తీతు 3:1-15

  • సరైన విధంగా లోబడివుండడం (1-3)

  • మంచిపనులు చేయడానికి సిద్ధంగా ఉండు (4-8)

  • మూర్ఖమైన వాదనల్ని, అబద్ధ బోధలు వ్యాప్తి చేసేవాళ్లను తిరస్కరించు (9-11)

  • సొంత విషయాలకు సంబంధించిన నిర్దేశాలు, శుభాకాంక్షలు (12-15)

3  ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడమని, విధేయులుగా ఉండమని,+ ప్రతీ మంచిపని కోసం సిద్ధంగా ఉండమని వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు.  అలాగే ఎవరి గురించీ చెడుగా మాట్లాడొద్దని, గొడవలు పెట్టుకునేవాళ్లుగా, పట్టుబట్టేవాళ్లుగా ఉండొద్దని,*+ అందరి పట్ల పూర్తి సౌమ్యతతో మెలగమని+ కూడా వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు.  ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా బుద్ధిలేనివాళ్లుగా, అవిధేయులుగా, దారితప్పినవాళ్లుగా, రకరకాల కోరికలకూ సుఖాలకూ బానిసలుగా ఉండేవాళ్లం, చెడ్డపనులు చేసేవాళ్లం, ఈర్ష్యపడే వాళ్లం, అసహ్యంగా ప్రవర్తించేవాళ్లం, ఒకరినొకరం ద్వేషించుకునేవాళ్లం.  అయితే మన రక్షకుడైన దేవుని దయ,+ మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమ వెల్లడైనప్పుడు  (మనం చేసిన ఏ నీతి పనుల వల్లో కాదుగానీ+ తన కరుణ వల్ల)+ ఆయన మనల్ని రక్షించాడు. మనం జీవం పొందేలా+ మనల్ని శుభ్రపర్చడం* ద్వారా, పవిత్రశక్తితో నూతనం చేయడం ద్వారా+ ఆయన మనల్ని రక్షించాడు.  మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద ఈ పవిత్రశక్తిని సమృద్ధిగా* కుమ్మరించాడు.+  తన అపారదయ ద్వారా మనం నీతిమంతులమని తీర్పు పొందిన తర్వాత,+ శాశ్వత జీవిత నిరీక్షణ+ ప్రకారం మనం వారసులం అవ్వాలని+ ఆయన అలా చేశాడు.  ఈ మాటలు నమ్మదగినవి. నువ్వు వీటిని నొక్కిచెప్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాచేస్తే, దేవుని మీద విశ్వాసముంచిన వాళ్లు అన్ని సమయాల్లో మంచిపనుల మీదే మనసు పెట్టగలుగుతారు. ఈ మాటలు మంచివి, ఉపయోగకరమైనవి.  అయితే మూర్ఖమైన వాదనలకు, వంశావళులకు, ధర్మశాస్త్రం గురించిన గొడవలూ కొట్లాటలకు దూరంగా ఉండు. ఎందుకంటే వాటివల్ల ఏ ఉపయోగమూ ఉండదు, అవి వ్యర్థమైనవి.+ 10  అబద్ధ బోధను*+ వ్యాప్తిచేసే వ్యక్తికి ఒకట్రెండుసార్లు బుద్ధిచెప్పి,*+ అప్పటికీ వినకపోతే అతనితో సహవాసం మానేయి. 11  ఎందుకంటే, అలాంటి వ్యక్తి సత్యమార్గాన్ని వదిలేశాడని, పాపం చేస్తూ తనను తాను దోషిగా ప్రకటించుకున్నాడని నీకు తెలుసు. 12  నేను అర్తెమాను గానీ తుకికును+ గానీ నీ దగ్గరికి పంపించినప్పుడు, నికొపొలికి రావడానికి గట్టిగా ప్రయత్నించు. ఎందుకంటే నేను చలికాలం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. 13  ధర్మశాస్త్రంలో ఆరితేరిన జేనాకు, అలాగే అపొల్లోకు కావాల్సినవన్నీ శ్రద్ధగా ఏర్పాటుచేయి, వాళ్ల ప్రయాణానికి ఏమీ తక్కువ కాకుండా చూసుకో.+ 14  అయితే మనవాళ్లు కూడా, అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేయగలిగేలా మంచిపనులు చేస్తూ ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ల మంచిపనులకు లోటు లేకుండా ఉంటుంది.* 15  నాతో ఉన్నవాళ్లంతా నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మామీద ప్రేమ* ఉన్న విశ్వాసులకు నా శుభాకాంక్షలు చెప్పు. దేవుని అపారదయ మీ అందరికీ తోడుండాలి.

అధస్సూచీలు

లేదా “అర్థం చేసుకునేవాళ్లుగా ఉండమని; సహేతుకత గలవాళ్లుగా ఉండమని.”
లేదా “మనకు స్నానం చేయించడం.”
లేదా “ఉదారంగా.”
అక్ష., “తెగను.”
లేదా “హెచ్చరించి.”
అక్ష., “వాళ్లు నిష్ఫలులు కాకుండా ఉంటారు.”
లేదా “అనురాగం.”