్తులో, అంటే ఐగుప్తు రాజైన ఫరోకు, అతని దేశమంతటికీ చేసిన సూచనల్ని, కార్యాల్ని వాళ్లు చూడలేదు; 4  అలాగే ఆయన ఐగుప్తు సైన్యాలకు, అంటే ఫరో గుర్రాలకు, యుద్ధ రథాలకు ఏమి చేశాడో వాళ్లు చూడలేదు. ఆ సైన్యాలు మిమ్మల్ని వెంటాడినప్పుడు ఎర్రసముద్రంలోని నీళ్లు వాళ్లను ముంచేశాయి, యెహోవా వాళ్లను శాశ్వతంగా* నాశనం చేశాడు.+ 5  మీరు ఇక్కడికి వచ్చేంత వరకు ఎడారిలో ఆయన మీకోసం* ఏమి చేశాడో కూడా మీ కుమారులు చూడలేదు. 6  రూబేను వంశానికి చెందిన ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములకు ఆయన ఏమి చేశాడో వాళ్లు చూడలేదు. ఇశ్రాయేలీయులందరు చూస్తుండగా భూమి నోరు తెరిచి వాళ్లిద్దర్ని, వాళ్ల ఇంటివాళ్లందర్నీ, వాళ్ల డేరాల్ని, వాళ్లను అనుసరించిన ప్రతీ వ్యక్తిని, ప్రతీ జంతువును మింగేసింది.+ 7  యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నిటినీ కళ్లారా చూసింది మీరే. 8  “నేడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ మీరు పాటించాలి. అప్పుడే మీరు బలవంతులై, ఈ నది దాటి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా అందులో అడుగుపెడతారు. 9  అంతేకాదు, మీ పూర్వీకులకు, వాళ్ల సంతానానికి* ఇస్తానని యెహోవా ప్రమాణం చేసిన+ పాలుతేనెలు ప్రవహించే దేశంలో+ మీరు చాలాకాలం జీవిస్తారు.+ 10  “మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు బయటికి వచ్చేసిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. మీరు అక్కడ ఉన్నప్పుడు విత్తనాలు విత్తి, కూరగాయల తోటకు పెట్టినట్టు మీ కాళ్లతో* నీళ్లు పెట్టేవాళ్లు. 11  కానీ మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశం కొండలు, లోయ మైదానాలు ఉన్న దేశం.+ అది ఆకాశం నుండి పడే వర్షపు నీటిని తాగుతుంది;+ 12  అది నీ దేవుడైన యెహోవా శ్రద్ధ చూపిస్తున్న దేశం. సంవత్సరం పొడవునా నీ దేవుడైన యెహోవా కళ్లు ఎప్పుడూ దాని మీద ఉంటాయి. 13  “నేడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలకు మీరు శ్రద్ధగా లోబడుతూ, మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, మీ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* ఆయన్ని సేవిస్తే,+ 14  నేను కూడా మీకు సకాలంలో వర్షాన్ని, అంటే తొలకరి వానను,* కడవరి వానను* ఇస్తాను; మీరు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను సమకూర్చుకుంటారు.+ 15  నేను మీ పశువుల కోసం పొలాల్లో పచ్చగడ్డిని కూడా మొలిపిస్తాను. అంతేకాదు మీరు తిని, తృప్తిపొందుతారు.+ 16  అయితే మీరు పక్కకుమళ్లి, వేరే దేవుళ్లను పూజించి, వాటికి మొక్కేలా మీ హృదయం ప్రలోభానికి గురికాకుండా చూసుకోండి.+ 17  లేదంటే, యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. అప్పుడు ఆయన వర్షాలు పడకుండా ఆకాశాన్ని మూసేస్తాడు,+ భూమి దాని పంటను ఇవ్వదు; యెహోవా మీకు ఇవ్వబోతున్న మంచి దేశంలో మీరు త్వరగా నాశనమైపోతారు.+ 18  “ఈ నా మాటల్ని మీరు మీ హృదయాల మీద, మీ మనసుల* మీద ముద్రించుకోవాలి; వీటిని జ్ఞాపికగా మీ చేతికి కట్టుకోవాలి; ఇవి మీ నుదుటి మీద* బాసికంలా ఉండాలి.+ 19  మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు బోధించండి.+ 20  వాటిని మీ ఇంటి గుమ్మాల మీద, మీ నగర ద్వారాల మీద రాసుకోండి. 21  అలాచేస్తే, యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో+ మీరు, మీ కుమారులు చాలాకాలం అంటే భూమికి పైన ఆకాశం ఉన్నంతకాలం జీవిస్తారు.+ 22  “మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ,+ ఆయన మార్గాలన్నిట్లో నడుస్తూ, ఆయన్ని అంటిపెట్టుకొని ఉండమని నేను ఇస్తున్న ఆజ్ఞను మీరు జాగ్రత్తగా పాటిస్తూ దాని ప్రకారం జీవిస్తే,+ 23  యెహోవా ఈ జనాలన్నిటినీ మీ ముందు నుండి వెళ్లగొడతాడు;+ మీరు మీకన్నా ఎక్కువ జనాభాగల గొప్ప జనాల్ని ఓడించి వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ 24  మీరు అడుగుపెట్టే ప్రతీచోటు మీది అవుతుంది.+ మీ సరిహద్దు ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం* వరకు ఉంటుంది.+ 25  ఎవ్వరూ మీకు ఎదురు నిలవలేరు.+ మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టే, ఆ దేశంలో మీరు అడుగుపెట్టే ప్రతీచోట ప్రజలు మిమ్మల్ని చూసి భయపడేలా, బెదిరిపోయేలా చేస్తాడు.+ 26  “ఇదిగో, నేడు నేను దీవెనను, శాపాన్ని మీ ముందు పెడుతున్నాను:+ 27  నేడు నేను మీకు ఇస్తున్న, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే దీవెన పొందుతారు;+ 28  కానీ మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, మీరు అనుసరించాలని నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న మార్గం నుండి పక్కకుమళ్లి, మీకు తెలియని దేవుళ్లను అనుసరిస్తే మీరు శపించబడతారు.+ 29  “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు గెరిజీము పర్వతం దగ్గర దీవెనను, ఏబాలు పర్వతం దగ్గర శాపాన్ని ప్రకటించాలి.*+ 30  అవి యొర్దాను అవతల పడమటి వైపున,* అంటే మోరే మహా వృక్షాల పక్కన, గిల్గాలుకు ఎదురుగా, అరాబాలో నివసిస్తున్న కనానీయుల దేశంలో ఉన్నాయి. 31  ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశంలోకి ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకొని అందులో నివసించినప్పుడు, 32  నేడు నేను మీ ముందు పెడుతున్న శాసనాలు, న్యాయనిర్ణయాలు అన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.+

అధస్సూచీలు

లేదా “నేటి వరకు.”
లేదా “మీకు.”
అక్ష., “విత్తనానికి.”
అంటే, కాళ్లతో జలచక్రాన్ని తొక్కడానికి లేదా నీటి పారుదల కోసం కాలువలు ఏర్పాటు చేయడానికి కాళ్ల బలాన్ని ఉపయోగించడం.
పదకోశం చూడండి.
తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
పదకోశంలో “ప్రాణం” చూడండి.
అక్ష., “మీ కళ్ల మధ్య.”
అంటే, మహా సముద్రం, మధ్యధరా సముద్రం.
లేదా “ఇవ్వాలి.”
లేదా “సూర్యాస్తమయం వైపున.”