కీర్తనలు 116:1-19

  • కృతజ్ఞతా పాట

    • ‘నేను యెహోవాకు ఏమి ఇవ్వను?’ (12)

    • ‘రక్షణ పాత్ర పట్టుకుంటాను’ (13)

    • “యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను” (14,18)

    • విశ్వసనీయుల మరణం అమూల్యమైనది (15)

116  నేను యెహోవాను ప్రేమిస్తున్నాను,ఎందుకంటే ఆయన* నా స్వరాన్ని, నా మొరల్ని వింటాడు.+  2  ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు,*+నేను బ్రతికినంతకాలం ఆయనకు ప్రార్థిస్తాను.  3  మరణపు తాళ్లు నన్ను చుట్టుముట్టాయి;నేను సమాధి గుప్పిట్లోకి వెళ్లిపోయాను.*+ కష్టాలూ కన్నీళ్లూ నన్ను ముంచెత్తాయి.+  4  అయితే నేను, “యెహోవా, నన్ను రక్షించు!” అంటూ యెహోవా పేరున ప్రార్థించాను.+  5  యెహోవా కనికరం* గలవాడు, నీతిమంతుడు;+మన దేవుడు కరుణ గలవాడు.+  6  అనుభవంలేని వాళ్లను యెహోవా కాపాడతాడు.+ నేను దీనస్థితికి చేరుకున్నప్పుడు ఆయన నన్ను కాపాడాడు.  7  నా ప్రాణమా,* మళ్లీ విశ్రాంతి తీసుకో,ఎందుకంటే యెహోవా నాతో దయగా వ్యవహరించాడు.  8  నువ్వు మరణం నుండి నన్ను తప్పించావు,నా కంటి నుండి కన్నీళ్లు రాకుండా, నా పాదం తడబడకుండా చేశావు.+  9  సజీవుల దేశంలో నేను యెహోవా ఎదుట నడుస్తాను. 10  నాకు విశ్వాసం ఉంది, కాబట్టే నేను మాట్లాడాను;+నేను చాలా కష్టాలుపడ్డాను. 11  నేను భయపడిపోయి, “ప్రతీ మనిషి అబద్ధాలకోరు” అన్నాను.+ 12  యెహోవా నాకు చేసిన మంచి అంతటికీనేను ఆయనకు ఏమి ఇవ్వను? 13  రక్షణ* పాత్ర పట్టుకొనియెహోవా పేరున ప్రార్థిస్తాను. 14  ఆయన ప్రజలందరి సమక్షంలోయెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను.+ 15  తన విశ్వసనీయుల మరణంయెహోవా దృష్టికి చాలా అమూల్యమైనది.*+ 16  యెహోవా, నేను నిన్ను వేడుకుంటున్నాను,ఎందుకంటే నేను నీ సేవకుణ్ణి. నేను నీ సేవకుణ్ణి, నీ దాసురాలి కుమారుణ్ణి. నా బంధకాల్లో నుండి నువ్వు నన్ను విడిపించావు.+ 17  నేను నీకు కృతజ్ఞతా బలి అర్పిస్తాను;+యెహోవా పేరున ప్రార్థిస్తాను. 18  యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను.+ఆయన ప్రజలందరి సమక్షంలో,+ 19  యెహోవా మందిర ప్రాంగణాల్లో,+యెరూషలేము మధ్యలో నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. యెహోవాను* స్తుతించండి!*+

అధస్సూచీలు

లేదా “నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే యెహోవా” అయ్యుంటుంది.
లేదా “వంగి, వింటాడు.”
అక్ష., “షియోల్‌ కష్టాలు నన్ను కనుగొన్నాయి.”
లేదా “దయ.”
పదకోశం చూడండి.
లేదా “గొప్ప రక్షణ.”
లేదా “గంభీరమైన విషయం.”
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”