కీర్తనలు 71:1-24

  • వృద్ధుల నమ్మకం

    • చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకోవడం (5)

    • “నా బలం క్షీణించినప్పుడు” (9)

    • ‘చిన్నప్పటి నుండి దేవుడు నాకు బోధించాడు’ (17)

71  యెహోవా, నిన్నే నేను ఆశ్రయించాను. నేను సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడూ రానివ్వకు.+  2  నీ నీతిని బట్టి నన్ను కాపాడు, నన్ను రక్షించు. చెవిపెట్టి నా మొర విను,* నన్ను కాపాడు.+  3  నేను ఎప్పుడూ ప్రవేశించేలానా కోసం రాతి కోటవి అవ్వు. నన్ను రక్షించమని ఆజ్ఞ ఇవ్వు,నువ్వే నా శైలం,* నా బలమైన దుర్గం.+  4  నా దేవా, దుష్టుడి చేతి నుండి,అన్యాయంగా అణచివేసేవాడి పట్టు నుండి నన్ను విడిపించు.+  5  సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను నీ మీదే ఆశపెట్టుకున్నాను;చిన్నప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను.*+  6  పుట్టినప్పటి నుండి నీ మీదే ఆధారపడ్డాను;నా తల్లి గర్భంలో నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు.+ ఎల్లప్పుడూ నేను నిన్ను స్తుతిస్తాను.  7  చాలామందికి నేనొక అద్భుతంలా కనిపిస్తున్నాను,అయితే నువ్వే నా బలమైన ఆశ్రయం.  8  నా నోరు నీ స్తుతితో నిండిపోయింది;+నేను రోజంతా నీ వైభవం గురించి చెప్తాను.  9  నేను ముసలివాడిని అయినప్పుడు నన్ను త్రోసివేయకు;+నా బలం క్షీణించినప్పుడు+ నన్ను వదిలేయకు. 10  నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు,నా ప్రాణం తీయాలని చూసేవాళ్లు కలిసి కుట్ర పన్నుతున్నారు,+ 11  “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అతన్ని రక్షించేవాళ్లు ఎవ్వరూ లేరు, అతన్ని వెంటాడి పట్టుకుందాం రండి” అంటున్నారు.+ 12  దేవా, నాకు దూరంగా ఉండకు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+ 13  నన్ను ఎదిరించేవాళ్లుసిగ్గుపడాలి, నాశనమవ్వాలి.+ నాకు హాని చేయాలని చూసేవాళ్లునిందల పాలవ్వాలి, అవమానానికి గురవ్వాలి.+ 14  కానీ నేనైతే నీ కోసం కనిపెట్టుకునే ఉంటాను;ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతిస్తాను. 15  నా నోరు రోజంతా నీ నీతి గురించి,నీ రక్షణ కార్యాల గురించి చెప్తుంది,+అవి నేను లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. 16  సర్వోన్నత ప్రభువైన యెహోవా,నేను వెళ్లి నీ శక్తివంతమైన పనుల గురించి చెప్తాను,నీ నీతి గురించి, కేవలం నీ నీతి గురించే నేను చెప్తాను. 17  దేవా, చిన్నప్పటి నుండి నువ్వు నాకు బోధించావు,ఇప్పటివరకు నేను నీ అద్భుతమైన పనుల గురించి చెప్తూనే ఉన్నాను.+ 18  దేవా, నేను ముసలివాడినై తల నెరసినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకు.+ నీ బలం* గురించి తర్వాతి తరానికి,నీ గొప్ప శక్తి గురించి పుట్టబోయే వాళ్లందరికీ నన్ను చెప్పనివ్వు.+ 19  దేవా, నీ నీతి ఆకాశాన్ని అంటుతుంది; నువ్వు గొప్పగొప్ప పనులు చేశావు;దేవా, నీలాంటి వాళ్లెవరు?+ 20  నువ్వు నా మీదికి ఎన్నో కష్టాలు, విపత్తులు రానిచ్చావు,+అయితే నాలో మళ్లీ నూతనోత్తేజం నింపు;భూమి లోతుల్లో* నుండి నన్ను పైకి లేపు.+ 21  నా గొప్పతనాన్ని పెంచు,నా చుట్టూ ఉండి నన్ను ఓదార్చు. 22  అప్పుడు నా దేవా, నీ నమ్మకత్వాన్ని బట్టి+తంతివాద్యంతో నేను నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పవిత్ర దేవా,వీణతో* నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.* 23  నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు* కాబట్టి+నిన్ను స్తుతిస్తూ పాటలు పాడేటప్పుడు నా పెదాలు సంతోషంతో కేకలు వేస్తాయి.+ 24  నా నాలుక రోజంతా నీ నీతి గురించి మాట్లాడుతుంది,*+ఎందుకంటే నన్ను నాశనం చేయాలని అనుకుంటున్నవాళ్లు సిగ్గుపడతారు, అవమానాలపాలు అవుతారు.+

అధస్సూచీలు

లేదా “కిందికి వంగి, విను.”
లేదా “పెద్ద రాతిబండ.”
లేదా “నువ్వే నా నమ్మకానివి.”
అక్ష., “బాహువు.”
లేదా “అగాధ జలాల్లో.”
లేదా “సంగీతం వాయిస్తాను.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “విడిపించావు.”
లేదా “ధ్యానిస్తుంది.”