ఆమోసు 6:1-14

  • నిశ్చింతగా ఉన్న ప్రజలకు శ్రమ! (1-14)

    • దంతపు మంచాలు; ద్రాక్షారసంతో నిండిన గిన్నెలు (4, 6)

6  “సీయోనులో నిశ్చింతగా ఉన్న ప్రజలారా, మీకు శ్రమ!సమరయ పర్వతం మీద సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్న ప్రజలారా, మీకు శ్రమ!+అత్యంత ప్రాముఖ్యమైన జనంలోని ప్రముఖులకు,ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఎవరి దగ్గరికైతే వెళ్తున్నారో ఆ ప్రముఖులకు శ్రమ!  2  కల్నేకు వెళ్లి చూడండి. అక్కడి నుండి హమాతు+ మహా నగరానికి వెళ్లండి,ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి. అవి వీటి* కన్నా గొప్ప రాజ్యాలా?వాళ్ల ప్రాంతం మీకన్నా పెద్దదా?  3  మీరు విపత్తు వచ్చే రోజును మర్చిపోతూ+దౌర్జన్యం నిండిన పరిపాలనను* స్థాపిస్తున్నారా?+  4  వాళ్లు మందలోని పొట్టేళ్లను, కొవ్విన దూడల్ని* తింటూ+దంతపు+ మంచాల మీద పడుకుంటున్నారు, పాన్పుల* మీద వాలిపోతున్నారు;+  5  వీణ* శబ్దానికి తగ్గట్టు పాటలు కడుతున్నారు,+దావీదులా సంగీత వాద్యాల్ని కనిపెడుతున్నారు;+  6  వాళ్లు గిన్నె నిండా ద్రాక్షారసం తాగుతున్నారు,+అతి శ్రేష్ఠమైన తైలాలు ఒంటికి రాసుకుంటున్నారు. కానీ వాళ్లు యోసేపు వినాశనాన్ని పట్టించుకోవడం లేదు.*+  7  కాబట్టి మొదట వాళ్లే బందీలుగా తీసుకెళ్లబడతారు,+వాళ్ల అల్లరి విందులు ఆగిపోతాయి.  8  ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశాడు’+ అని సైన్యాలకు దేవుడైన యెహోవా ప్రకటిస్తున్నాడు,‘ “యాకోబు గర్వాన్ని నేను అసహ్యించుకుంటున్నాను,+అతని పటిష్ఠమైన బురుజుల్ని నేను ద్వేషిస్తున్నాను,+నగరాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ నేను శత్రువుల చేతికి అప్పగిస్తాను.+ 9  “ ‘ “ఒక ఇంట్లో పదిమంది మిగిలివుంటే వాళ్లు కూడా చనిపోతారు. 10  వాళ్ల బంధువు* వచ్చి, ఆ శవాల్ని బయటికి తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తాడు. అతను ఇంట్లో నుండి వాళ్ల ఎముకల్ని బయటికి తెస్తాడు; తర్వాత ఆ ఇంటి లోపలి గదుల్లో ఎవరైనా ఉంటే అతను, ‘నీతోపాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అని అడుగుతాడు. లోపలున్న వ్యక్తి, ‘ఇంకెవ్వరూ లేరు!’ అని జవాబిస్తాడు. అప్పుడతను, ‘సరే, నిశ్శబ్దంగా ఉండు! ఇది యెహోవా పేరు ఎత్తే సమయం కాదు’ అని అంటాడు.” 11  ఎందుకంటే, ఆజ్ఞ ఇస్తున్నది యెహోవాయే,+ఆయన గొప్ప ఇంటిని కూలగొట్టి ముక్కలుముక్కలు చేస్తాడు,చిన్న ఇంటిని చెత్తకుప్పగా మార్చేస్తాడు.+ 12  గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా?లేదా ఎవరైనా పశువులతో అక్కడ దున్నుతారా? మీరు న్యాయాన్ని విషపు మొక్కగా మార్చేశారు,నీతి ఫలాన్ని మాచిపత్రిగా* మార్చేశారు.+ 13  మీరు వ్యర్థమైన దాని విషయంలో సంతోషిస్తున్నారు,“మనం బలవంతులమైంది మన సొంత శక్తితో కాదా?” అని అంటున్నారు.+ 14  కాబట్టి ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను’+ అని సైన్యాలకు దేవుడైన యెహోవా అంటున్నాడు.‘వాళ్లు మిమ్మల్ని లెబో-హమాతు*+ నుండి అరాబా వాగు* వరకు అణగదొక్కుతారు.’ ”

అధస్సూచీలు

యూదా, ఇశ్రాయేలు రాజ్యాల్ని సూచిస్తున్నాయని స్పష్టమౌతోంది.
అక్ష., “పీఠాన్ని.”
లేదా “కోడెదూడల్ని.”
లేదా “సోఫాల.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “విషయంలో బెంగ పెట్టుకోలేదు.”
అక్ష., “తండ్రి సహోదరుడు.”
లేదా “చేదుగా.” పదకోశం చూడండి.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
పదకోశం చూడండి.