అపొస్తలుల కార్యాలు 28:1-31

  • మెలితే తీరానికి చేరుకోవడం (1-6)

  • పొప్లి వాళ్ల నాన్నను బాగుచేయడం (7-10)

  • రోముకు ప్రయాణం (11-16)

  • రోములో ఉన్న యూదులతో పౌలు మాట్లాడడం (17-29)

  • పౌలు రెండేళ్లు ధైర్యంగా ప్రకటించడం (30, 31)

28  మేము క్షేమంగా తీరాన్ని చేరుకున్న తర్వాత, ఆ ద్వీపం పేరు మెలితే+ అని తెలుసుకున్నాం.  ఆ ద్వీపవాసులు* మానవత్వంతో మా మీద ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం కురుస్తోంది, చలిగా ఉంది కాబట్టి వాళ్లు మంట వెలిగించి, ప్రేమతో మమ్మల్నందర్నీ చేర్చుకున్నారు.  అయితే పౌలు మోపెడు కట్టెలు పోగేసి వాటిని ఆ మంటలో వేసినప్పుడు, ఆ సెగకు ఒక విషసర్పం బయటికొచ్చి అతని చేతిని కరిచి పట్టుకుంది.  ఆ విషసర్పం పౌలు చేతికి వేలాడుతుండడం చూసి ఆ ద్వీపవాసులు, “ఇతను ఖచ్చితంగా హంతకుడు. సముద్రం నుండి తప్పించుకున్నా న్యాయం* ఇతన్ని బ్రతకనివ్వలేదు” అని చెప్పుకున్నారు.  అయితే పౌలు తన చేతిని విదిలించడంతో ఆ విషసర్పం మంటల్లో పడింది. దాని కాటు వల్ల అతనికి ఏ హానీ జరగలేదు.  వాళ్లు మాత్రం అతని శరీరం వాచిపోతుందేమో, అతను ఉన్నట్టుండి కిందపడి చనిపోతాడేమో అని చూస్తూ ఉన్నారు. ఎంతసేపైనా అతనికి ఏ హానీ జరగకపోవడంతో వాళ్లు తమ అభిప్రాయం మార్చుకొని, అతనొక దేవుడు అనడం మొదలుపెట్టారు.  ఆ ద్వీప ప్రముఖుడు పొప్లికి ఆ చుట్టుపక్కల కొన్ని భూములు ఉన్నాయి. అతను మమ్మల్ని ఆహ్వానించి, మూడురోజుల పాటు మాకు అతిథిమర్యాదలు చేశాడు.  అయితే పొప్లి వాళ్ల నాన్న అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉన్నాడు. అతను జ్వరంతో, జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్లి, ప్రార్థించి, అతని మీద చేతులుంచి అతన్ని బాగుచేశాడు.+  ఇది జరిగిన తర్వాత, ఆ ద్వీపంలో అనారోగ్యంతో బాధపడుతున్న మిగతావాళ్లు కూడా పౌలు దగ్గరికి వచ్చి బాగయ్యారు.+ 10  అంతేకాదు ఆ ద్వీపవాసులు ఎన్నో బహుమతులు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు, మేము ఓడలో బయల్దేరే సమయం వచ్చినప్పుడు మాకు కావాల్సినవన్నీ తెచ్చి ఇచ్చారు. 11  మూడు నెలల తర్వాత మేము “ద్యుపతి కుమారులు” అనే చిహ్నం ఉన్న ఓడలో బయల్దేరాం. ఆ ఓడ అలెక్సంద్రియ నుండి వచ్చి చలికాలం అక్కడే ఉండిపోయింది. 12  మేము సురకూసై ఓడరేవుకు చేరుకొని అక్కడ మూడు రోజులు ఉన్నాం. 13  అక్కడి నుండి బయల్దేరి రేగియుకు వచ్చాం. ఒక రోజు తర్వాత, దక్షిణ గాలి వీచడంతో రెండో రోజు పొతియొలీకి చేరుకున్నాం. 14  అక్కడ మాకు సహోదరులు కలిశారు. వాళ్లు ఒక వారం రోజులు తమతో ఉండమని బ్రతిమాలడంతో ఏడు రోజులు వాళ్లతోపాటు ఉండి ఆ తర్వాత రోముకు బయల్దేరాం. 15  మేము రోముకు వస్తున్నామని అక్కడి సహోదరులు విన్నప్పుడు వాళ్లు మమ్మల్ని కలుసుకోవడానికి త్రిసత్రముల దగ్గరికి వచ్చారు. కొంతమందైతే, అప్పీయా సంత వరకూ వచ్చారు. పౌలు వాళ్లను చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.+ 16  చివరికి మేము రోముకు వచ్చినప్పుడు, ఒక సైనికుడి కాపలాలో పౌలు తన ఇంట్లో ఒంటరిగా ఉండడానికి అనుమతి దొరికింది. 17  అయితే మూడు రోజుల తర్వాత పౌలు అక్కడి యూదుల్లో ప్రముఖుల్ని పిలిపించాడు. వాళ్లు వచ్చినప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “సహోదరులారా, మన ప్రజలకు గానీ, మన పూర్వీకుల ఆచారాలకు గానీ వ్యతిరేకంగా నేనేమీ చేయకపోయినా,+ నన్ను యెరూషలేములో బంధించి రోమీయుల చేతికి అప్పగించారు.+ 18  నన్ను విచారణ చేసిన తర్వాత,+ మరణశిక్ష వేయడానికి ఏ కారణం లేకపోవడంతో+ వాళ్లు నన్ను విడుదల చేయాలని అనుకున్నారు. 19  కానీ యూదులు అందుకు ఒప్పుకోకపోయేసరికి, నేను కైసరుకు విన్నవించుకుంటానని చెప్పాల్సి వచ్చింది.+ అంతేగానీ నా ప్రజల మీద ఆరోపణలు చేయాలనేది నా ఉద్దేశం కాదు. 20  ఇందుకే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని వేడుకున్నాను. ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారో ఆయన వల్లే నేను ఇలా సంకెళ్లతో బంధించబడి ఉన్నాను.”+ 21  అప్పుడు వాళ్లు పౌలుతో ఇలా అన్నారు: “నీ గురించి యూదయ నుండి మాకు ఉత్తరాలు అందలేదు. అక్కడి నుండి వచ్చిన సహోదరుల్లో ఎవరూ నీ గురించి చెప్పలేదు, ఏమాత్రం చెడుగా మాట్లాడలేదు. 22  అయితే నీ ఆలోచనలు ఏమిటో నీ నోటి నుండే వినడం సరైనదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే, నిజంగానే ప్రతీచోట ప్రజలు ఈ తెగకు+ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని+ మాకు తెలుసు.” 23  వాళ్లు పౌలును కలవడానికి ఒక రోజును అనుకున్నారు. ఆ రోజు అంతకుముందు కన్నా ఎక్కువమంది పౌలు ఉంటున్న ఇంటికి వచ్చారు. పౌలు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ వాళ్లకు ప్రకటించాడు. అలా మోషే ధర్మశాస్త్రంలో,+ ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటిని+ ఉపయోగిస్తూ యేసు గురించి వాళ్లను ఒప్పించడానికి+ ప్రయత్నించాడు. 24  పౌలు చెప్పింది కొంతమంది నమ్మారు, ఇంకొంతమంది నమ్మలేదు. 25  వాళ్లకు వేర్వేరు అభిప్రాయాలు ఉండడంతో వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు: “పవిత్రశక్తి యెషయా ప్రవక్త ద్వారా మీ పూర్వీకులతో చెప్పిన ఈ మాట నిజమే: 26  ‘ఈ ప్రజల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు: “మీరు వినడం వరకు వింటారు కానీ మీకు ఏమాత్రం అర్థంకాదు, మీరు చూడడం వరకు చూస్తారు కానీ మీకు ఏమీ కనిపించదు.+ 27  ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వాళ్లు చెవులతో వింటారు కానీ స్పందించరు. వాళ్లు తమ కళ్లు మూసుకున్నారు. వాళ్లు తమ కళ్లతో చూడడానికి, చెవులతో వినడానికి ఇష్టపడట్లేదు; తమ హృదయాలతో అర్థంచేసుకొని నావైపుకు తిరగడానికి నిరాకరిస్తున్నారు. నేను వాళ్లను బాగుచేయకుండా ఉండాలని అలా చేస్తున్నారు.” ’+ 28  కాబట్టి, దేవుడు అనుగ్రహించే రక్షణ గురించిన సందేశం అన్యజనుల దగ్గరికి పంపించబడిందని+ మీరు తెలుసుకోవాలి. వాళ్లు తప్పకుండా దాన్ని వింటారు.”+ 29  *—— 30  కాబట్టి పౌలు తన అద్దె ఇంట్లో నివసిస్తూ పూర్తిగా రెండు సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు.+ అతను తన దగ్గరికి వచ్చే వాళ్లందర్నీ సాదరంగా ఆహ్వానిస్తూ, 31  ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నాడు.+

అధస్సూచీలు

లేదా “వేరే భాష మాట్లాడే ప్రజలు.”
గ్రీకులో డైకె. ఈ పదం న్యాయాన్ని అమలు చేసే దేవతను సూచిస్తుండవచ్చు.
అనుబంధం A3 చూడండి.