అపొస్తలుల కార్యాలు 5:1-42

  • అననీయ, సప్పీరా (1-11)

  • అపొస్తలులు ఎన్నో సూచనలు చేయడం (12-16)

  • చెరసాలలో వేయబడడం, విడుదలవ్వడం (17-21ఎ)

  • మళ్లీ మహాసభ ముందుకు తీసుకురాబడడం (21బి-32)

    • ‘దేవునికే లోబడాలి, మనుషులకు కాదు’ (29)

  • గమలీయేలు సలహా (33-40)

  • ఇంటింటా ప్రకటించడం (41, 42)

5  అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి తమ ఆస్తిలో కొంత అమ్మాడు.  కానీ వచ్చిన దానిలో కొంత డబ్బును రహస్యంగా తన దగ్గరే పెట్టుకున్నాడు, ఈ విషయం అతని భార్యకు కూడా తెలుసు. అతను మిగతా డబ్బును తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.+  అయితే పేతురు ఇలా అన్నాడు: “అననీయా, పవిత్రశక్తిని మోసం చేసేలా,+ పొలం డబ్బులో కొంత రహస్యంగా నీ దగ్గర పెట్టుకునేలా* సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు?  నువ్వు దాన్ని అమ్మకముందు ఆ భూమి నీదే కదా? దాన్ని అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ దగ్గరే ఉంది కదా? ఇలాంటి చెడ్డపని చేయాలని అసలు నీకెలా అనిపించింది? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు.”  ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి చనిపోయాడు. దాని గురించి విన్న వాళ్లందరికీ చాలా భయమేసింది.  తర్వాత అక్కడున్న కొంతమంది యువకులు లేచి అతన్ని బట్టల్లో చుట్టి, మోసుకెళ్లి, పాతిపెట్టారు.  సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత, జరిగింది తెలియక అతని భార్య అక్కడికి వచ్చింది.  పేతురు ఆమెను, “చెప్పు, మీరిద్దరు ఇంత మొత్తానికే పొలాన్ని అమ్మారా?” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాం” అంది.  అప్పుడు పేతురు ఆమెతో, “యెహోవా* పవిత్రశక్తిని పరీక్షించాలని మీరిద్దరూ కలిసి ఎందుకు అనుకున్నారు? ఇదిగో! నీ భర్తను పాతిపెట్టినవాళ్లు తలుపు దగ్గరే ఉన్నారు, వాళ్లు నిన్ను కూడా మోసుకెళ్తారు” అన్నాడు. 10  ఆ క్షణమే ఆమె పేతురు పాదాల దగ్గర కుప్పకూలి చనిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చినప్పుడు ఆమె చనిపోయి ఉండడం చూసి, ఆమెను బయటికి మోసుకెళ్లి, ఆమె భర్త పక్కనే ఆమెను పాతిపెట్టారు. 11  దాంతో సంఘమంతటికీ, ఈ విషయాల గురించి విన్న వాళ్లందరికీ చాలా భయమేసింది. 12  అంతేకాదు, అపొస్తలులు ప్రజల మధ్య ఎన్నో సూచనలు, అద్భుతాలు చేస్తూ వచ్చారు.+ వాళ్లంతా సొలొమోను మంటపంలో కలుసుకునేవాళ్లు.+ 13  వేరే ఎవ్వరికీ వాళ్లతో కలిసే ధైర్యం లేకపోయింది. అయినా, ప్రజలు వాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్లు. 14  అంతేకాదు ఇంకా చాలామంది స్త్రీపురుషులు ప్రభువు మీద విశ్వాసముంచి శిష్యులయ్యారు.+ 15  చివరికి ప్రజలు రోగుల్ని ముఖ్య వీధుల్లోకి తీసుకొచ్చి చిన్న పరుపుల మీద, చాపల మీద పడుకోబెట్టారు; పేతురు అటువైపుగా వెళ్తున్నప్పుడు కనీసం అతని నీడైనా వాళ్లలో కొంతమంది మీద పడాలని అలా చేశారు.+ 16  పైగా, యెరూషలేము చుట్టుపక్కల నగరాల నుండి ప్రజలు గుంపులుగుంపులుగా వస్తూ ఉన్నారు. వాళ్లు రోగుల్ని, అపవిత్ర దూతలు* పట్టినవాళ్లను మోసుకొని వచ్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు బాగయ్యారు. 17  అయితే అసూయతో నిండిపోయిన ప్రధానయాజకుడు, అతనితో ఉన్న వాళ్లందరూ అంటే సద్దూకయ్యుల తెగవాళ్లు కోపంతో లేచి 18  అపొస్తలుల్ని పట్టుకుని* చెరసాలలో వేశారు.+ 19  కానీ రాత్రిపూట యెహోవా* దూత ఆ చెరసాల తలుపులు తెరిచి,+ వాళ్లను బయటికి తీసుకొచ్చి ఇలా చెప్పాడు: 20  “మీరు ఆలయానికి వెళ్లి, రాబోయే జీవితం గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉండండి.” 21  ఆ మాటలు విన్నాక, వాళ్లు తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రధానయాజకుడు, అతనితో ఉన్నవాళ్లు వచ్చాక వాళ్లు మహాసభను, ఇశ్రాయేలీయుల* పెద్దలందర్నీ* సమావేశపర్చారు. అపొస్తలుల్ని తమ ముందుకు తీసుకురమ్మని అధికారుల్ని చెరసాలకు పంపించారు. 22  అయితే ఆ అధికారులు అక్కడికి వెళ్లినప్పుడు, వాళ్లకు చెరసాలలో అపొస్తలులు కనిపించలేదు. దాంతో వాళ్లు తిరిగొచ్చి ఆ విషయం చెప్పారు. 23  వాళ్లు ఇలా అన్నారు: “చెరసాల భద్రంగా తాళం వేసి ఉంది. భటులు తలుపుల దగ్గరే నిలబడి ఉన్నారు. కానీ దాన్ని తెరిచినప్పుడు లోపల ఎవరూ లేరు.” 24  ఆలయ పర్యవేక్షకుడు, ముఖ్య యాజకులు ఆ మాటలు విన్నప్పుడు, ఇది ఎక్కడికి దారితీస్తుందో అని కంగారుపడ్డారు. 25  అయితే ఒక వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చి, “ఇదిగో! మీరు చెరసాలలో వేసినవాళ్లు ఆలయంలో ఉన్నారు, వాళ్లు ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26  అప్పుడు ఆలయ పర్యవేక్షకుడు తన అధికారులతో పాటు వెళ్లి వాళ్లను తీసుకొచ్చాడు. కానీ వాళ్లమీద ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే ప్రజలు తమను రాళ్లతో కొట్టి చంపుతారేమో అని వాళ్లు భయపడ్డారు.+ 27  కాబట్టి వాళ్లు ఆ అపొస్తలుల్ని తీసుకొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధానయాజకుడు వాళ్లను ప్రశ్నిస్తూ 28  ఇలా అన్నాడు: “ఆ పేరున ఇక బోధించవద్దని మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాం.+ అయినాసరే, మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు. మీరు ఆ వ్యక్తి చావుకు* మమ్మల్ని బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారు.”+ 29  అప్పుడు పేతురు, మిగతా అపొస్తలులు ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.+ 30  మీరు కొయ్యకు* వేలాడదీసి చంపిన యేసును మన పూర్వీకుల దేవుడు లేపాడు.+ 31  తన కుడిపక్కన కూర్చునేలా దేవుడు ఆయన్ని హెచ్చించాడు.+ ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొందేలా+ దేవుడు ఆయన్ని ముఖ్య ప్రతినిధిగా,+ రక్షకునిగా+ నియమించాడు. 32  ఈ విషయాలకు మేము సాక్షులం.+ తనకు లోబడేవాళ్లకు* దేవుడు ఇచ్చిన పవిత్రశక్తి కూడా వీటికి సాక్షిగా ఉంది.”+ 33  ఆ మాట విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు అపొస్తలుల్ని చంపాలనుకున్నారు. 34  అయితే గమలీయేలు+ అనే ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలబడ్డాడు. అతను ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడు. అతను, అపొస్తలుల్ని కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించాడు. 35  తర్వాత, అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీళ్లకు విధించాలనుకుంటున్న శిక్ష విషయంలో జాగ్రత్తగా ఉండండి. 36  కొంతకాలం క్రితం, థూదా అనే వ్యక్తి తాను ఒక ప్రముఖుణ్ణని చెప్పుకున్నాడు. దాదాపు 400 మంది అతనితో చేరారు. అయితే అతను చంపబడ్డాడు. అప్పుడు అతని గుంపు చెల్లాచెదురైపోయింది, ఎక్కడా లేకుండా పోయింది. 37  ఆ తర్వాత, జనసంఖ్య తీసుకున్న రోజుల్లో గలిలయవాడైన యూదా బయల్దేరాడు. అతను ప్రజలు తనను అనుసరించేలా చేసుకున్నాడు. అతను కూడా లేకుండా పోయాడు, అతన్ని అనుసరించిన వాళ్లందరూ చెల్లాచెదురైపోయారు. 38  కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఈ మనుషుల జోలికి వెళ్లకండి, వాళ్లను అలా వదిలేయండి. ఈ ఆలోచన గానీ ఈ పని గానీ మనుషుల నుండి వచ్చినదైతే అది నాశనమైపోతుంది. 39  కానీ అది దేవుని నుండి వచ్చినదైతే, మీరు దాన్ని నాశనం చేయలేరు.+ చివరికి మీరు దేవునితోనే పోరాడేవాళ్లు అవుతారేమో.”+ 40  వాళ్లు అతని మాట విని అపొస్తలుల్ని పిలిపించి, వాళ్లను కొట్టించి,+ ఇకమీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి వాళ్లను వదిలేశారు. 41  వాళ్లు యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ+ మహాసభ నుండి వెళ్లిపోయారు. 42  వాళ్లు ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా+ మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన అంటే యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.+

అధస్సూచీలు

లేదా “దగ్గర పెట్టుకునేట్టు తెగించేలా.”
అనుబంధం A5 చూడండి.
పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
లేదా “బంధించి.”
అనుబంధం A5 చూడండి.
అక్ష., “ఇశ్రాయేలు కుమారుల.”
లేదా “పెద్దల సభ అంతటినీ.”
అక్ష., “రక్తానికి.”
లేదా “చెట్టుకు.”
అంటే, పరిపాలకునిగా తనకు లోబడేవాళ్లకు.